రామ్... అత‌ని పేరే... హుషారు!
సిసింద్రీలా దూసుకుపోతాడు
తారా జువ్వ‌లా ఆకాశాన్ని అందుకుంటాడు
సీమ ట‌పాకాయ్‌లా... అల్ల‌రి అల్ల‌రి చేస్తాడు!
హుషారు కూడా అత‌న్ని చూసి హుషారు తెచ్చుకుంటుంది. ఉత్సాహం అత‌ని పేరు వింటే ప‌ర‌వ‌ళ్లు తొక్కుతుంది. ఎన‌ర్జిటిక్ అనే ప‌దానికి అత‌ని పేరుని అర్థంగా వాడేసుకోవ‌చ్చు. 'రామ్‌'డు మంచి బాలుడు అనే వాక్యాన్ని 'రామ్‌'డు హుషారైన బాలుడు అని కొత్త‌గా చెప్పుకోవ‌చ్చు. అత‌నే.. రామ్‌. మంగళవారం ఈ యువ హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా రామ్ గురించి మరిన్ని విశేషాలు..

రామ్‌ని చూస్తే ప‌క్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు.
ఒక్కోసారి 'రామ్‌లా నేనూ ఉంటే బాగుంటుందే' అనిపించేలా చేస్తాడు.
రామ్‌లో చురుకుద‌నం, అత‌ని స్పీడు.. ఎవ్వ‌రికైనా భ‌లే న‌చ్చేస్తాయి. మొత్తానికి యువ‌త‌రానికి ప్ర‌తినిధిలా క‌నిపిస్తుంటాడు. రామ్ బ‌లం.. బ‌లగం పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్‌. రామ్ సూప‌ర్ హిట్ చిత్రాల్లో స్ర‌వంతి వాటా ఎక్కువ‌. రామ్‌కి ఓ హిట్ కావాల్సివ‌చ్చిన‌ప్పుడ‌ల్లా స్ర‌వంతి మూవీస్ ముందుకొచ్చేది.తెలుగు తెర యువ తేజాల్లో రామ్ స్థానం ప్ర‌త్యేకం. దేవ‌దాసుతో అత‌ని ప్ర‌స్థానం మొద‌లైంది. తొలి సినిమాలోనే డాన్సుల‌తో అద‌ర‌గొట్టేశాడు. అత‌ని ఈజ్‌ని చూసి ముచ్చ‌ట‌ప‌డిపోయింది టాలీవుడ్‌. జ‌గ‌డంతో మాస్ లుక్ వ‌చ్చేసింది. ఆసినిమా ఫ్లాప్ అయినా.. రామ్ ఎంత న‌టుడో చెప్ప‌డానికి ఇప్ప‌టికీ ఈ సినిమానే ఉదహ‌రిస్తారు. శ్రీ‌నువైట్ల `రెడీ`తో హిట్ హీరో అనిపించేసుకున్నాడు. అక్క‌డి నుంచీ రామ్ హ‌వా మొద‌లైపోయింది. మ‌స్కా క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధించింది. కందిరీగ బాక్సాఫీసు వ‌సూళ్ల ప‌రంగా ఒకే అనిపించింది. ఆ త‌ర‌వాత కొన్ని ప‌రాజ‌యాలు రామ్ కెరీర్‌ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఎందుకంటే ప్రేమంట దారుణంగా నిరాశ ప‌రిచింది. ఒంగోలు గిత్త అంచనాల్ని అందుకోలేదు. మ‌సాలా, పండ‌గ చేస్కో, శివం... ఇలా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగింది. వీట‌న్నింటికీ `నేను శైల‌జ‌` బ్రేక్ వేసింది. మాస్ ఇమేజ్ నుంచి మెల్ల‌గా త‌ప్పుకుంటూ.. ప‌క్కింటి కుర్రాడిలా మారిపోయి, చ‌క్క‌టి ల‌వ్ స్టోరీని ఎంచుకున్నాడు. ఈ ప్ర‌య‌త్నం విజ‌య‌వంత‌మైంది. 'హైప‌ర్‌'లో మ‌ళ్లీ మాస్ గోల క‌నిపించినా... 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ'తో మ‌ళ్లీ కాస్త తెరిపిన ప‌డ్డాడు. ఇప్పుడు 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'లో న‌టిస్తున్నాడు రామ్‌.

క‌థ‌ల ఎంపిక విష‌యంలో రామ్ తీరు ఇప్పుడు బాగా మారింది. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు పెద్ద పీట వేస్తున్నాడు. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇస్తున్నాడు. అవి బాగా క‌లిసొస్తున్నాయి. 'హ‌లో గురు..' నీ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన చేతిలో పెట్టాడు రామ్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా విజ‌యంతో రామ్ కెరీర్ మ‌రింత ముందుకు దూసుకుపోవాలి, మున్ముందు ఇలాంటి మంచి చిత్రాల‌తో మ‌రింత‌గా అల‌రించాల‌ని సితార కోరుకుంటోంది. ఆల్ ది బెస్ట్ రామ్‌..© Sitara 2018.
Powered by WinRace Technologies.