వైవిధ్యానికి చిరునామా కమల్‌హాసన్‌
కమల్‌ హాసన్‌ విశిష్ట నటుడే కాదు ఒక విచిత్రమైన వ్యక్తి కూడా. తను నటించే సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత వుండాలని, రొటీన్‌ పాత్రలకు అది భిన్నంగా వుండాలని కోరుకునే వ్యక్తి. అందుకే అతడు సంచలన దర్శకుడు బాలచందర్‌కు సరైన జోడీ అయ్యాడు. కమల్‌ హాసన్‌ కేవలం నటుడే కాదు మంచి కథకుడు, స్కీన్ర్‌ ప్లే రచయిత, నిర్మాత, దర్శకుడు... చివరికి అజ్ఞాత సంగీత దర్శకుడు కూడా. దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్న ఒక మంచి నటుడు కమల్‌. ప్రేమలో పడే ఘోటక బ్రహ్మచారిగా ‘బ్రహ్మచారి’ (పమ్మళ్‌ కె. సంబంధం) సినిమాలో; కవల సోదరులుగా ‘అభయ్‌’ (ఆలవందాన్‌)లో; వికలాంగుడైన మానవతా వాదిగా ‘సత్యమే శివం’ (శివం)లో; సర్కస్‌ పోరాటాలు చేసే బధిరుడుగా ‘ముంబై ఎక్స్‌ ప్రెస్‌’లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన శైలిని నిలబెట్టుకున్న నటుడాయన. చలన చిత్రరంగానికి ఆయన ఒక ‘వసూల్‌ రాజా’. భారతీయుడు సినిమా రెండు వందల మిలియన్లు ఆర్జించి పెట్టిన విషయం ఈ మాటను నిజం చేసింది. దర్శకుడు కె.విశ్వనాథ్‌ మెచ్చిన నటుడు కమల్‌. నవంబర్‌ 7న కమల్‌ హసన్‌కు 64 ఏళ్లు నిండుతున్నాయి. ఆ జన్మదిన సందర్భంగా కమల్‌ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుందాం...


ఆసుపత్రి నుంచే బాల నటుడుగా...
1960లో ఎ.వి.ఎం. అధినేత మెయ్యప్ప చెట్టియార్‌ తమిళంలో ‘కళత్తూర్‌ కన్నమ్మ’ సినిమా నిర్మించారు. భీమ్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సావిత్రి, జెమిని గణేశన్‌ నాయికా నాయకులు. అందులో ఒక బాలుడి పాత్ర కోసం అన్వేషిస్తున్న మెయ్యప్పకు మద్రాసు జనరల్‌ ఆసుపత్రిలో ఒక పిల్లాడు తటస్థపడ్డాడు. అయితే అది మెయ్యప్పకు కాదు... వాళ్లావిడకు. ఐదేళ్ల వయసులో పరమక్కుడికి చెందిన ఆ బాలుడికి సైనస్‌ సమస్య తలెత్తగా మద్రాసు జనరల్‌ ఆసుపత్రికిలో చేర్చి వైద్యం ఇప్పిస్తున్నప్పుడు ఆ అబ్బాయి కలివిడిగా ఆసుపత్రి మొత్తం చుట్టి వస్తూ, అందరినీ పలకరిస్తూ, ముద్దుముద్దు మాటలు వల్లిస్తూ ఉండేవాడు. ఈ పిల్లాడికి వైద్యం అందించే డాక్టర్‌ వద్దకు మెయ్యప్ప చెట్టి భార్య కూడా వైద్య సలహా నిమిత్తం వస్తుండేది. ఈ బాలుడు ఆమెకు కూడా తారసపడి కబుర్లు చెప్పడంతో, ఆమె తన భర్తకు ఈ అబ్బాయిని గురించి చెప్పింది. ఆ కుర్రాణ్ణి స్టూడియోకి తీసుకెళ్లి స్కీన్ర్‌ టెస్టులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు స్టూడియో సిబ్బంది. ఇంకేముంది ఆ బాలుడు ‘కళత్తూర్‌ కన్నమ్మ’ సినిమాలో నటించాడు. ఆ బుడతడే మాస్టర్‌ కమల్‌ హాసన్‌Â. ఈ సినిమాను తెలుగులో ‘మావూరి అమ్మాయి’ పేరుతో ఎం.ఆర్‌.ఎం సంస్థ పేరిట మెయ్యప్ప కుమారులు కుమరన్, శరవణన్‌ అనువదించి 1960 అక్టోబరులో ఆంధ్రదేశంలో విడుదల చేశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ బాలనటుడుగా రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. ఇదే సినిమాను ఎ.వి.