కవ్వించే అందం.. కమలినీ సొంతం
‘అందంగా లేనా.. అసలేం బాలేనా..’ అంటూ యువ హృదయాలను కవ్వించిందా అందం. ‘నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిల..’ అంటూ కుర్ర గుండెలను కదిలించింది. అందుకే యువతరానికి ఆమె అందం సాధించడమే ఓ ‘గమ్యం’ అయింది. లెక్చరర్‌గా మారినా ప్రేమలేఖలతో వెంటపడింది. తను చూపు విసిరితే చాలు ‘హ్యపీడేస్‌’ మొదలైనట్లే అనుకుంది. ఇదంతా కమలినీ ముఖర్జీ చేసిన మాయ. పద్ధతైన చీరకట్టుతో పదహారణాల తెలుగు పడుచులా.. చూపు తిప్పుకోనివ్వని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎన్నో చిత్రాల్లో సినీ ప్రియులను కట్టిపడేసింది కమలినీ...

article image
* ఎయిడ్స్‌ నేపథ్యంలో తొలిసినిమా..
కమలినీ ముఖర్జీ 1980 మార్చి 4న పశ్చిమ బంగాలోని కలకత్తాలో జన్మించింది. చిన్నతనం నుంచి కమలినీకి నటనపై ఆసక్తి ఎక్కువ. ఆ ఇష్టంతోనే చాలా ఏళ్లపాటు భరత నాట్యం నేర్చుకుంది. ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో డిగ్రీ చేసిన కమలినీ కవిత్వం రాయడంలోనూ మంచి దిట్టే. తను రాసిన ఓ కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికైంది. ఆమె మోడల్‌గా మారాక నీల్‌కమల్, పారాచూట్, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, ఆయుష్‌ వంటి వ్యాపార ఉత్పత్తుల ప్రకటన చిత్రాల్లో నటించింది. ఆమె తొలిసారి ‘ఫిర్‌ మిలేంగే’ (2004) అనే హిందీ చిత్రంతో వెండితెరపై మెరిసింది. ఎయిడ్స్‌ నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో కమలినీ నటనకు మంచి పేరువచ్చింది. దీనికి అనేక పురస్కారాలు దక్కాయి. తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆనంద్‌’, ‘గోదావరి’, ‘గమ్యం’, ‘జల్సా’, ‘నాగవల్లి’ సినిమాలు కమలినీ ముఖర్జీకి తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టాయి.

* ‘ఆనంద్‌’తో టాలీవుడ్‌ మంచి కాఫీ ఇచ్చింది...
కమలిని ముఖర్జీ తెలుగులో నటించిన మొదటి సినిమా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనంద్‌’. ఇందులో రూప అనే పాత్రలో స్వతంత్ర భావాలున్న యువతిగా కమలినీ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. చిన్నచిన్న భావోద్వేగాలను సైతం ఆమె కళ్లతో పలికించిన తీరు.. పొగరబోతుతనంతో కథానాయకుడిని అల్లరి చేసిన వైనం, అందం, అమాయకత్వంతో అలరించిన తీరు.. సినీ ప్రియులను ఎంతో ఆకట్టుకున్నాయి. నటిగా తొలి చిత్రంతోనే ఎంతో పరిణతితో కూడిన నటనను ప్రదర్శించి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రేక్షకులకు మంచి కాఫీ లాంటి చిత్రాన్ని రూచి చూపించి, నటిగా తొలి సినిమాతో నంది పురస్కారాన్ని అందుకుంది కమలినీ ముఖర్జీ.

* శేఖర్‌ కమ్ములతో ముచ్చటగా మూడు...
తన సినిమాల్లో ఎక్కువ కొత్తవాళ్లకు చోటిచ్చే దర్శకుడు శేఖర్‌ కమ్ముల.. కమలినీతో ఏకంగా మూడు సినిమాలు చేశాడు. విశేషమేమిటంటే ఆ మూడు చక్కటి విజయాలనందుకున్నాయి. తొలిసారి ‘ఆనంద్‌’ వంటి హిట్‌ తర్వాత శేఖర్‌ కమలినీతో తీసిన రెండో చిత్రం ‘గోదావరి’. సీతా మహాలక్ష్మిగా ఇందులో కమలినీ పాత్ర ఆద్యంతం ఎంతో అలరించింది. 2006లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నందుకోవడంతో పాటు ఆ ఏడాది ద్వితియ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కైవసం చేసుకుంది. ఆ తర్వాత ‘హ్యాపీడేస్‌’లో అందమైన లెక్చరర్‌గా అతిథి పాత్రలో కనిపించి యువ హృదయాలను కొల్లగొట్టింది. దీనిలో శ్రియ మేడమ్‌గా కమలినీ చేసిన సందడిని సినీ ప్రియులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇది కూడా మంచి హిట్టుగా నిలిచింది. అలా శేఖర్‌ కమ్ములకు కమలినీ ముఖర్జీ ఓ సెంటిమెంటుగా మారింది.

* వంశీ మెచ్చిన అందం..
సినీ పరిశ్రమలో వంశీ సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన చిత్రాల్లో గోదావరి అందాలు ఎంత సహజంగా, అద్భుతంగా కనువిందు చేస్తాయో.. కథానాయికల అందచందాలు అంతే ఆకట్టుకునేలా ఉంటాయి. మరి అలాంటి దర్శకుడికి కమలినీ లాంటి వయ్యారి భామ కనిపిస్తే చెప్పేదేముంటుంది. ఆయన దర్శకత్వంలో మరిన్ని సొగసులు అద్దుకోవాల్సిందే. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గోపి గోపిక గోదావరి’లో కమలినీ కథానాయికగా నటించింది. ఆ చిత్రం అంతగా ఆకట్టుకోనప్పటికీ కమలినీ అందానికి, నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

* అగ్రహీరోలతో జోడీగా..
కమలినీ ముఖర్జీ తెలుగులో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎక్కువగా యువహీరోలతోనే నటించినా తర్వాత కాలంలో పవన్‌ కల్యాణ్, వెంకటేష్, మోహన్‌లాల్‌ వంటి అగ్రహీరోలకు జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. పవన్‌ కల్యాణ్‌కు జోడీగా ‘జల్సా’లో సందడి చేసిన కమలినీ, ‘నాగవల్లి’లో వెంకటేష్‌తో కలిసి నటించింది. ఈ రెండూ మంచి విజయాలందుకున్నాయి. ఇక మోహన్‌లాల్‌తో నటించిన చిత్రం ‘మన్యంపులి’. ఇది తెలుగు, మలయాళ భాషల్లో మంచి హిట్టుగా నిలిచింది.


© Sitara 2018.
Powered by WinRace Technologies.