ఆమె... తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల సినీ ‘సిరివెన్నెల’. నిన్నటితరం కుర్రకారులను తనవైపు తిప్పుకొన్న వెండితెర హాసిని... ఆమె సుహాసిని. సుహాసిని.... సినిమా ప్రేమికులకు ప్రత్యేకమైన పరిచయం అక్కరలేని పేరు. ఎప్పటికప్పుడు తనవైపు దూసుకొచ్చిన ‘ఛాలెంజ్’ విసిరే పాత్రలను స్వీకరించి తానేంటో నిరూపించుకున్న ఓ అమోఘమైన అభినేత్రి. ఏ పాత్రలోనైనా జీవించగల సామర్ధ్యం ఆమె సొంతం. ఈ చిరునవ్వుల సౌందర్యం ఆగష్టు 15న 58వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు.
కుటుంబ నేపథ్యం...
తమిళనాడులోని చెన్నై సుహాసిని జన్మస్థలం. ప్రముఖ సినిమా నటుడు చారు హాసన్ కుమార్తె సుహాసిని. చారు హాసన్ ఎన్నో సినిమాలలో నటుడుగా రాణించారు. బాబాయ్ కమల్ హాసన్, తండ్రి చారు హాసన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సుహాసిని సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు.
సినిమా రంగ ప్రవేశం...
సినిమా వాతావరణం ఇంట్లో ఉంటే, ఎవరికైనా అతి తేలికగా సినిమాలపై ఆసక్తి పెరుగడం సహజమే. సినిమా వాతావరణంలో పెరిగినవారు ఖచ్చితంగా ముఖంపై మేకప్ వేసుకోవాలని తహతహలాడడం కూడా సర్వసాధారణమైన విషయం. కానీ, సుహాసిని మాత్రం కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్‌ని మొదలుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయమే. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన అశోక్ కుమార్ దగ్గర అసిస్టెంట్‌గా సుహాసిని తన సినిమా కెరీర్‌ని స్టార్ట్ చేశారు. ఆ తరువాత నటన వైపు అడుగులు వేసే ముందు ఎంతోమంది ప్రముఖ తారలకు మేకప్ ఆర్టిస్ట్‌గా కూడా పని చేశారు. ఆ తరువాత ‘నెంజతై కిల్లతే’ అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేశారు ఈ అభినేత్రి.
విజయవంతమైన సినిమా కెరీర్...
కన్నడ, తమిళ, తెలుగు, మరియు మలయాళం భాషలలో ఎన్నో సినిమాలలో నటించారు సుహాసిని. హిందీలోనూ సుహాసిని ఓ చిత్రంలో నటించడం విశేషం. కన్నడ స్టార్ విష్ణువర్ధన్, సుహాసిని జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. ‘బంధన’, ‘సుప్రభాత’, ‘స్కూల్ మాస్టర్’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకులని అలరించింది. కన్నడ సినిమా పరిశ్రమలో విష్ణువర్ధన్, సుహాసిని జంట వన్ ఆఫ్ ది బెస్ట్‌గా గుర్తింపు పొందడం విశేషం. భాషాభేదం అన్న తేడాలు లేకుండా సుహాసిని తన నటనతో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ప్రముఖ దర్శకుడు ‘మణిరత్నం’తో వివాహమైంది. 1988లో మణిరత్నం, సుహాసిని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి నందన్ అనే కుమారుడు ఉన్నాడు.
తెలుగులో సుహాసిని...
తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా సుహాసిని తన సత్తా చాటుకున్నారు. కొన్ని క్లిష్టమైనటువంటి పాత్రలు పోషించారు. నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. శోభన్ బాబు సరసన ‘మహారాజు’లో నటించి వీక్షకులకు కంటతడి తెప్పించారు. భాను చందర్‌కు జోడీగా ‘ముక్కు పుడక’లో డీ గ్లామర్ రోల్ పోషించి నటన పట్ల తన ఇష్టాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అప్పటి అగ్ర నటులందరితో హీరోయిన్గా నటించారు. సుహాసిని పేరు చెప్పగానే ఎన్నో చిత్రాలు కళ్లముందు కదలాడతాయి. కోడిరామకృష్ణ దర్శకత్వంలోని ‘మంగమ్మ గారి మనవడు’, జంధ్యాల దర్శకత్వంలోని ‘ముద్దుల మనవరాలు’ సినిమాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలికి భానుమతికి ధీటుగా నటించి మెప్పించారు. ‘స్వాతి’ సినిమా సుహాసిని కెరీర్లో మెచ్చుతునక. ‘చంటబ్బాయ్’ సినిమాలో హాస్యరసాన్ని పోషించారు. సుహాసిని చిత్రాల్లో ‘స్రవంతి’, ‘ఆఖరి పోరాటం’, ‘మంచు పల్లకి’, ‘కొత్త జీవితాలు’, ‘మనిషికో చరిత్ర’, ‘జస్టిస్ చక్రవర్తి’, ‘ఛాలెంజ్’, ‘కిరాతకుడు’, ‘ఆరాధన’, ‘సంసారం ఒక చదరంగం’, ‘పుణ్య దంపతులు’, ‘పున్నమి చంద్రుడు’, ‘శుభలగ్నం’, ‘అక్క మొగుడు’, ‘మరణ మృదంగం’ లాంటి సినిమాలెన్నో విజయకేతనాలెగరేశాయి. ‘పెళ్లి పందిరి’, ‘ఊయల’, ‘రాజకుమారుడు’, ‘అమ్మ చెప్పింది’, ‘దొంగరాముడు అండ్ పార్టీ’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘రాఖి’ సినిమాలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. చిన్న పాత్ర పెద్ద పాత్ర అన్న తేడా లేకుండా అభినయప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకొని కెరీర్‌ని విజయపథంలో నడిపించుకున్నారు సుహాసిని. గ్లామర్ పాత్రల్లో కూడా రాణించారు.
