అందరినీ దోచుకుంటుంది!
సుధీర్‌బాబు, నభా నటేష్‌ జంటగా ఆర్‌.ఎస్‌. నాయుడు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘మేము ఆశించిన దానికంటే ఎక్కువగా మా ట్రైలర్‌ను ఆదరించారు వీక్షకులు. సుధీర్‌బాబు, నభా నటేష్‌ వాళ్ల పాత్రల్లో బాగా ఇమిడిపోయారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందీ సినిమా. అజనీష్‌ సంగీతం అందరినీ అలరిస్తుందనడంలో సందేహంలేదు’’ అన్నారు. కథానాయకుడు, నిర్మాత అయిన సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘మా సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచే కాకుండా పరిశ్రమ నుంచి కూడా మంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. సినిమా ప్రచార యాత్రలో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ‘సమ్మోహనం’లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత మా సంస్థలో నిర్మిస్తున్న చిత్రం ఇది. సురేష్‌ కెమెరా పనితనం, అజనీష్‌ సంగీతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. నభా నటేష్‌ చాలా బాగా చేసింది’’ అన్నారు. ఈ చిత్రంలో నాజర్, తులసి, జీవా, సౌందర్‌రాజన్, సుదర్శన్‌ తదితరులు నటిస్తున్నారు.
                                                                       
© Sitara 2018.
Powered by WinRace Technologies.