బాలీవుడ్ ని అలరించిన తమిళ పొన్ను... వైజయంతిమాల
నటీనటులు ఎవరైనా అవకాశాలకోసం ఎదురుచూస్తుంటారు. కాల్షీట్లు సర్దలేనంత బిజీగా వుంటే తప్ప సాధారణంగా వచ్చిన అవకాశాలను వదలుకోరు. పైగా కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్ ఆమె ఇంటికి వెళ్లి ’ఇండియన్-2’ చిత్రంలో నటించమని కోరినా ఆమె సున్నితంగా తిరస్కరించింది. మరో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆమెను తన సినిమాలో నటించమని కోరినా తనకు సినిమాలలో నటించడం ఇష్టంలేదు అని తప్పుకుంది. ఆ విలక్షణ నటీమణే అందాల నాట్యరాణి వైజయంతిమాల. నిన్నటితరం హిందీ, తెలుగు, తమిళ, మళయాళ, బెంగాలీ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఒక వెలుగు వెలిగిన ఆ వైజయంతిమాలను తెలియని సినీప్రియులు వుండరు. 1969లో విడుదలైన ‘ప్రిన్స్’, ‘ప్యార్ హి ప్యార్’ సినిమాల తరవాత వైజయంతిమాల సినిమాలలో నటనకు స్వస్తి చెప్పింది. ఈ సినిమా షూటింగులు 1968లో జరుగుతున్నప్పుడే రాజకపూర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ చమన్ లాల్ బాలి ని వివాహమాడింది. మంచి స్టార్డంను వదలుకొని సినిమాలకు స్వస్తిచెప్పడం వెనుక రాజకపూర్ తనని వివాహమాడాలని ప్రయత్నించడం, దాంతో రాజకపూర్ భార్య కృష్ణకపూర్ పిల్లలతో వెళ్ళిపోయి హోటల్లో మకాం పెట్టడం వంటి సంఘటనలతో విసిగిపోయిన వైజయంతిమాల అందుకు పరిష్కార మార్గంగా డాక్టర్ బాలిని వివాహమాడిందని బాలీవుడ్ వర్గాల కథనం. అయితే తనను ‘న్యుమోనియా’ వ్యాధి నుంచి కాపాడి స్వస్థత చేకూర్చిన డాక్టర్ బాలికి కృతజ్ఞతా పూర్వకంగా ఆయనను వివాహమాడానని వైజయంతిమాల తన ఆత్మకథలో చెప్పుకుంది. అంతేకాదు ఆమె బాలి ని వివాహమాడేందుకు అతని మొదటి భార్యకు భరణం కింద పెద్ద మొత్తాన్ని తనే చెల్లించిందనే వదంతి కూడా లేకపోలేదు. కామినీ కౌశల్, మధుబాల తరవాత వైజయంతిమాల దిలీప్ కుమార్ కు మూడవ ప్రేయసి అని కూడా చెప్పుకుంటారు. ఏది ఏమైనా వైజయంతిమాల జీవితం ఒడుదుడుకుల సంగమం. వైజయంతిమాల కేవలం సినీ నటి మాత్రమే కాదు... ఆమె ఒక మంచి సంప్రదాయ భరతనాట్య కళాకారిణి, మంచి గాయని, గోల్ఫ్ క్రీడాకారిణి అన్నిటికీ మించి ఒక గొప్ప రాజకీయవేత్త. చెన్నై లో స్థిరనివాసమేర్పరచుకొని ఎనభయ్యవ పడిలో కూడా నాట్య ప్రదర్శనలు ఇస్తున్న వైజయంతిమాల 83వ పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు...


మద్రాసులో తొలిరోజులు...
