ఆయన పాటలు... మధుర రాగరంజికలు!
ఇళయరాజా...
సినీ సంగీత ప్రపంచంలో మర్చిపోలేని పేరు. ఆయన పాటలు ఎప్పుడు విన్నా ఉర్రూతలూగిస్తాయి. ఆయనన్నా, ఆయన పాటలన్నా నాకెంతో ఇష్టం.
ఈయన 1943వ సంవత్సరం జూన్‌ 2న ఈ భూమి మీదకు వచ్చారు.

ఇళయరాజా జన్మనామం జ్ఞానదేశికన్, ఆ తరువాత కొన్నేళ్లకు ఈ పేరు కాస్తా డేనియల్‌ రాజయ్య అలియాస్‌ ‘రాజా’గా మారింది. బాల్యంలో తమిళ నాడు, కేరళ సరిహద్దుల్లోని వ్యవసాయ ప్రాంతాల్లో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకొనే పాటలతో జానపద సంగీత పరిచయం లభించింది. తన సవతి అన్న, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడు పావళర్‌ వరదరాజన్‌ నిర్వహించే సంగీత బృందం తో కలసి ఊరూరా తిరిగే వాడు.


చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీత జీవితాన్ని ప్రారంభించాడు. అప్పుడప్పుడు మద్రాసులో సంగీతం రికార్డు జరుపుకొనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన సలీల్‌ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టు గా, కీ బోర్డు కళాకారుడిగా పనిచేశాడు. తరువాత కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేశ్‌ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు (చాలా వరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా పనిచేశాడు. పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత ‘అన్నక్కిళి’ (చిలుక) అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు.


1983వ సంవత్సరంలో తమిళ నాట ‘మన్న్‌ వాసనై’ టైటిల్‌తో ఒక చలనచిత్రం వచ్చింది. మట్టి వాసన అని భావం. ఈ సినిమాకు సంగీతాన్ని అందించింది ఇళయరాజాయే. ఇళయరాజా స్వరాలను వింటూ వుంటే ఆ ‘బాణి’ముత్యాలు మట్టి వాసనను మట్టుకే కాకుండా గాలి వాసనను,ఆకాశం వాసనను, తొలకరి వాన జల్లు వాసనను, సెలయేటి నీటి గలగలల వాసనను, పూల వాసనలను, చిగురాకుల వాసనను మనిషి మనస్సులోని మాటల వాసనలను, మానవుడు కనే కలల వాసనలను, మనుషుల కన్నీటి వాసనను, ఇంకా జానపదులు జరుపుకొనే జాతరల కోలాహలం వాసనను కూడాను పొదివి పట్టుకున్నాయి అనిపిస్తుంది. 

ఇసైరాజా అని, ఇ‘లయ’రాజా అని, సెమ్మ రాజా అని, రాజా రాజాదాన్‌ అని, నమ్మ రాజాధిరాజన్‌ అని, రాజా ది గ్రేట్‌ అని, రాజా ద గాడ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అని, ఐఆర్‌ అని అభిమానులు ఇళయరాజాను మురిపెంగా పిలుచుకొంటున్నారు. వెండితెర మీద ఇళయరాజా పేరుకు ముందు ఆ మధ్య వరకు ఇసైజ్ఞాని అనే బిరుదు తోడయి కనుపించేది (ఈ ప్రశస్తిని కళైజ్ఞర్‌ కరుణానిధి 1988లో కట్టబెట్టారు); ఆనక మేస్ట్రో అని కనిపిస్తోంది.

ఇళయరాజా స్వర రచనలో అనేక సినిమాలు. కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అయినప్పటికీ - ఆయన పాటలు ఘుమఘుమలను వెదజల్లుతునే ఉన్నాయి.1984వ సంవత్సరంలో తమిళ చలనచిత్ర సీమలో విడుదలయిన 42 సినిమాలకు, ఆ మరుసటి సంవత్సరంలో అయితే ఏకంగా 45 సినిమాలకు ఇళయ రాజా వరుసలు కట్టారు. 1988వ సంవత్సరంలో తెలుగు చిత్ర సీమలో 13 సినిమాలకు ఆయన సంగీతాన్ని అందించారు. వాటిలో- ‘జమదగ్ని’, ‘అభినందన’, ‘ఆఖరి పోరాటం’, ‘మరణ మృదంగం’, ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌’, ‘వారసుడొచ్చాడు’, ‘రుద్రవీణ’, ‘స్వర్ణకమలం’ ఉన్నాయి. ‘రుద్రవీణ’ చలనచిత్రం 1988వ సంవత్సరం జాతీయ ఉత్తమ సంగీత పురస్కారాన్ని ఆయనకు తెచ్చి పెట్టింది. హాలీవుడ్‌ సినిమా ‘బ్లడ్‌ స్టోన్‌’కు జెరీ గ్రాంట్‌తో కలసి ఇళయరాజా సంగీతాన్నిచ్చింది కూడా 1988లోనే. రజినీకాంత్‌ ఈ చిత్రంలో నటించారు.* ఒక వేయి సినిమాలకు సంగీతాన్ని అందించిన అటువంటి ఇళయరాజా ఒక్కొక్క సినిమాకు సగటున నాలుగు పాటలు ఉంటాయనుకొంటే, దాదాపు 4,000 పాటలను కంపోజ్‌ చేసి ఉంటారు. మరి అందులో పదో వంతు పాటలను- అంటే 400 పాటలను ఇళయరాజా స్వయంగా ఆలాపించారు.

