మూడు ముక్కలాట.. నాలుగు ముక్కలైందిగా!!

నిన్నమొన్నటి వరకు సంక్రాంతి రేసే ఉత్కంఠభరితంగా ఉందనుకుంటే.. ఇప్పుడు దాన్ని మించిన థ్రిల్లింగ్‌ పోరు క్రిస్మస్‌ రోజుల్లో షురూ కాబోతుంది. ఈ ఏడాదిలో ఆఖరి సీజన్‌పై టాలీవుడ్‌ తొలుత అంతగా దృష్టి సారించలేదనిపించింది. కానీ, దీపావళి పురస్కరించుకోని క్రిస్మస్‌ రేసు కోసం బెర్తులు రిజర్వు చేసేసుకున్నాయి బడా చిత్రాలు. సాధారణంగా అగ్ర హీరోల దృష్టి ఎప్పుడూ సంక్రాంతి సీజన్‌పైనే ఉంటుంది. అయితే ఈసారి మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో’, రజనీకాంత్‌ ‘దర్బార్‌’ చిత్రాలతో ముగ్గుల పండక్కి వస్తుండటంతో బాలయ్య వంటి అగ్ర హీరో కూడా ఈ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా బాలయ్య ‘రూలర్‌’ చిత్రంతో క్రిస్మస్‌ బరిలోకి వచ్చి చేరడంతో ఈసారి టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ పోరు మరింత రసవత్తరంగా మారింది. కెఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబరు 20నే విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. అయితే ఇదే రోజున థియేటర్లోకి వచ్చేందుకు ఇప్పటికే మూడు చిత్రాలు పోటీ పడుతున్నాయి. వీటిలో రవితేజ ‘డిస్కోరాజా’, సాయిధరమ్‌ తేజ్‌ ‘ప్రతిరోజు పండగే’ చిత్రాలతో పాటు హిందీ డబ్బింగ్‌ చిత్రం ‘దబాంగ్‌ 3’ కూడా ఉంది. ఇవి కూడా అదే తేదీన రాబోతున్నట్లు ముందుగానే ప్రకటించేశాయి. అయితే నిన్నటి వరకు క్రిస్మస్‌ రేసు మూడు ముక్కలాటలా ఉత్కంఠభరితంగా సాగుతుందనుకుంటే.. ఇప్పుడు బాలయ్య వచ్చి దాన్ని నాలుగు స్తంభాలాటగా మార్చేశారు. మరి ఈ ఆటలో బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటేదెవరో తెలియాలంటే డిసెంబరు 20 వరకు వేచి చూడక తప్పదు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.