వైజయంతిమాల పుట్టింది 13 ఆగస్టు 1936న మద్రాసు నగరంలో. తండ్రి మాండ్యమ్ ధాటి రామన్. తల్లి వసుంధరా దేవి. వీరిది తమిళ అయ్యంగార్ కుటుంబం. ఇల్లు ట్రిప్లికేన్ వద్ద వున్న పార్థసారథి కోవెలకు దగ్గరలోనే. అయితే వైజయంతిమాల తన చిన్నతనంలో అమ్మమ్మ యడుగిరిదేవి వద్దనే పెరిగింది. తల్లి వసుంధరాదేవి తమిళ సినిమాలలో పేరుతెచ్చుకున్న నటి. 1940లో వచ్చిన తమిళ చిత్రం ‘మంగమ్మ శబదం’ లో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. వైజయంతిమాల కు ఏడేళ్లు వున్నప్పుడు పవిత్ర వాటికన్ సిటీ (ఇటలీ)లో పోప్ పయస్ XII ఎదుట సంప్రదాయ భారత నాట్య ప్రదర్శన ఇవ్వడం ఒక మరచిపోలేని జ్ఞాపకం. మద్రాసు చర్చ్ పార్కు సమీపంలో వుండే సేక్రెడ్ హార్ట్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో వైజయంతిమాల చదువుకుంది. వళవూర్ రామయ్య పిళ్ళై వద్ద భారతనాట్యం, మణక్కల్ శివరాజ అయ్యర్ వద్ద కర్నాటక సంగీతంలో శిక్షణ తీసుకుంది. తన పదమూడవ ఏటనే వైజయంతిమాల భరతనాట్యంలో అరంగేట్రం చేసింది.


జీవితం తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం...
ఎ.వి.ఎం సంస్థ మెయ్యప్ప చెట్టియార్ 1949లో ‘వాఘై’ సినిమా నిర్మిస్తూ కొత్త హీరోయిన్ కోసం అన్వేషించారు. చిత్ర రచయిత, దర్శకుడు ఎం.వి. రామన్ గోఖలే హాలులో వైజయంతిమాల నాట్యప్రదర్శన చూసి మెయ్యప్పన్ కు సిఫారసు చేశాడు. అలా వైజయంతిమాల ‘మోహన’ అనే హీరోయిన్ పాత్రకు ఎంపికైంది. ఇందులో రెండవ హీరోయిన్ పాత్రను ద్రౌపది పోషించగా, సహస్రనామం, రామచంద్రన్, సారంగపాణి ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. తిరువాన్కూరు సోదరీమణులు లలిత, పద్మిని ఇందులో నాట్యం చేస్తూ ప్రత్యేకపాత్రల్లో కనిపిస్తారు. ఉత్తమ తమిళచిత్ర బహుమతి అందుకున్న ఈ చిత్రం వ్యాపారపరంగా బాగా హిట్టయింది. వైజయంతిమాల కు ఉత్తమ నటి బహుమతి లభించింది. ఈ విజయంతో ఇదే సినిమాను సంవత్సరం తరవాత 1950లో ఎ.వి.ఎం వారే తెలుగులో ‘జీవితం’ పేరుతో పునర్నిర్మించారు. తెలుగులో కూడా వైజయంతిమాల నటించగా ద్రౌపది పోషించిన పాత్రను ఎస్.వరలక్ష్మి ధరించింది. తెలుగులో వైజయంతిమాల నటించిన తొలిచిత్రం ఇదే. ఇతర పాత్రలను సి.ఎస్.ఆర్, సి.హెచ్. నారాయణరావు, ఐ.ఆర్. రామచంద్రన్, దొరస్వామి పోషించారు. ఇందులో తెలుగు సంభాషణలు వైజయంతిమాల సొంతంగానే చెప్పింది. తరవాత 1951లో ఎ.వి.ఎం వారే ఈ సినిమాను ’బహార్’ పేరుతో తొలిసారి హిందీలో నిర్మించారు. వైజయంతిమాల హిందీ వర్షన్ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఎస్. వరలక్ష్మి పాత్రను హిందీ లో పండరీబాయి పోషించగా సహాయక పాత్రల్లో కరణ్ దేవన్, ప్రాణ్, ఓంప్రకాష్, సుందర్, తబస్సుమ్ నటించారు. తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో ఒకేసారి తెరంగేట్రం చేసిన ఘనత వైజయంతిమాలకు దక్కింది. హిందీలో డబ్బింగ్ చెప్పడానికి వైజయంతిమాల హిందీ ప్రచారసభలో శిక్షణ తీసుకుంది. వైజయంతిమాల చేసిన కొత్తరకం నృత్యాలు హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఆ సంవత్సరం అత్యధిక రాబడి సాధించిన హిందీ చిత్రాల్లో ‘బహార్’ చిత్రం ఆరవ స్థానం ఆక్రమించింది. మూడు వర్షన్లలో నిర్మించిన ఈ సినిమా విజయవంతం కావడంతో 1954లో ఎ.వి.ఎం వారు వైజయంతిమాల నే హీరోయిన్ గా పెట్టి ‘పెణ్ణ్’ చిత్రాన్ని నిర్మించారు. ఆమెకు జోడీగా జెమిని గణేశన్ నటించగా ఇతర పాత్రలను ఎస్. బాలచందర్, అంజలి దేవి, నాగయ్య, వి.