ఎం వారే 1962లో హిందీలో ‘మై చుప్‌ రహూంగీ’ పేరుతో పునర్నిర్మించగా అందులో మీనాకుమారి, సునీల్‌ దత్‌ జంటగా నటించారు. కమల్‌ పాత్రను హిందీలో బబ్లూ పోషించాడు. తరువాత 1969లో ఇదే సినిమాను తెలుగులో ‘మూగనోము’ (1969) పేరుతో అక్కినేని-జమున జంటగా నిర్మించారు. కమల్‌ హసన్‌ పోషించిన బాలుని పాత్రను మాస్టర్‌ బ్రహ్మాజీ ధరించాడు. కమల్‌ హాసన్‌ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్‌. నవంబర్‌ 7, 1954న తమిళనాడులోని రామనాథపురానికి చేరువలో వున్న పరమక్కుడి పట్టణంలో జన్మించాడు. తండ్రి డి.శ్రీనివాసన్‌ న్యాయవాద వృత్తిలో వుండేవారు. కమల్‌ తల్లి రాజలక్ష్మి మంచి డ్యాన్సర్‌. కమల్‌ ప్రాధమిక విద్యాభ్యాసం పరమక్కుడిలోనే జరిగింది. తరువాత వారి కుటుంబం మద్రాసులో స్థిరపడింది. మైలాపూరులోని శాంతోం పాఠశాలలో కమల్‌ చదువు కొనసాగింది. కమల్‌ తల్లి రాజలక్ష్మి తంగప్పన్‌ వద్ద నాట్యం నేర్చుకుంటూ వుండేది. ఆ సమయంలోనే కమల్‌ చదువుకుంటూనే కొన్ని సినిమాలలో చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ ఉండేవాడు. అలా తన తొలి వెండితెర పరిచయం 1970లో విడుదలైన శాండో చిన్నప్ప దేవర నిర్మించిన ‘మాణవన్‌’ చిత్రం. అందులో కమల్‌ కుట్టి పద్మిని చేసే డ్యాన్స్‌ సన్నివేశంలో ఆమెతో కలిసి కనిపిస్తాడు. డ్యాన్స్‌ డైరెక్టర్‌ తంగప్పన్‌ నిర్మించి దర్శకత్వం వహించిన ‘అణ్నై వేలంకణ్ణి’ సినిమాలో కాసేపు జీసస్‌ క్రైస్ట్‌గా కనిపిస్తాడు. కమల్‌ కొంతకాలం తంగప్పన్‌ వద్ద సహాయకుడిగా ఉంటూ డ్యాన్స్‌ నేర్చుకున్నాడు. 1973లో ముత్తురామన్‌ నిర్మించిన ‘కాశి యాతిరై‘ సినిమాలో తంగప్పన్‌కు సహాయ డ్యాన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. అదే సంవత్సరం కె.బాలచందర్‌ తొలిసారి కమల్‌ హసన్‌ చేత ‘సొల్లత్తాన్‌ నినిక్కిరేన్‌’ అనే సినిమాలో ఒక ప్రతినాయకుడిగా ప్లేబాయ్‌ పాత్రను పోషింపజేశారు. తరువాత ‘అరంగేట్రం’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమా విజయంతో హిందీలో పునర్నిర్మించిన ‘ఆయినా’ సినిమాలో రాజేష్‌ ఖన్నాతోబాటు కమల్‌ కూడా నటించడం జరిగింది. హిందీలో అతడు నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. తరువాత 1974లో తమిళంలో చాలా సహాయక పాత్రలు పోషిస్తూ వచ్చాడు. వాటిలో ‘గుమస్తావిన్‌ మగళ్’, ‘అవర్‌ ఒరు తొడర్‌ కథై’ (తెలుగులో అంతులేని కథ), ‘నాన్‌ అవనిల్లై’ సినిమాలు ముఖ్యమైనవి. అదే సంవత్సరం కమల్‌కు సేతుమాధవన్‌ మలయాళంలో నిర్మించిన ‘కన్యాకుమారి’ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. అందులో రీటా భాదురి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో నటనకు కమల్‌కు తొలి ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. అంతకు ముందు కమల్‌ 1962లో ‘కణ్ణుమ్‌ కరళుమ్’ అనే మళయాళ చిత్రంలో బాలనటుడిగా నటించాడు. 1975లో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగü్’ (తెలుగులో తూర్పు-పడమర) సినిమా హీరోగా మంచి బ్రేక్‌ ఇచ్చింది. రజనీకాంత్‌ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు మూడు జాతీయ బహుమతులు (తమిళంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయా గ్రహణం, ఉత్తమ నేపథ్య గాయని వాణిజయరాం), మూడు ఫిలింఫేర్‌ బహుమతులు (ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు-కమల్‌ హసన్‌) దక్కాయి. కమల్‌కు ఇది రెండవ ఫిలింఫేర్‌ బహుమతి కావడం విశేషం.