ఇతర కీలక బాధ్యతలు....
సుహాసిని అంటే కేవలం ఓ నటి అని మాత్రమే అనుకుంటే పొరపాటే. సుహాసినికి సినిమా దర్శకత్వం చేసిన అనుభవం కూడా ఉంది. 1996లో ‘ఇందిర’ సినిమా దర్శకత్వ బాధ్యతలను సుహాసిని తన భుజాలపై మోశారు. ఈ చిత్రానికి సుహాసిని స్కీన్ర్ ప్లే కూడా సమకూర్చడం విశేషం. ఈ చిత్రాన్ని జీ.వీ.ఫిలింస్ వారు నిర్మించారు.‘తిరుడా తిరుడా’, ‘రావణం’, ‘ఇరువర్’ చిత్రాలకు మాటల రచయితగా కూడా పనిచేశారు సుహాసిని. మణిరత్నం, సుహాసినీలకు ఓ నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఆ సంస్థ పేరు మద్రాస్ టాకీస్. ఈ నిర్మాణ సంస్థ బాధ్యతల్ని ఈ దంపతులిద్దరూ చూసుకుంటున్నారు. ఈ నిర్మాణ సంస్థను ఇదివరకు మణిరత్నం సోదరుడు జీ.శ్రీనివాసన్ కూడా చూసుకునేవారు. 2007లో ఈయన చనిపోయారు.
అవార్డులు...
సుహాసినిని అనేక పురస్కారాలు వరించాయి. తెలుగు సినిమాల విషయానికొస్తే ‘స్వాతి’ సినిమాకి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు సుహాసిని. అలాగే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకి ఉత్తమ సహాయ నటిగా మరో నందిని సంపాదించేసుకున్నారు ఈ మల్టీ టాలెంటెడ్ నటి. ‘నెంజతై కిల్లతే’ సినిమాకు ఉత్తమ నటిగా, ‘ఇందిర’ సినిమాకు పురస్కారాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకొన్నారు. ఇంకా సుహాసిని ఖాతాలో ఎన్నో కేరళ ప్రభుత్వ పురస్కారాలు, సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎన్నో ఉన్నాయి.
నాస్తిక వాదం
తాను ఓ నాస్తికురాలని సుహాసిని చెబుతారు. దేవుడు, ప్రార్ధన, దేవాలయాలకు వెళ్లి దేవుడిని నాకు, నా కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వమని అడగడం ఇష్టం లేదని ఓ ఇంటర్వ్యూలో సుహాసిని చెప్పారు.
వీకెండ్ విత్ స్టార్స్:
వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైన కూడా సుహాసిని ప్రతిభ చూపించారు. జీ తమిళ్ ఛానల్లో సుహాసిని మణిరత్నం ఓ టాక్ షోని నిర్వహించారు. ప్రతీ ఆదివారం నాడు ఈ షో రాత్రి 8:30 నుంచి 10:00 గంటల వరకు ప్రసారమయ్యేది. ఈ షో ద్వారా ప్రముఖ సినిమా సెలబ్రిటీలైన రాధిక, ఖుష్బూ, భాగ్యరాజ్, మాధవన్, రోజా తదితరులను ఇంటర్వ్యూ చేశారు. 13 ఎపిసోడ్స్ వరకు ఈ టాక్ షో ప్రసారమైంది. 12 ఎపిసోడ్స్ వరకు ప్రతీ ఎపిసోడ్లో ఓ సెలెబ్రిటీని ఇంటర్వ్యూ చేశారు సుహాసిని. చివరి ఎపిసోడ్లో సుహాసినిని వేరొక వ్యాఖ్యాత ఇంటర్వ్యూ చేయడం విశేషం.
- పి.వి.డి.ఎస్. ప్రకాష్