కె. రామస్వామి, సారంగపాణి పోషించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘సంఘం’ పేరుతో, హిందీలో ‘లడ్కి’ పేరుతో సమాంతరంగా నిర్మించారు. తెలుగులో హీరోగా ఎన్.టి. రామారావు నటించగా, ఇతర పాత్రలను ఎస్.వి. రంగారావు, నాగయ్య, రామణారెడ్డి, బాలచందర్, సహస్రనామం నటించారు. హిందీలో కిశోర్ కుమార్ హీరోగా, ఇతర పాత్రల్లో భరత్ భూషణ్, నాగయ్య, ఓంప్రకాష్, రాజ్ మెహ్రా, లీలా మిశ్రా నటించారు. ఇందులో సుశీల, టి.ఎస్. భగవతి ఆలపించిన “సుందరాంగ మరువగాలేరా రావేలా నా అందచందముల దాచితి నీకై రావేలా” సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూడు వర్శన్లకు ఆర్. సుదర్శనమే సంగీతం సమకూర్చారు. మూడు భాషల్లోనూ ఈ సినిమా హిట్ గా నిలిస్తే, హిందీలో అత్యధికరాబడి ఆర్జించిన రెండవ చిత్రంగా రికార్డులకెక్కింది.


హిందీ సినిమాల్లో సూపర్ హీరోయిన్ గా ఎదిగి...
1954 లో నందలాల్ జశ్వంతలాల్ దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ సినిమా ‘నాగిన్’ లో వైజయంతిమాల ప్రదీప్ కుమార్ సరసన హీరోయిన్ గా నటిస్తూ నాట్యంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఈ సినిమాలో హేమంతకుమార్ స్వరపరచిన ‘మన్ డోలే మేరా తన్ డోలే’ నేటికీ సంగీతాభిమానులకు వీనులవిందు చేస్తూనేవుంది. వసూళ్ళలో మొదటి స్థానం ఆక్రమించి నిర్మాతకు కాసులు రాల్చిన చిత్రం ‘నాగిన్’. ఈ సినిమాలో నటించేనాటికి వైజయంతిమాలకు కేవలం పద్దెనిమిదేళ్ళు. వైజయంతిమాల సూపర్ స్టార్ గా ఎదగడానికి సహకరించిన సినిమా కూడా ఇదే. తరవాత కిశోర్ కుమార్ సరసన నటించిన ‘మిస్ మాల’ కూడా బాక్సాఫీస్ హిట్టే. తరవాతి సంవత్సరం వైజయంతిమాల ఐదు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వాటిలో మొదటిది అబ్దుల్ రషీద్ కర్దార్ నిర్మించిన ‘యాస్మిన్’. ఇందులో అద్భుత ఛాయాగ్రహణం నిర్వహించిన ద్వారకా దివేచాకు ఫిలింఫేర్ బహుమతి లభించింది. తరవాతి సినిమాలు కిశోర్ కుమార్ తో ‘పెహలీ ఝలక్’, ప్రదీప్ కుమార్ తో ‘సితార’, కరణ్ దేవన్ తో ‘జషణ్’. అయితే ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. అప్పుడే దర్శక నిర్మాత బిమల్ రాయ్ నిర్మించిన ‘దేవదాస్’ హిందీ చిత్రంలో సుచిత్రాసేన్ తొలిసారి పార్వతిగా నటించగా, వైజయంతిమాల చంద్రముఖి పాత్రను పోషించింది. నర్గీస్ అంగీకరించకపోవడం చేతనే చంద్రముఖి పాత్ర వైజయంతిమాలకు దక్కింది. దిలీప్ కుమార్ దేవదాసు గా నటించిన ఈ చిత్రంలో చంద్రముఖి పాత్ర పోషణకు వైజయంతిమాలకు ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ బహుమతి ప్రకటించారు. తన పాత్ర పార్వతి పాత్రకు ఏమాత్రం తీసిపోదని, సహాయనటిగా బహుమతి ప్రకటించడం ఫిలింఫేర్ యాజమాన్యం చేసిన తప్పని విమర్శిస్తూ ఆ బహుమతిని వైజయంతిమాల తిరస్కరించడం ఆరోజుల్లో పెద్ద సంచలనం రేపింది. కేవలం గ్లామర్ తారగానే కాకుండా నటనా పటిమగల నటిగా ఈ చిత్రం వైజయంతిమాలకు పేరుతెచ్చిపెట్టింది. 1956లో వైజయంతిమాల ప్రదీప్ కుమార్ సరసన ‘తాజ్’, ‘పత్రాణి’, ’అంజాన్’ సినిమాలలో నటించింది. సునీల్ దత్ సరసన ‘కిస్మత్ కా ఖేల్’ చిత్రంలో నటించింది. తమిళంలో టి.ఆర్. రఘునాథ్ దర్శకత్వం వహించిన ‘కణవనే కన్కండ దైవమ్’ చిత్రాన్ని హిందీలో ‘దేవత’ చిత్రంగా నిర్మించగా తమిళంలో లలిత ధరించిన ‘నాగరాణి’ అనే వాంప్ పాత్రను వైజయంతిమాల పోషించింది. రాజకుమారి నళినిగా తమిళం, హిందీలో అంజలీదేవి నటించింది. ఈ రెండు వర్షన్లలో హీరో జెమినీ గణేశనే. ఇందులో వైజయంతిమాల నాట్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దశ తిప్పిన ‘కొత్త యుగం’...