* 2019లో రెండు రోజుల పాటు- ఫిబ్రవరి 3, 4 తేదీలలో- ఇళయరాజాను తమిళ చలనచిత్ర రంగం సన్మానించి, బంగారంతో చేసిన వయొలిన్‌ను బహూకరించింది. ఆస్కార్‌ పురస్కారాలు అందుకున్న ఎ.ఆర్‌. రహమాన్‌ ఆ సన్మాన వేదిక మీద ‘‘ఇళయరాజా తనకు హెడ్‌ మాస్టర్‌’’ అని స్వయంగా పలికారు. ఇళయరాజా దగ్గర ఎ.ఆర్‌.రహమాన్‌ సహాయకుడిగా దాదాపు 500 సినిమాలకు పనిచేశారుట. ఆ శిష్యుడెంత వినమ్రుడో! ఆ గురువుదెంతటి ధన్యతో.

* ద్రోణునికి ఏకలవ్యుడిలాగా ఇళయరాజాకు సైతం శిష్యులు ఎందరో ఉన్నారు. వారిలో వంశీ, దేవిశ్రీప్రసాద్‌లు కూడా వున్నారు.
పాటల పారిజాతాలు!

ఈ ‘పద్మవిభూషణు’డి - ఎప్పటికీ వాడిపోని పాటల పూదోటలో నుండి - కొన్ని సుమాలను ఇక్కడ చూద్దాం.

* ఇలాగే ఇలాగే సరాగమాడితే వయారం ఈ యవ్వనం ఊయలూగునే..
‘వయసు పిలిచింది’ తెలుగు సినిమాలో ఉంది ఈ పాట.

* పొంగి పొరలే అందాలెన్నో పొంగి పొరలే
కన్నె మదిలో అందాలెన్నో పొంగి పొరలే...
‘కొత్త జీవితాలు’ (1980)లోని పాట ఇది.

* తంతననం తననం తననం తననం
తంతన నంతన తాళంలో రస రాగంలో
మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే
ఇదీ ‘కొత్త జీవితాలు’లోనిదే.

* రాముడు అనుకోలేదు జానకి పతి కాగలడని ఆనాడు...
ఆనాడు ఎవరూ అనుకోనిదీ ఈనాడు మనకూ నిజమైనదీ ఆ రామాయణం మన జీవన పారాయణం..
‘రాజ కుమార్‌’ (1983) లోనిదీ పాట.

* చుక్క లాంటి అమ్మాయీ చక్కనైన అబ్బాయీ
ఇద్దరొద్దికైనారూ ముద్దు ముద్దుగున్నారు...
(‘అభినందన’ -1988).

* రాధా ఎందుకింత బాధా
వెయ్‌ వెయ్‌ తకధిమి చెయ్‌ చెయ్‌ కథకళి... టక్కుముక్కూ తాళం వెయ్, ముయ్‌ ముయ్‌ తలుపులు, వెయ్‌ వెయ్‌ దరువులు లక్కుముక్కూ గొళ్లెం వెయ్, వాటం చూస్తే ఘుమఘుమా వర్ణం చూస్తే సరిగమా..
(‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’- 1986)

* చెమ్మ చెక్క చెమ్మ చెక్క, జున్ను ముక్క చెంప నొక్క, నిమ్మ చెక్క నిమ్మ చెక్క, నమ్మకంగ తిమ్మిరెక్క...
(‘బొబ్బిలి రాజా’ -1990)

* నువ్వడిగిందీ ఏనాడైనా లేదన్నానా, నువ్వడిగిందీ ఏనాడైనా కాదన్నానా...
(‘వయసు పిలిచింది’-1978)

* మౌనమేలనోయీ, ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, తారాడే హాయిలా, ఇంత మౌనమేలనోయి..
(‘సాగర సంగమం’-1983)
ఇలా ఎన్నని చెప్పగలం? ఇళయరాజా స్వరపరిచిన ఒకో పాటా... ఒకో రసగుళిక!


- దిలీప్, మియాపూర్, హైదరాబాద్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.