జీవిత పాత్రల్లో...

ఓ బేస్‌బాల్‌ క్రీడాకారుడు... ఓ గాయకుడు... ఓ సుప్రీం కోర్టు లాయర్‌... ఈ వ్యక్తుల మధ్య సంబంధమేమీ లేదు. కానీ వీరందరి పాత్రలనూ వెండితెరపై ధరించి ప్రశంసలు పొందిన నటుడు చాడ్విక్‌ బోస్‌మేన్‌. జీవిత పాత్రలు ధరించి మెప్పించడం మామూలు విషయం కాదు. ఆయా వ్యక్తుల జీవితాన్ని మధించి, ఆవాహన చేసుకుని అభినయించాలి. అదే చేసి విలక్షణ నటుడిగా ప్రాచుర్యం పొందాడితడు. అమెరికా బేస్‌బాల్‌ క్రీడాకారుడు జాక్‌ రోజ్‌వెల్ట్‌ రాబిన్‌సన్‌ పాత్రను ‘42’ చిత్రంలోను, సంగీత నృత్య కళాకారుడు జేమ్స్‌బ్రౌన్‌ పాత్రలో ‘గెట్‌ ఆన్‌ అప్‌’లోను, అమెరికాలో గొప్ప లాయర్‌గా పేరు తెచ్చుకున్న థర్‌గుడ్‌ మార్షల్‌ పాత్రను ‘మార్షల్‌’ సినిమాలోను ధరించి ఒప్పించాడు. వీటితో పాటు అతీత శక్తులున్న సూపర్‌ హీరో బ్లాక్‌ పాంథర్‌ పాత్ర ద్వారా యువతరాన్ని ఆకట్టుకున్నాడు. ‘కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్‌’, ‘బ్లాక్‌ పాంథర్‌’, ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’, ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ సినిమాల ద్వారా అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కూడా ఇంటింటి వీక్షకులను అలరించాడు.అమెరికాలో 1976 నవంబర్‌ 29న పుట్టిన చాడ్విక్, కాలేజీ రోజుల్లోనే నాటకాలు రాసి స్నేహితులతో కలిసి ప్రదర్శించాడు. ఆ తర్వాత అభినయం, దర్శకత్వ శాఖలను అభ్యసించాడు. టీవీల ద్వారా పేరు తెచ్చుకుని సినిమాల్లోకి ప్రవేశించాడు. 

 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.