దర్శక నిర్మాత బి.ఆర్. చోప్రా 1957లో ‘నయా దౌర్’ అనే ఒక క్రీడా చిత్రాన్ని నిర్మించారు. అందులో దిలీప్ కుమార్, వైజయంతిమాల హీరో హీరోయిన్లు. అద్భుత విజయాన్ని సాధించిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని దానికి వున్న ప్రజాదరణను దృష్టిలో వుంచుకొని 2007లో కలర్ లోకి మార్చారు. మనిషికి యంత్రానికి మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్ర నేపథ్యం. గుర్రపు బగ్గీ నడిపే ఒక పల్లెటూరి చిన్నోడు, ధనవంతుడైన ఒక బస్ యజమానితో పరుగు పందెం కాయడం ఆరోజుల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. 2001లో వచ్చిన ఆమిర్ ఖాన్ చిత్రం ‘లగాన్’ కు ఈ సినిమాయే ప్రేరణ. ఈ సినిమాలో వైజయంతిమాల హీరోయిన్ గా నటించేందుకు చాలా గమ్మత్తుగా అవకాశం దొరికింది. ముందు మధుబాలను హీరోయిన్ గా తీసుకున్నారు. పక్షం రోజులు షూటింగు జరిగాక బి.ఆర్. చోప్రా భోపాల్ కు దగ్గరలో వున్న బుధనీ వద్ద అవుట్ డోర్ షూటింగ్ కు ఏర్పాట్లు చేశారు. అప్పటికే దిలీప్ కుమార్-మధుబాల ప్రేమలో వున్నారు. దాంతో మధుబాల తండ్రి అతవుల్లా ఖాన్ అవుట్ డోర్ షూటింగ్ కు అభ్యంతరం చెప్పాడు. చోప్రా మధుబాల మీద కోర్టులో కేసు బనాయించి ఆమె స్థానంలో వైజయంతిమాలను తీసుకొని సినిమా పూర్తి చేశారు. కోర్టు కేసు చోప్రాకు అనుకూలంగా వచ్చింది. ఈ కేసు విచారణలో వుండగా సినిమా విడుదలైంది. దాంతో అనుకోని ప్రచారం ఈ సినిమాకు దక్కి సూపర్ హిట్ గా నిలిచి ఆరోజుల్లోనే ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూళ్ల ఆర్జన చేసింది. ఓ.పి. నయ్యర్ సంగీతం ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్ గా నిలిచింది. “సాథీ హాథ్ బడానా”, “మాంగ్ కే సాథ్” పాటలు నేటికీ తాజాగా అనిపిస్తాయి. తమిళంలో వైజయంతిమాల కు వున్న ‘క్రేజ్’ ని దృష్టిలో వుంచుకొని ‘నయా దౌర్’ చిత్రాన్ని తమిళంలో ‘పాట్టాలియిన్ శబథం’ పేరుతో డబ్ చేసి విజయం సాధించారు. వైజయంతిమాల కు ఈ చిత్రం ద్వారా మంచిపేరొచ్చింది. అదే సంవత్సరం బల్రాజ్ సాహ్ని తో వైజయంతిమాల అమియా చక్రవర్తి నిర్మించిన చివరి చిత్రం ‘కట్ పుత్లీ’ లో నటించింది. బి.