భరతనాట్యం... నటన... జంతుప్రేమ!
దక్షిణాది భాషలతోపాటు.. హిందీలోనూ నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న నటి అమల అక్కినేని. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన ఆమె తొలినాళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలతో అభిమానుల్ని సంపాదించుకొన్నారు. ఆ తర్వాత నటిగా మారారు. ప్రస్తుతం జంతు సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అమల తండ్రి బెంగాలీ నేవీ అధికారి. తల్లి ఐరిష్‌ జాతీయురాలు. ఈ దంపతులిద్దరికీ 1968 సెప్టెంబరు 12న కోల్‌కత్తాలో అమల జన్మించారు. భరతనాట్యంలో డిగ్రీ పట్టా అందుకొన్న అమల, అనుకోకుండా ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్‌ దృష్టిలో పడి... ఆయన ప్రోద్భలంతోనే సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళంలో నటించిన తొలి చిత్రం ‘మైథిలి ఎన్నై కాథలి’ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. తమిళంతో పాటు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించే అవకాశాలు అందుకొన్నారు. నాగార్జునతో కలిసి తెలుగులో ‘కిరాయి దాదా’, ‘చినబాబు’, ‘శివ’, ‘ప్రేమ యుద్ధం’, ‘నిర్ణయం’ తదితర చిత్రాల్లో నటించి మంచి జోడీగా ప్రేక్షకుల మనసు దోచుకొన్నారు. సినీ ప్రయాణంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన అమల మళ్లీ 2012లో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంతో అమ్మ పాత్రలో నటించి ప్రేక్షకులతో కంట తడి పెట్టించారు. ఆ తర్వాత ‘మనం’లోనూ ఓ చిన్న పాత్రలో మెరిశారు. హిందీ, మలయాళం భాషల్లోనూ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా సినిమాలు చేశారు. నాగార్జున, అమలకి జన్మించిన అఖిల్‌ అక్కినేని ప్రస్తుతం కథానాయకుడిగా కొనసాగుతున్నారు. జంతు ప్రేమికురాలైన అమల బ్లూ క్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అనే స్వచ్ఛంద సేవా సంస్థని నెలకొల్పారు. జంతు సేవా, సంరక్షణ కార్యక్రమాల్ని చేపడుతున్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.