బన్ని జోరుగా.. మహేష్‌ మెల్లగా!!

మహేష్‌బాబు - అల్లు అర్జున్‌ సంక్రాంతి బరిలో పందెం కోళ్లలా పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’, బన్ని ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాలతో జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఈ రెండూ మరో యాభై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ప్రచార పర్వంలో బన్నితో పోల్చితే మహేష్‌ చాలా వెనకబడిపోతున్నారు. నిజానికి ‘అల.. వైకుంఠపురములో’తో పోల్చితే ‘సరిలేరు నీకెవ్వరు’నే తొలి ప్రచార చిత్రాన్ని ముందుగా ప్రేక్షకులకు చూపించింది. సెట్స్‌పైకి వెళ్లిన రోజే విడుదల ముహూర్తాన్నీ ప్రకటించింది. అంతేకాదు చిత్ర టైటిల్‌ గీతాన్ని ముందుగా వినిపించింది కూడా మహేష్‌ బృందమే. ఇక ఆ తర్వాతి చిన్న చిన్న పోస్టర్లు మినహా చిత్ర బృందం పెద్దగా ప్రచార హడావుడి ఏమీ చేయలేదు. ‘సరిలేరు..’తో పోల్చితే ఆలస్యంగాన్నే ప్రచార పర్వాన్ని షురూ చేసిన ‘వైకుంఠపుర’ బృందం మాత్రం ఇప్పుడు జోరు మీద సాగిపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘‘సామజవరగమన’’, ‘‘రాములో రాములా’’ గీతాలతో సినీప్రియుల దృష్టిని ఆకర్షించిన బన్ని బృందం.. తాజాగా మూడో గీతాన్ని కూడా విడుదల చేసేసింది. ఇప్పటికే బయటకొచ్చిన ఈ పాటలకు నెట్టింట మంచి ఆదరణ లభిస్తుండగా.. మహేష్‌ విడుదల చేసిన టైటిల్‌ గీతానికి అంతగా ఆదరణ దక్కలేదు. అయితే ‘సరిలేరు..’ బృందం మాత్రం అన్నీ పక్కాగా సిద్ధం చేసుకున్నాకే ప్రచార బరిలో దిగాలని ఆలోచన చేస్తోందట. కానీ, మహేష్‌ అభిమానులు మాత్రం అనిల్‌ రావిపూడిపై కాస్త గుర్రుగానే ఉన్నారట. ఓవైపు మెగా అభిమానులంతా వరుస ట్రీట్లతో సందడి చేస్తుంటే.. అనిల్‌ మాత్రం చిన్న సర్‌ప్రైజ్‌ను కూడా రుచి చూపించ లేకపోతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.