మన్మధలీలతో స్టార్డం...
బాలచందర్‌ దర్శకత్వంలో 1976లో ‘మన్మధ లీలై’ అనే సినిమా వచ్చింది. అందులో కమల్‌ హీరో. ఈ సినిమాతోనే జయప్రద, వై.విజయ, హేమా చౌదరి తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మన్మధలీల’గా, హిందీలో ‘మీఠీ మీఠీ బాతే’గా 1977లో డబ్‌ చేశారు. ఈ చిత్రం కమల్‌కు ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచి అతనికి హీరోగా మంచి హోదా కలిపించింది. ‘ఈ చిత్రం పదేళ్ల తరువాత వచ్చివుంటే సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచి వుండేది’ అని, సినిమా నేపథ్యాన్ని విశ్లేషించిన సినీ పండితులు చెప్పారు. ఈ సినిమా తరువాత వచ్చిన ముత్తురామన్‌ సినిమా ‘ఒరు ఊధప్పు కన్‌ సిముట్టిగిరదు’లో కమల్, సుజాత నటించారు. కమల్‌కు మూడవసారి ఫిలింఫేర్‌ బహుమతి తెచ్చిపెట్టిన చిత్రమిది. అలాగే దర్శకుడు ముత్తురామన్‌కు కూడా ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. ఈ రెండు సినిమాలతో కమల్‌ తమిళ చిత్రరంగంలో స్థిరపడిపోయారు. తరువాత వచ్చిన మరో బాలచందర్‌ సినిమా ‘అవర్గ’ (తెలుగులో ఇది కథ కాదు) కమల్‌ హాసన్‌ హోదాను పెంచింది. బాలచందర్‌ దర్శకత్వం వహించిన మరొక చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’ (తెలుగులో వచ్చిన ఓ సీత కథను తమిళంలో పునర్నిర్మించిన చిత్రం) కూడా మంచి హిట్టయింది. ఈ సినిమా ద్వారా శ్రీదేవి 13 ఏళ్ల ప్రాయంలో హీరోయిన్‌గా నటించింది. రజనీకాంత్‌ విలన్‌ పాత్ర పోషించాడు. భారతీరాజా దర్శకత్వం వహించిన ‘పత్తినారు వయత్తినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు)లో కమల్‌ పోషించిన పాత్రకు ఫిలింఫేర్‌ అవార్డుతోబాటు తమిళనాడు రాష్ట్ర బహుమతి కూడా లభించింది. గాయని జానకికి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు లభించింది. కమల్‌ హాసన్‌ కన్నడంలో బాలుమహేంద్ర నిర్మించిన ‘కోకిల’ సినిమాలో తొలిసారి నటించారు. అదే సంవత్సరం ‘అవళ్‌ ఒరు తొడర్‌ కథై’ సినిమాను ‘కబిత’ పేరుతో బెంగాలి భాషలో పునర్నిర్మిస్తే అందులో హీరోగా కమల్‌ నటించారు.

తెలుగులో కమల్‌ది మరోచరిత్ర...
