నందమూరి నట ‘సింహా’... బాలకృష్ణ
తండ్రికి తగ్గ తనయుడిగా.. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. అభిమానుల గుండెల్లో ‘బాలయ్య’గా, ‘యువరత్న’గా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ. బాలయ్య తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో 1960 జూన్‌ 10న నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు జన్మించారు. 1982లో వసుంధర దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు (బ్రాహ్మణి, తేజస్విని), ఒక కుమారుడు (మోక్షజ్ఞ) ఉన్నారు.

article image
 1974లో ‘తాతమ్మ కల’ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు బాలకృష్ణ. ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఆయన ‘సాహసమే జీవితం’, ‘జననీ జన్మభూమి’, ‘మంగమ్మగారి మనవడు’ చిత్రాలతో హీరోగా మంచి విజయాలందుకున్నారు. ఆ తర్వాత ‘అపూర్వ సోదరుడు’, ‘మువ్వ గోపాలుడు’, ‘ముద్దుల మావయ్య’, ‘నారీనారీ నడుమ మురారీ’, ‘లారీ డ్రైవర్‌’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక తొంభైల్లో వచ్చిన ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’, ‘సమర సింహారెడ్డి’ చిత్రాలు బాలకృష్ణ కెరీర్‌లో గొప్ప మైలురాళ్లుగా నిలిచాయి. ‘నరసింహారెడ్డి’, ‘లక్ష్మీ నరసింహా’, ‘చెన్నకేశవ రెడ్డి’, ‘శ్రీరామరాజ్యం’, ‘పాండురంగడు’, ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలు బాలకృష్ణ సినిమా కెరీర్‌ను మరింత ఎత్తుకు చేర్చాయి. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో వందకు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన బాలయ్య.. తన తండ్రి నటసార్వభౌమ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను 'కథానాయకుడు', 'మహానాయకుడు' రెండు భాగాలుగా తెరకెక్కించారు. 1994లో ‘భైరవ ద్వీపం’ చిత్రానికి ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్‌ అవార్డు, నరసింహనాయుడు (2001), సింహా (2010), లెజెండ్‌ (2014) సినిమాలకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్నారు.

రాజకీయ ప్రస్థానం:
బాలకృష్ణ  2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున అనంతపురం జిల్లా, హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.