ఇది మరో దండుపాళ్యం కాదు
జైలులో ఉన్న సహచరుల్ని తప్పించడానికి ఏడుగురు సభ్యులతో కూడిన ఓ దండు ఎలాంటి వ్యూహాలు అమలు చేసిందనే కథతో మా చిత్రం తెరకెక్కిందన్నారు వెంకట్‌. ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘దండుపాళ్యం 4’. సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. కె.టి.నాయక్‌ దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ సినిమాని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదివరకు వచ్చిన ‘దండుపాళ్యం’ సినిమాలకీ, దీనికీ సంబంధం లేదు. కొత్త రకమైన కథతో రూపొందించాం. ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘పోలీసులకీ, ఏడుగురు సభ్యులతో కూడిన ఓ ముఠాకి మధ్య ఎత్తులు, పైఎత్తులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇందులో ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది. కె.టి.నాయక్‌ సినిమాని చిత్రీకరించిన విధానం బాగుంది. త్వరలోనే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తికానున్నాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సినిమాని అనుకున్న రోజునే విడుదల చేస్తాం’’ అన్నారు. అరుణ్‌ బచ్చన్‌, డి.ఎస్‌.రావు, రాక్‌లైన్‌ సుధాకర్‌, బుల్లెట్‌ సోము తదితరులు నటించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.