కమల్‌ తెలుగులో నటించిన తొలి స్ట్రెయిట్‌ సినిమా ‘అంతులేని కథ’ (1976). అప్పుడే ‘మన్మధలీల’ డబ్బింగ్‌ వర్షన్‌ కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాలు ఆంధ్రరాష్ట్రంలో శతదినోత్సవాలు చేసుకున్నాయి. కాగా ‘మరోచరిత్ర’ సినిమా రెండవ స్ట్రెయిట్‌ చిత్రం. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్‌ సరసన సరిత నటించగా, మాధవి ఒక ప్రత్యేక పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రాన్ని బాలచందర్‌ హిందీలో ‘ఏక్‌ దూజే కేలియే’ చిత్రంగా నిర్మిస్తే ఆ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. గాయకుడు బాలుకి జాతీయ బహుమతి తెచ్చిపెట్టింది. కమల్‌ నటించిన ఎక్కువ తెలుగు సినిమాలకు బాలు డబ్బింగ్‌ చెప్పేవారు. కమల్‌ హసన్‌ను తెలుగు సినిమాకు హీరోగా పరిచయం చేయడమే ముఖ్య లక్ష్యంతో బాలచందర్‌ ‘మరోచరిత్ర’ సినిమాకు రూపకల్పన చేశారు. కమల్‌కు తమిళం మాతృభాష కావడంతో ఇందులో హీరోని తమిళుడుగా మార్చారు. సినిమా మొత్తాన్ని విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనే తీశారు. బాలచందర్‌కు ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. ఈమూడు సినిమాల హ్యాట్రిక్‌ విజయంతో తెలుగు చలనచిత్ర నిర్మాతలు కమల్‌తో సినిమాలు తీసేందుకు ముందుకొచ్చారు. ఈ సినిమా మద్రాసులోని సఫైర్‌ థియేటర్‌లో 596 రోజులు, బెంగుళూరులో 300 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ‘సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌’ సంస్థ ఈ చిత్రాన్ని ‘100 గ్రేట్‌ ఇండియన్‌ మోవీస్‌’ జాబితాలో చేర్చింది. అప్పుడే భారతీరాజా కమల్‌ హీరోగా, శ్రీదేవి హీరోయిన్‌గా ‘సిగప్పు రోజాక్కళ్‌’ సినిమా నిర్మించారు. అందులో కమల్‌ది సీరియల్‌ కిల్లర్‌ పాత్ర. ఆ సినిమాలో నటనకు నాల్గవసారి ఫిలింఫేర్‌ బహుమతి గెలుచుకున్నారు. 175 రోజులకు పైగా ఆడిన ఈ సినిమా ద్వారా భారతీరాజాకు ఫిలింఫేర్‌ వారి ఉత్తమ దర్శకుని బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని భారతీరాజా హిందీలో ‘రెడ్‌ రోస్‌’ (1980) పేరుతో పునర్నిర్మించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలుగులో ‘సొమ్మొకడిది సోకొకడిది’ పేరుతో సినిమా నిర్మించారు. అందులో కమల్‌ ద్విపాత్రాభినయం చేయగా ఆయన సరసన జయసుధ, రోజారమణి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పెద్ద మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తమిళంలోకి ‘ఇరు నిలవుగ’ పేరుతో డబ్‌ చేస్తే అక్కడ కూడా హిట్‌గా నిలిచింది. కమల్‌కు ఈ సినిమాలో వై.జి.మహేంద్రన్‌ డబ్బింగ్‌ చెప్పాడు. 1970 దశకంలో ఆరు ఫిలింఫేర్‌ అవార్డులు లభించాయి. 1981లో బాలచందర్‌ తెలుగులో ‘ఆకలి రాజ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అందులో కమల్‌ హాసన్‌ సరసన శ్రీదేవి నటిచింది. ఈ సినిమా సూపర్‌ హిట్టయింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమావాస్య చంద్రుడు’ కూడా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇందులో ఎల్‌.వి.ప్రసాద్‌ నటించడం విశేషం.


కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సాగర సంగమం’ సూపర్‌ డూపర్‌ హిట్టయింది. అదే ఊపులో వచ్చిన ‘స్వాతి ముత్యం’ అత్యధిక మహిళా ప్రేక్షకులను ఆకట్టుకొని విజయవంతమైంది. సింగీతం శ్రీనివాసరావు కమల్‌తో సంభాషణలు లేకుండా ‘పుష్పక విమానం’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ప్రయోగం సఫలమైంది. విశ్వనాథ్, బాలు కలిసి కమల్‌తో ‘శుభసంకల్పం’ చిత్రాన్ని నిర్మిస్తే అదికూడా శతదినోత్సవం చేసుకుంది. సింగీతం దర్శకత్వం వహించిన మరొక సినిమా ‘ఇంద్రుడు చంద్రుడు’. అందులో కమల్‌ హసన్‌ ద్విపాత్రాభినయం చేశారు. ‘భామనే సత్యభామనే’ కూడా ఆ కోవలోనిదే.


