పొరపాటున టైటిల్‌ చెప్పేశారు..

డార్లింగ్‌ ప్రభాస్‌ ఇప్పుడు సినిమాల విషయంలో జోరు పెంచారు. ఆయన ప్రస్తుతం ‘సాహో’ చిత్రంలో నటిస్తూనే.. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది ప్రభాస్‌ నటిస్తున్న 20వ చిత్రం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఇటలీలో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేసుకుందీ చిత్రం. 1970 కాలం నాటి నేపథ్యంతో సాగే ప్రేమకథా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రభాస్‌ ఓ జ్యోతిష్కుడిగా కనిపిస్తాడని సమాచారం. చిత్ర నేపథ్యానికి తగ్గట్లుగానే దీనికి ‘జాన్‌’, ‘అమూర్‌’ అనే టైటిళ్లలో ఒకదాన్ని పెట్టబోతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ పేర్ల విషయంలో ఒకటి దాదాపుగా ఖరారయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు కమల్‌ కణ్ణన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘తాను ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘జాన్‌’కు పనిచేస్తున్నానని. ఆ చిత్ర షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ పూర్తయిందని’ అన్నాడు. దీంతో ఇప్పుడిది కాస్తా ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కణ్ణన్‌ చెప్పిన దాన్ని బట్టీ ప్రభాస్‌ 20కి ‘జాన్‌’ టైటిల్‌నే ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‌ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్‌ - సుజీత్‌ల కలయికలో రూపొందుతున్న ‘సాహో’ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది.


© Sitara 2018.
Powered by WinRace Technologies.