సమరానికి సై అంటున్న.. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ స్టార్‌

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మరో భారీ చారిత్రక చిత్రం ‘తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి వెన్నుదన్నుగా నిలిచిన సైన్యాధిపతి తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తానాజీ పాత్రలో అజయ్‌ దేవగణ్‌ నటిస్తుండగా, ఆయన భార్య సావిత్రి మలుసరేగా అజయ్‌ నిజ జీవిత భాగస్వామి కాజోల్‌ కనిపించనుండటం విశేషం. ఇందులో అజయ్‌ దేవగణ్‌తో తలపడే ప్రతినాయక పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. మొఘలుల సైనికాధికారి ఉదయ్‌భన్‌ రాథోడ్‌ పాత్రలో కనిపించనున్నారు సైఫ్‌. తానాజీకి, ఉదయ్‌భన్‌ రాథోడ్‌కు మధ్య జరిగిన సిన్హాఘడ్‌ యుద్ధం చరిత్రకెక్కింది. ఆ నేపథ్యాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు. ఓం రావత్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని అజయ్‌ దేవగణ్, సైఫ్‌ అలీఖాన్‌ పాత్రల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లను విడుదల చేశారు. దండెత్తి వస్తున్న శత్రు సైనికులపై కత్తి దూయడానికి సిద్ధంగా ఉన్నట్లున్న అజయ్‌ లుక్‌ ఆసక్తి రేపుతోంది. క్రూరత్వం నిండిన కళ్లతో కనిపిస్తున్న సైఫ్‌ లుక్‌ కూడా ఆకట్టుకుంటోంది. జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.