ఆర్. చోప్రా 1958లో సునీల్ దత్, వైజయంతిమాల కాంబినేషన్ లో ‘సాధన’ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వైజయంతిమాల పడుపు వృత్తి తో జీవించే వనితగా నటించగా ఆమెను ప్రేమించే ప్రొఫెసర్ గా సునీల్ దత్ నటించారు. నటి నిమ్మి ఈ చిత్రంలో నటించేందుకు నిరాకరించగా, స్క్రిప్టు వినిన వైజయంతిమాల వేశ్య పాత్ర ధరించేందుకు ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్టై ఎనిమిది కోట్లకు పైగా ఆర్జించింది. వైజయంతిమాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ బహుమతి దక్కింది. జెమినీ వాసన్ స్వీయ దర్శకత్వంలో ‘వంజికోట్టై వాలిబాన్’ అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు. జెమినీ గణేశన్, వైజయంతిమాల, పద్మిని, వీరప్పన్ నటించిన ఈ చిత్రానికి సి. రామచంద్ర సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఇదే చిత్రాన్ని ఏకకాలంలో హిందీలో ‘రాజ్ తిలక్’ పేరుతో నిర్మించారు. తమిళ నటులే హిందీలో నటించడం జరిగింది. యువరాణి మందాకినీ పాత్రలో వైజయంతిమాల ఒదిగిపోయింది. ‘చంద్రలేఖ’ సినిమా నిర్మించిన పదేళ్ళ తరవాత వాసన్ నిర్మించిన సినిమా ఇది. అయితే చంద్రలేఖ చిత్రంలో కొన్ని సన్నివేశాలను, క్లిప్పింగులను ఈ సినిమాలో వాడుకున్నారు. ఈ చిత్రం 100 వరోజు కూడా హౌస్ ఫుల్ తో నడవడం ఎంత విజయవంతమైందో తెలియజేస్తుంది. హిందీ వర్షన్ కు ప్రఖ్యాత దర్శక నిర్మాత రామానంద్ సాగర్ స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. అయితే హిందీ వర్షన్ మాత్రం విజయవంతం కాలేదు. జెమినీ సంస్థ నిర్మించిన సినిమాల్లో పెద్ద ఫ్లాప్ గా నిలిచిన చిత్రం ‘రాజ్ తిలక్’. తరవాత బిమల్ రాయ్ వైజయంతిమాల, దిలీప్ కుమార్ లతో ‘మధుమతి’ చిత్రాన్నినిర్మించారు. నాలుగు కోట్ల రాబడి ఆర్జించిన ఈ సినిమా అటు దిలీప్ కుమార్ కు ఇటు వైజయంతిమాల కు మంచి పేరు తెచ్చిపెట్టింది. పునర్జన్మ నేపథం లో నిర్మించిన తొలితరం సినిమా ‘మధుమతి’. ఈ చిత్ర సింహభాగం అవుట్ డోర్ లో నైనిటాల్ వంటి హిల్ స్టేషన్ లలో చిత్రీకరించారు. ఇందులో సలీల్ చౌదరి స్వరపరచిన పాటల రికార్డులు రికార్డుస్థాయిలో అమ్ముడు పోయాయి. “సుహానా సఫర్ అవుర్ యే మౌసమ్ హసీ’ (ముఖేష్), “దిల్ తడప్ తడప్ కే కెహ్ రహా హై (ముఖేష్, లతాజీ)”; “ఆజా రే పరదేశి, మై తో కబ్ ఎ ఖడీ ఇస్ పార్” (లతాజీ); “ఘడీ ఘడీ మేరా దిల్ ధడకే” (లతాజీ) పాటలు ఎంత ఆదరణ పొందినదీ చెప్పనవసరం లేదు. జెకోస్లావేకియాలో జరిగిన కార్లోవి వరీ చలనచిత్ర ఉత్సవంలో ప్రదర్శనకు నోచుకున్న సినిమా ఇది. రష్యన్ భాషలోకి అనువదించి అక్కడ ‘మధుమతి’ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం ఉత్తమనటిగా వైజయంతిమాలకు ఫిలింఫేర్ బహుమతి తెచ్చిపెట్టింది.


కొనసాగిన విజయ పరంపర...
