హత్య కేసులో నిందితురాలిగా తాప్సి

అమితాబ్‌ బచ్చన్, తాప్సి కలయికలో వచ్చిన ‘పింక్‌’ ఘన విజయం సాధించడంతో పాటు సర్వత్రా ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ వీరిద్దరూ కలసి నటించిన చిత్రం ‘బద్లా’. ‘కహానీ’తో మెప్పించిన సుజయ్‌ ఘోష్‌ తెరకెక్కించారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రముఖ కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఓ అతిథి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ప్రకాష్‌ రాజ్, పంకజ్‌ త్రిపాఠి, మానవ్‌ కౌల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్పానిష్‌ చిత్రం ‘ది ఇన్‌విజిబుల్‌ గెస్ట్‌’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ‘పింక్‌’లోలాగే ఇందులోనూ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు అమితాబ్‌. తాప్సి బోయ్‌ఫ్రెండ్‌ హత్యకు గురైన కేసులో ఆమె కూడా ఓ నిందితురాలిగా చిక్కుకుంటుంది. దాన్నుంచి బయటపడేందుకు అమితాబ్‌ను ఆశ్రయిస్తుంది. మరి ఆ కేసును ఛేదించే క్రమంలో ఏ రహస్యాలు తెలిశాయి? తాప్సి నేరస్థురాలా కాదా అన్నది ఉత్కంఠభరితంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ‘పింక్‌’ కలయికలో ‘కహానీ’ దర్శకుడు తెరకెక్కించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.