అందం.. హుందాతనం.. వహీదా సొంతం!
వహీదా రెహమాన్‌.. ఈ పేరు తల్చుకుంటే అలనాటి ఓ అందాల తార రూపం కళ్ల ముందు కదులుతుంది. ఓ హుందా అయిన అభినయం మనసులో మెదులుతుంది. ‘రోజులు మారాయి’ సినిమాలో ‘ఏరువాక సాగారోరన్నో... చిన్నన్న...’ పాట గుర్తుంటే, అందులో ఆమె చేసిన సొగసైన నాట్యం కూడా కళ్లకి కడుతుంది. అలాగే ‘జయసింహ’ సినిమాలో ‘తొలిరేయి గడిచేనే... చెలియా రాడాయనే సామీ... నేడూ...’ అనే పాట ఎప్పుడు విన్నా, ఓ అందచందాల రాకుమారి హుందా అయిన విరహ సన్నివేశం గుర్తొస్తుంది. ఇక హిందీ వెండితెరను తల్చుకుంటే ఆమె నటించిన ఎన్నో హిట్‌ సినిమాలు గుర్తొచ్చి ఆమె నటనా కౌశలాన్ని మరిచిపోకుండా చేస్తాయి. అందం, అభినయం, చక్కటి హుందాతనంతో ఆకట్టుకున్న కథానాయిక వహీదా రెహమాన్‌ టాలీవుడ్‌ ద్వారా తెరకు పరిచయమై బాలీవుడ్‌లో సత్తాచాటింది. మే 14న ఆమె పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమె జీవితంలోని మరికొన్ని విశేషాలు..


* డాక్టర్‌ కాబోయి యాక్టర్‌గా..
వహీదా.. మే 14, 1936న తమిళనాడులోని చెంగల్పట్టులో పుట్టింది. తండ్రి జిల్లా మేజిస్ట్రేట్‌ కావడంతో బదిలీల వల్ల వహీదా కుటుంబం చిన్నతనం నుంచి దక్షిణాదిలో వివిధ ప్రాంతాలకు మారాల్సి వచ్చింది. చిన్నతనం నుంచి వహీదా డాక్టర్‌ కావాలనుకుంది. అయితే కుటుంబ పరిస్థితుల వల్ల యాక్టర్‌ కావాల్సి వచ్చింది. దీని వెనుక మరో కారణం కూడా ఉంది. చిన్నతనంలో ఊపిరితిత్తుల్లో అనారోగ్యం వల్ల చదువును మధ్యలో ఆపేశారు. వహీదా 12 ఏళ్ల వయసులోనే ఆమె తండ్రికి, ఆ తర్వాత కొద్ది రోజులకు తల్లికి దూరమయ్యారు. తనకు బాలీవుడ్‌లో తొలి సినిమా అవకాశమిచ్చిన గురుదత్‌తో కొన్నాళ్లు ప్రేమబంధం కొనసాగింది. ఆ బంధం తెగాక వహీదా నటుడు కన్వల్జీత్‌ సింగ్‌ (శశి రేఖి)ను వివాహమాడారు. వీరికి సోహైల్, ఖాస్వీ అని ఇద్దరు సంతానం. వహీదాను తొలిసారిగా గురుదత్‌ హైదరాబాద్‌లో కలిశారు. అందుకే వహీదా సొంతూరు హైదరాబాద్‌ అంటుంటారని వహీదా ఒకసారి స్పష్టం చేశారు.


* ‘ఎన్టీఆర్‌’కు జోడీగా చేసి.. బాలీవుడ్‌లో పాగా వేసి..
వహీదా హిందీ, బెంగాలీ, తెలుగు సినిమాల్లో అలరించారు. ఒకవిధంగా 1950, 60ల కాలంలో బాలీవుడ్‌ వెండితెరను ఏలిందనడంలో సందేహం లేదు. ‘చౌద్వీ కా చాంద్‌ హో, యా అఫ్తాబ్‌ హో...’ పాటలో వహీదాను చూసి మెచ్చుకోనివారు లేరు. వేశ్య పాత్ర నుంచి శక్తిమంతమైన నాయిక పాత్ర వరకు అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారామె. వహీదా బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందినా తెరంగేట్రం టాలీవుడ్‌లోనే జరిగింది. ఎన్టీ రామారావు కథానాయకుడిగా నటించిన ‘జయసింహ’ (1955)తో వహీదా రెహమాన్‌ కథానాయికగా నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే ‘రోజులుమారాయి’ విడుదలైంది. ‘కాలమ్‌ మారి పోచు’ (1956)తో తమిళంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’ చేశారు. సుమారు 20 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు పరిశ్రమకు వచ్చారు. అలా వచ్చి ‘బంగారు కలలు’ (1974), ‘సింహాసనం’ (1986), ‘చుక్కల్లో చంద్రుడు’ (2006) చేశారు. సత్యజిత్‌ రే ‘అభిజాన్‌’ (1962)తో బెంగాలీ పరిశ్రమలోకి ప్రవేశించారు వహీదా. అయితే ఆ తర్వాత చాలా ఏళ్లు బెంగాలీ పరిశ్రమ వైపు చూడలేదు. 2005లో ‘15 పార్క్‌ అవెన్యూ’ అనే ఆంగ్ల/బెంగాలీ చిత్రంతో బెంగాలీ పరిశ్రమకు వెళ్లారు. అక్కడకు పదేళ్ల తర్వాత అంటే 2015లో ‘ఆరిష్‌నగర్‌’తో మళ్లీ బెంగాలీ సినిమా చేశారు.