విజయవంతమైన డబ్బింగులు...
కమల్‌ హాసన్‌ నటించిన ఎన్నో తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై బాగా ఆడి శతనోత్సవాలు కూడా జరుపుకున్నాయి. బాగా విజయవంతమైన డబ్బింగ్‌ సినిమాల జాబితా చాంతాడంత వుంటుంది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి... ‘అందమైన అనుభవం’, ‘గురు’, ‘అందగాడు’, ‘వసంత కోకిల’, ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’, ‘నాయకుడు’, ‘అపూర్వ సహోదరులు’, ‘గుణ’, ‘క్షత్రియ పుత్రుడు’, ‘మహానది’, ‘భారతీయుడు’, ‘క్షత్రియ పుత్రుడు’, ‘మైఖేల్‌ మదన కామరాజు’, ‘సతి లీలావతి’ మొదలైనవి. అలాగే హిందీలో కమల్‌ హాసన్‌ నటించిన సినిమాల జాబితా గమనిస్తే అది కూడా పెద్ద చిట్టానే అవుతుంది. వాటిలో కొన్ని... ‘సద్మా’, ‘ఏ తో కమాల్‌ హోగయా’ (త్రిపాత్రాభినయం), ‘ప్యార్‌ తరానా’ (డబ్బింగ్‌) ‘ఏక్‌ నయీ పహేలీ’, ‘రాజ్‌ తిలక్‌’, ‘యాద్‌ గార్‌’, ‘కరిష్మా’, ‘సాగర్‌’, ‘దేఖా ప్యార్‌ తుమ్హారా’, ‘హిందూస్తానీ’, ‘చాచీ 420’ మొదలైనవి. కమల్‌ నటించిన కొన్ని సినిమాలు అటు హిందీ ఇటు తమిళంలో కూడా నిర్మింపబడ్డాయి. వాటిలో ‘హే రామ్’, ‘అభయా’, ‘ముంబాయ్‌ ఎక్స్‌ ప్రెస్‌’ చిత్రాలను ముఖ్యంగా చెప్పుకోవాలి.


కమల్‌ పాత్రల ప్రత్యేకతలు...
కమల్‌ హాసన్‌కు వైవిధ్యమైన పాత్రలు పోషించడమంటే సరదా. కళ్యాణ రామన్‌ చిత్రంలో ఎత్తుపళ్లతో పల్లెటూరివాని పాత్రను పోషించారు. ‘రాజా పార్వై’ చిత్రంలో అంధ వయోలనిస్టు పాత్రలో జీవించారు. ఈ చిత్రానికి కమల్‌ స్కీన్ర్‌ ప్లే అందించడం విశేషం. ‘స్వాతిముత్యం’లో మానసిక వికలాంగునిగా, ‘సాగర సంగమం’లో శాస్త్రీయ నృత్యకళాకారునిగా, ‘నాయకుడు’ సినిమాలో అండర్‌ వరల్డ్‌ డాన్‌గా ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ‘పుష్పక విమానం’ సినిమాలో నిరుద్యోగ యువకునిగా, వారం రోజులపాటు భోగ భాగ్యాలు అనుభవించే అవకాశం వచ్చిన యువకునిగా నటించారు. ‘విచిత్ర సోదరులు’ సినిమాలో మరుగుజ్జు అవతారం ఎత్తారు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు షారుఖ్‌ ఖాన్‌ కూడా ‘జీరో’ సినిమాలో మరుగుజ్జు పాత్రలో కనిపించాడు. ‘భామనే సత్యభామనే’ చిత్రానికి శంతన్‌ పెనోయ్‌ దర్శకుడు. కానీ అతని పనితనం కమల్‌కు నచ్చలేదు. వెంటనే అతణ్ణి తొలగించి తనే దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సినిమాను హిట్‌ చేశారు. ‘గుణ’ చిత్రంలో కమల్‌ది అద్భుతమైన పాత్ర. ప్రేమలో పడిన ఉన్మాదిగా నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. ‘ద్రోహి’ చిత్రంలో ఉగ్రవాదాన్ని అణచివేసే పోలీసు అధికారిగా కమల్‌ హసన్‌ నటన అపూర్వం. అలాగే ‘భారతీయుడు’ సినిమాలో స్వాతంత్ర సమరయోధుని పాత్రలో ముసలి వేషం, లంచగొండి అధికారిగా రెండవ వేషం వేసి రాణించిన గొప్ప నటుడు కమల్‌. తొంభయ్యవ దశకంలో కమల్‌ నటించిన ఎక్కువ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఘోటక ‘బ్రహ్మచారి’గా, ‘పంచతంత్రం’లో రసికుడైన విమాన చోదకునిగా, ‘సత్యమే శివం’ చిత్రంలో వికలాంగుడైన మానవతావాదిగా, ‘పోతురాజు’ సినిమాలో అన్యాయంగా హత్య కేసులో ఇరికించ బడిన పల్లెటూరి బైతుగా, ‘తెనాలి’ చిత్రంలో చిన్న దానికి కూడా భయపడే పిరికివాడుగా విభిన్న పాత్రలు పోషించి సఫలుడైనా, సినిమాలు మాత్రం ఆశించినంత విజయవంతం కాలేకపోయాయి. రాజ్‌ కమల్‌ పేరుతో సొంత సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి ‘రాజా పార్వై’, ‘అపూర్వ సహోదరగళ్‌’, ‘దేవర మగన్‌’, ‘కురుదిప్పున’, విరుమాండి’, ‘ముంబై ఎక్స్‌ ప్రెస్‌’ సినిమాలు సొంతంగా నిర్మించారు.


పురస్కారాలు... సంసారం...
జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ‘మూండ్రాంపిరై’ (వసంత కోకిల), ‘నాయగన్‌’ (నాయకుడు), ‘ఇండియన్‌’ (భారతీయుడు) సినిమాలో నటనకు మూడుసార్లు పురస్కారాలు అందుకున్నారు. ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ తెలుగు సినిమాలు ఆసియా చలన చిత్రోత్సవాలలో బహుమతులు గెలుచుకున్నాయి. ఫిలింఫేర్‌ బహుమతులను ఏకంగా పద్దెనిమిది సార్లు గెలుచుకున్న ఏకైక నటుడు కమల్‌ హాసన్‌. కమల్‌ నటించిన ఆరు సినిమాలు ఆస్కార్‌ బహుమతి కోసం ప్రభుత్వ పక్షాన ఎంపికై, పోటీల్లో పాల్గొన్నాయి. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్‌ను పద్మశ్రీ పురస్కారంతోను, 2014లో పద్మభూషణ్‌ పురస్కారంతోను సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదు ప్రదానం చేసింది. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం కమల్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. మొత్తం మీద కమల్‌ స్వీకరించిన అవార్డులు 170కి పైమాటే! కమల్‌ హాసన్‌ తొలుత నాట్య కళాకారిణి వాణీ గణపతిని వివాహమాడారు. తరువాత సారికతో సంసారం సాగించారు. ఆమెను కూడా వదలిపెట్టి, నటి గౌతమితో కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు.


కమల్‌కు సారిక ద్వారా ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఒకరు బాలీవుడ్‌ నటి శ్రుతి హసన్‌ కాగా, రెండవ కూతురు అక్షర. కమల్‌ హాసన్‌ వివాదాలకు కేంద్ర బిందువు కూడా! ‘తేర్‌ మగన్‌’ సినిమాలో తేవర్‌ కులస్తులను హింసను ప్రోత్సహించే వారిగా చూపి వివాదాస్పదుడయ్యారు. ‘హే రామ్‌’ సినిమాలో సంఘ్‌ పరివార్‌ పాత్రను తక్కువ చేసి చూపారని ఆ సంఘ సభ్యులు గొడవ చేశారు. ‘విశ్వరూపం’ సినిమాలో ఇస్లాం మతాన్ని కించపరిచారనే వివాదం బహిరంగమైంది. ఏది ఏమైనా కమల్‌ హాసన్‌ భారతీయ చలనచిత్ర రంగానికి భగవంతుడు ప్రసాదించిన ఒక గొప్ప కళాకారుడు.

- ఆచారం షణ్ముఖాచారి


© Sitara 2018.
Powered by WinRace Technologies.