
అల్లాద్దీన్ అద్భుత దీపం కథ అంటే పిల్లలకు భలే మక్కువ. దీపం నుంచి బయటికొచ్చే జీనీ అనే విచిత్రమైన వ్యక్తి అల్లాద్దీన్ కోరిన కోరికలను తీరుస్తుంటాడు. అందుకోసం అతడు చేసే మాయలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంటాయి. ఈ కథతో 1992లో హాలీవుడ్లో ‘అల్లాద్దీన్’ అనే యానిమేషన్ చిత్రం వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆ చిత్రానికి లైవ్ యాక్షన్ రూపంగా అదే పేరుతో డిస్నీ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించింది. మ్యూజికల్ రొమాంటిక్ పాంటసీ అడ్వెంచర్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో జీనీ పాత్రలో ప్రముఖ నటుడు విల్ స్మిత్ నటించారు. ప్రముఖ దర్శకుడు గై రిజి దర్శకత్వం వహించారు. ఇందులో జీనీ పాత్రను పోషించిన విల్‌స్మిత్‌కు అగ్ర కథానాయకుడు వెంకటేష్ డబ్బింగ్ చెప్పగా, అల్లాదిన్ పాత్రకు వరుణ్‌తేజ్ గొంతును అరువిచ్చారు. ఇటీవల విడుదల చేసిన మొదటి టీజర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిత్ర బృందం తాజాగా మరో టీజర్‌ను విడుదల చేసింది. ‘నీకు మూడు కోరికలు కోరే అవకాశం ఉంది. దీపాన్ని రుద్ది నువ్వు ఆ కోరికలు కోరడమే’ అంటూ జీనీగా పాత్రకు వెంకటేష్ డైలాగ్‌లు చెప్పడం నవ్వులు పూయిస్తోంది.