* గురుదత్‌తో ప్రేమ కబుర్లు..
‘రోజులుమారాయి’లో వహీదాను చూసిన ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు గురుదత్‌ ‘సీఐడీ’ (1956) అనే హిందీ సినిమాలో వ్యాంప్‌ పాత్ర కోసం ఎంపిక చేశారు. అలాంటి పాత్ర అని చూడకుండా అంగీకరించిన వహీదా ఆ తర్వాత స్టార్‌ నాయికగా వెలుగొందారు. ఆ సినిమా తర్వాత ‘ప్యాసా’లోనూ వేశ్య పాత్రలో కనిపించారు. ఈ సయమంలోనే గురుదత్‌− వహీదా మధ్య ప్రేమ చిగురించిందని వార్తలొచ్చాయి. ఆ వెంటనే గురుదత్‌తో మూడో సినిమాగా ‘కాగజ్‌ కె పూల్‌’ చేశారు. ఈ సినిమా గురుదత్‌ జీవితకథ అని అనేవారు. ఈ సినిమా తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అప్పటివరకు అప్పుడప్పుడు తమ బంధం గురించి చెప్పిన వహీదా ఒక్కసారిగా మౌనం వహించారు. అయితే ఆ తర్వాత కూడా ఇద్దరి కలయికలో ‘షాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’ వచ్చింది. ఆ సినిమాకు ప్రెసిడెంట్‌ సిల్వర్‌ మెడల్‌ కూడా వచ్చింది. బెర్లిన్‌ చిత్రోత్సవంలోనూ ఆ సినిమా ప్రదర్శించారు. ఇద్దరి మధ్య దూరం పెరిగినా సినిమాలు చేయడం మానలేదు. వీరి కలయికలో 1963లో ‘ముజే జీనే దో’ వచ్చింది. అక్కడకు కొద్ది రోజులకు 1964లో గురుదత్‌ మద్యంలో నిద్రమాత్రలు కలుపుకొని తాగి మరణించారు.


* కెరీర్‌లో భారీ హిట్‌..
దేవానంద్, వహీదాది సూపర్‌హిట్‌ జోడీ. వీరి కలయికలో వచ్చిన చాలా సినిమాలు విజయాలు సాధించాయి. వీరి కలయికలో వచ్చిన ‘సీఐడీ’, ‘సోల్వా సాల్‌’, ‘కాలాబజార్‌’, ‘బాత్‌ ఏక్‌ రాత్‌ కి’, ‘గైడ్‌’ మంచి విజయాలు అందుకోగా, ‘రూప్‌కి రాణి చోరోంకి రాజా’, ప్రేమ్‌పూజారి’ పరాజయం పాలయ్యాయి. ‘గైడ్‌’తో వహీదా స్టార్‌ నాయికగా మారారు. ఆ తర్వాత ధర్మేంద్రతో ఓ సినిమా చేసినా అది నిరాశపరిచింది. అయితే దిలీప్‌కుమార్‌తో చేసిన ‘దిల్‌ దియా దర్ద్‌ లియా’, ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’, ‘ఆద్మి’ చేశారు వహీదా. రాజేంద్రకుమార్‌తో ‘పాల్కి’, ‘దార్తి’, ‘షత్రంజ్‌’ వచ్చాయి. రాజ్‌కపూర్‌ సరసన ‘ఏక్‌ దిల్‌ సౌ అఫ్సానే’, ‘తీస్రీ కసమ్‌’, సినిమాలు చేశారామె. రాజేష్‌ ఖన్నా ‘ఖామోషీ’ (1970)తో కెరీర్‌లోనే భారీ హిట్‌ అందుకున్నారు వహీదా రెహమాన్‌. హిందీలో ‘లవ్‌ ఇన్‌ ముంబయి’ (2013) ఇప్పటి వరకు ఆఖరి సినిమా. ‘విశ్వరూపం 2’ చిత్రీకరణ దశలో ఉంది.


* బిగ్‌బికి తల్లిగా..
1980ల కాలానికి వచ్చేసరికి వహీదా రెహమాన్‌ తల్లి పాత్రలవైపు మరలారు. ఎక్కువగా అమితాబ్‌ బచ్చన్‌ సినిమాల్లో తల్లిగా నటించేవారు. ‘నమక్‌ హలాల్‌’, ‘హిమ్మత్‌వాలా’, ‘కూలీ’, ‘చాందిని’ తదితర చిత్రాల్లో అమితాబ్‌కు తల్లిగా కనిపించారు. 1991లో ‘లమ్‌హే’ తర్వాత వహీదా కొన్నాళ్లు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత 2002తో ‘ఓమ్‌ జై జగదీష్‌’తో పునరాగమనం చేశారు. ఆ తర్వాత చేసిన ‘వాటర్‌’, ‘రంగ్‌ దే బసంతి’, ‘15 పార్క్‌ అవెన్యూ’, ‘దిల్లీ 6’ లాంటి విజయవంతమైన చిత్రాలు చేశారామె. జయాబాధురికి తల్లిగా ‘ఫాగున్‌’లో నటించారు. అక్కడి నుంచే వహీదాకు తల్లిపాత్రల అవకాశాలు ఎక్కువయ్యాయి.


పురస్కారాలు
* ‘రేష్మ ఔర్‌ షేరా’కు 1971లో జాతీయ పురస్కారం.
* ‘గైడ్‌’ (1965), ‘నీల్‌కమల్‌’ (1968) చిత్రాలకుగాను ఫిలింఫేర్‌ ఉత్తమ నటి.
* ఫిలింఫేర్‌ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని 1994లో అందుకున్నారు.
* కేంద్ర ప్రభుత్వం 2011లో  పురస్కారంతో గౌరవించింది.© Sitara 2018.
Powered by WinRace Technologies.