‘డబుల్ ధమాల్’.. 2011లో విడుదలై సినీ ప్రియులకు నవ్వులు పంచిన ఈ బాలీవుడ్ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇప్పుడీ కామెడీ ఎంటర్టైనర్కు సీక్వెల్‌గా ‘టోటల్ ధమాల్’ను తెరకెక్కించారు దర్శకుడు ఇంద్రకుమార్. అజయ్ దేవ్‌గణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, జానీ లీవర్, రితేశ్ దేశ్‌ముఖ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘జనక్‌పూర్ ప్రాంతంలో రూ.50 కోట్లకు సంబంధించిన ఓ రహస్యం ఉంది’’ అని ఓ వ్యక్తి చెబుతున్న సంభాషణలతో ట్రైలర్ మొదలైంది. దీంతో ఆ భారీ మొత్తాన్ని తామే దక్కించుకోవాలని అజయ్ దేవ్‌గణ్, అనిల్, రితీశ్ తదితరులంతా ఎవరికి వారు ప్రణాళికలు రచించుకోని అది ఉన్న ప్రాంతానికి బయలుదేరుతారు. అయితే ఆ జనక్‌పూర్ ప్రాంతానికి వెళ్లడమంటే ఓ పెద్ద సాహస కార్యం చేసినట్లే. ఎందుకంటే అక్కడికి చేరుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులను, క్రూర మృగాలను దాటుకోని వెళ్లాల్సి వస్తుంది. అజయ్ దేవ్‌గణ్ వాళ్ల బృందాలకి కూడా ఇవే సవాళ్లు ఎదరువుతాయి. ఈ నేపథ్యంలో ఆ రూ.50 కోట్లు ఎవరికి దక్కుతాయన్నదే కథ. వైల్డెస్ట్ అడ్వెంచర్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అజయ్ దేవ్‌గణ్ ఫిలింస్, మారుతి మల్టీనేషనల్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. హిమేశ్ రెషమ్మియా స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