దేవానంద్, వైజయంతిమాల కలిసి వీనస్ పిక్చర్స్ మద్రాస్ వారి నిర్మాణతలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ‘అమర్ దీప్’ చిత్రంలో నటించారు. 1959లో వైజయంతిమాల, దిలీప్ కుమార్ కాంబినేషన్ లో బి. నాగిరెడ్డి ‘పైగామ్’ చిత్రాన్ని నిర్మించారు. రాజకుమార్, బి. సరోజాదేవి కూడా మరొక జంటగా నటించగా దిలీప్ కుమార్ తో కలిసి రాజకుమార్ తొలిసారి నటించడం ఈ సినిమా విశేషం. తమిళంలో శివాజీ గనేశన్ నటించిన ‘ఇరుంబు తిరై’ సినిమాకు ఈ చిత్రం రీమేక్. ‘పెళ్ళికానుక’ చిత్రాన్ని సి.వి. శ్రీధర్ వైజయంతిమాల హీరోయిన్ గా ‘వాసంతి’ పేరుతో హిందీలో పునర్నిర్మించారు. ఈ సినిమాలన్నీ బాగా ఆడాయి. 1961లో నితిన్ బోస్ దర్శకత్వంలో దిలీప్ కుమార్ నిర్మించిన ‘గంగా జమునా’ సినిమాలో వైజయంతిమాల హీరోయిన్ గా నటించింది. మెహబూబ్ ఖాన్ చిత్రం ‘మదర్ ఇండియా’ ఈ సినిమాకు స్పూర్తి. ఈ సినిమా ఆరోజుల్లోనే ఆరు కోట్ల ఆదాయం రికార్డు చేసింది. గోల్డన్ జూబిలీ జరుపుకున్న ఈ చిత్రంలో నటనకు వైజయంతిమాలకు ఉత్తమనటిగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. ‘చిత్తూర్ రాణి పద్మిని’ తమిళ సినిమాలో 1963 లో వైజయంతిమాలనటించింది. మనోజ్ కుమార్ తో రాజేంద్ర భాటియా నిర్మించిన ‘డాక్టర్ విద్య’ చిత్రంలో కూడా వైజయంతిమాల నటించింది.


రాజకపూర్ సంగంలో...
1964లో రాజకపూర్ నిర్మించిన ‘సంగం’ సూపర్ హిట్ ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో వైజయంతిమాల నటించింది. రాజకపూర్ నిర్మించిన తొలి రంగుల టెక్నికలర్ చిత్రం ‘సంగం’. రాజకపూర్ నిర్మించిన సినిమాలలోకెల్లా అద్భుత కలక్షనలతోబాటు, పేరు కూడా సంపాదించిన సినిమా ఇది. సంగం సినిమా ప్రీమియర్ షో తరవాత రచయిత ఇందర్ రాజ్ ఆనంద్-రాజకపూర్ లకు చిన్న ఘర్షణ జరిగింది. ఆవేశంలో ఇందర్ రాజ్ ఆనంద్ చెయ్యి పొరపాటున రాజకపూర్ చెంపను తాకింది. దాంతో ఇందర్ రాజ్ ఆనంద్ ను రాజకపూర్ టీమ్ మొత్తం బాయ్ కాట్ చేసింది. అంతే కాదు ఈ రచయిత వరసగా 18 సినిమాలకు రచన చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దాంతో ఇందర్ రాజ్ రాజకపూర్ కు క్షమాపణ చెప్పాడు. రాజేంద్రకుమార్ రెండవ హీరోగా నటించేందుకు ఒప్పుకోకపోతే దానిని ఫిరోజ్ ఖాన్ కు ఇచ్చేందుకు రాజ్ నిర్ణయించుకున్నాడు. కానీ, రాజకపూర్ చిత్రాన్ని వద్దనుకునే నటుడెవరైనా ఉంటాడా? వైజయంతిమాల ను హీరోయిన్ గా నిర్ణయించి మద్రాస్ లో వున్న ఆమెకు రాజకపూర్ “బోల్ రాధా బోల్ సంగం హోగా యా నహీ” అని టెలిగ్రాం ఇచ్చారు. దానికి వైజయంతిమాల “హోగా... హోగా... హోగా” అంటూ టెలిగ్రాం ద్వారా జవాబిచ్చింది. అదే సినిమాలో పాటై కూర్చుంది. రాజకపూర్ ఎడిటర్ గా కూడా వ్యవహరించిన తొలిచిత్రం ’సంగం’. ఈ సినిమా విడుదలయ్యాక వైజయంతిమాల డాక్టర్ బాలి ని వివాహమాడింది. సంగం సినిమాకు రెండు ఇంటర్ వెల్స్ వుండడం చలనచిత్ర చరిత్రలో తొలిసారి. తరవాత ‘మేరా నామ్ జోకర్’ లో రిపీట్ అయింది. ఈ చిత్రానికి నాలుగు ఫిలింఫేర్ బహుమతులు లభించాయి. ఈ సినిమా ప్రింట్లను లండన్ లో ముద్రించారు. అదే సంవత్సరం వైజయంతిమాల దిలీప్ కుమార్ హీరోగా శశిధర్ ముఖర్జీ నిర్మించిన ‘లీడర్’ సినిమాలో నటించింది. ఈ సినిమాకు దిలీప్ కుమార్ కథ సమకూర్చడం విశేషం. బాక్సాఫీస్ హిట్టయిన ఈ చిత్రంలో నటనకు దిలీప్ కుమార్ కు ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. వైజయంతిమాల కు గొప్పగా నచ్చిన చిత్రం ‘ఆమ్రపాలి’. ఎఫ్.సి. మెహ్రా నిర్మాణతలో లేఖ్ టాండన్ దర్శకత్వం వహించిన ఈ చారిత్రాత్మక చిత్రంలో వైజయంతిమాల నాట్య విన్యాసాలు చూసి తీరవలసిందే. సునీల్ దత్ హీరోగా నటించిన ఈ సినిమాకు శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు. ఆస్కార్ బహుమతికోసం ఈచిత్రాన్ని భారత ప్రభుత్వం అధికారిక ఎంట్రీగా ఎంపికచేసింది. సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా క్లాసిక్ గా నిలిచింది. ప్రముఖ నాట్యాచార్యుడు గోపికృష్ణ ‘ఆమ్రపాలి’ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. తరవాత వైజయంతిమాల నటించిన చిత్రం ‘సూరజ్’. వీనస్ పిక్చర్స్ మద్రాస్ వారు తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించిన ‘సూరజ్’ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది. ఇందులో వైజయంతిమాల కు జంటగా రాజేంద్రకుమార్ నటించారు. “బహారోం ఫూల్ బరసావో” (రఫీ), “తిత్లీ ఉడీ వుడ్ జో చలీ” (శారద), “దేఖో మేరా దిల్ మచల్ గయా” (శారద), “కైసే సమఝావూ బడీ నా సమఝ్ హో” (రఫీ, ఆశా)పాటలు సూపర్ హిట్లయినాయి. గతంలో వైజయంతిమాల-రాజేంద్రకుమార్ కలిసి నటించిన ‘ఆశ్ కా పంఛీ’, ‘సంగం’, ‘జిందగీ’ సినిమా లు కూడా సూపర్ హిట్లే. ఈ సినిమాకు సంగీతం సమకూర్చిన శంకర్-జైకిషన్, ‘బహారోం ఫూల్ బరసావో’ పాట లిఖించిన హస్రత్ జైపురి, ఆ పాటను గానం చేసిన మహమ్మద్ రఫీ లకు ఫిలింఫేర్ బహుమతులు లభించాయి. 1967లో వచ్చిన వైజయంతిమాల మరో సూపర్ డూపర్ హిట్ చిత్రం నవకేతన్ ఫిలిమ్స్ తరఫున దేవానంద్ నిర్మించిన ‘జ్యూవెల్ తీఫ్’. గోల్డీ (విజయానంద్) దర్శకత్వ పనితనం ఈ సినిమాలో చూడాల్సిందే. సచిన్ దేవ్ బర్మన్ సంగీతం సమకూర్చిన “రులాకే గయా సపనా మేరా” (లతాజీ), “ఏ దిల్ న హోతా బేచారా” (కిశోర్ కుమార్), “ఆస్మాన్ కే నీచే అవుర్ ఆజ్ హమ్ కే పీఛే” (కిశోర్ కుమార్,లతాజీ), “హోఠోమే ఐసీ బాత్ మే దబా కే చలి ఆయ్” (లతాజీ, భుపెందర్ సింగ్) పాటలు సూపర్ హిట్లే. వైజయంతిమాల నటించిన ఆఖరి చిత్రం ‘ప్రిన్స్’ 1969 లో విడుదలైంది. షమ్మికపూర్ హీరోగా నటించిన ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్. “బదన్ పే సితారే లపేతే హుయే” (రఫీ), “థండీ థండీ హవా మే దిల్ భర్ జాయ్” (లతాజీ) వంటి శంకర్ జైకిషన్ పాటలు చిరకాలం గుర్తుండేవే. వైజయంతిమాల కు మొత్తం 18 ఫిలింఫేర్/బెంగాల్ ఫిలిం జర్నలిస్టుల సంఘం అవార్డులు రాగా 19 సార్లు ఆమె పేరు నామినేట్ అయింది. ఇవి కాకుండా బాలీవుడ్ మూవీ అవార్డ్, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి లివింగ్ లెజెండ్ అవార్డ్, తమిళనాడు ప్రభుత్వ అరసవి నాట్య కలైంగర్ అవార్డ్, సంగీత నాటక అకాడమీ అవార్డ్, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అవార్డ్, జ్ఞాన కళాభారతి అవార్డ్, భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డ్, అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ అవార్డ్, తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డ్, అన్నామలై విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ వంటి ఎన్నో బహుమతులు వైజయంతిమాల సిగలో మాలలయ్యాయి. 1984 లో వైజయంతిమాల మద్రాసు సౌత్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు స్థానం గెలుచుకున్నారు. వైజయంతి మాల కు సుచింద్ర ఒక్కరే సంతానం.ఆత్మాభిమాని...
1967లో విజయా సంస్థ ‘రామ్ అవుర్ శ్యామ్’ (తెలుగు రాముదు భీముడుకు రీమేక్) చిత్రం నిర్మిస్తూ అందులో వైజయంతిమాల, హేమామాలిని లను హీరోయిన్లు గా బుక్ చేసినప్పుడు షూటింగ్ షెడ్యూలు తారుమారయింది. దిలీప్ కుమార్ సవరించి ఇచ్చిన కాల్షీట్లతో వైజయంతిమాల కాల్షీట్లు సర్దుబాటుచేయమని నిర్మాత నాగిరెడ్డి వైజయంతిమాలను అడిగారు. “దిలీప్ కోసం నా కాల్షీట్లు సర్డుకోవలసిన అవసరం లేదు” అని నాగిరెడ్డితో చెప్పి ఆ సినిమా నుంచి తప్పుకొబోయిన వైజయంతిమాలను నాగిరెడ్డి సర్దిచెప్పడంతో మొదటిరోజు షూటింగుకు హాజరైంది. ఆ చిత్రానికి దర్శకుడు తాపీ చాణక్య. ఆమె షూటింగుకు వచ్చేసరికి దిలీప్ కుమార్ చాణక్యను పక్కనపెట్టి, మార్కస్ బార్ట్ లే చేత లైటింగ్ సర్దించి తను కెమెరా వెనక కూర్చుని ట్రాలీ తోయిస్తూ, దర్శకుడు చేయాల్సిన పని తను చేస్తూ కనిపించాడు. వైజయంతిమాలకు కోపం నషాళానికి అంటింది. నాగిరెడ్డి వద్దకు వచ్చి “ఈ సినిమాకి దర్శకుడు చాణక్యా లేక దిలీప్ కుమారా? ఇలాయితే నేను నటించను” అనిచెప్పి వెళ్ళిపోయింది. ఆ విషయం దిలీప్ కుమార్ కు తెలిసింది. వైజయంతిమాల బొంబాయి వెళ్ళిపోయి అక్కడి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు చెప్పి ‘రామ్ అవుర్ శ్యామ్’ చిత్రంలో అసోసియేషన్ సభ్యులెవరూ నటించకూడదని తీర్మానం చేయించింది. అసోసియేషన్ కార్యవర్గం నాగిరెడ్డిని ఈ సినిమాను డ్రాప్ చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ నాగిరెడ్డి మద్రాసు హైకోర్టులో కేసు వేసి ‘స్టే’ ఆర్డర్ తెచ్చుకున్నారు. తరవాత రాజీ కుదిరింది. వైజయంతిమాలకు పూర్తి పారితోషికం ఇచ్చిన తరవాతే అసోసియేషన్ సభ్యులు ఆ సినిమాలో నటించారు. అదీ వైజయంతిమాల పట్టుదల! దాంతో వైజయంతిమాల స్థానాన్ని వహీదా రెహమాన్ తో భర్తీచేశారు నాగిరెడ్డి.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.