రారాజు మళ్లీ వస్తున్నాడు..

‘ది లయన్‌ కింగ్‌’.. 1994లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సినీప్రియుల్ని అలరించిన హాలీవుడ్‌ చిత్రమిది. ఇప్పుడీ సినిమాకు రీమేక్‌గా అదే పేరుతో మరో యానిమేటెడ్‌ ఫాంటసీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది వాల్ట్‌ డిస్నీ. ‘ది జంగిల్‌ బుక్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన జాన్‌ఫావ్రో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది డిస్నీ సంస్థ నుంచి వస్తోన్న 32వ యానిమేటెడ్‌ చిత్రం. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఈ అడవిలో సూర్యకిరణాలు ఎంతదాకా ప్రసరిస్తాయో అదంతా మన రాజ్యమే. ఇక్కడ రాజు కూడా సూర్యుడిలాంటి వాడే. ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఏదో ఒక రోజు నేను అస్తమించి నువ్వు ఉదయించే రోజు వస్తుంది’’ అన్న ఆసక్తికర సంభాషణలతో టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. టీజర్‌లో అడవి మృగాలను, సింహం పిల్ల పెద్దదై రాజుగా మారిన దృశ్యాలను ఎంతో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా అడవికి రారాజుగా ఉన్న సింహం తన వారుసుడిని ప్రకటించే ఘట్టాన్ని అత్యద్భుతంగా చూపించారు. ఈ చిత్రంలోని పాత్రలకు డొనాల్డ్‌ గ్లోవర్‌, సెత్‌ రోగెన్‌, షివెటెల్‌ ఎజిఫోర్‌ వంటి హాలీవుడ్‌ ప్రముఖులు గాత్రాన్ని అందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని 2019 వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.