అద్భుత సైన్స్‌ఫిక్షన్‌ ‘ఆదిత్య 369’..

‘ఆదిత్య 369’.. 18 ఆగస్టు 1991లో విడుదలై ఇప్పటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా ‘బాక్‌ టు ఫ్యూచర్‌’ అనే ఆంగ్ల చిత్రం, ఇంకా ‘హెచ్‌.జి.వెల్స్‌ టైం మెషిన్‌ నుంచి స్ఫూర్తి పొంది తీసిన చిత్రమిది. ఈ సినిమాను భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల నేపథ్యంలో సైన్స్‌ ఫిక్షన్‌, చరిత్ర, ప్రేమ, క్రైమ్‌లను సమ్మిళితం చేసి తెరకెక్కించారు. నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఆణిముత్యంగా నిలిచి నేటికీ అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూనే ఉంది. సింగీతం శ్రీనివాసరావు అద్భుతమైన దర్శకత్వం, జంధ్యాల వినోద, సరస సంభాషణలతో పాటు వైవిధ్యమైన కథ, ఇళయరాజా సంగీతం, వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, పిసి శ్రీరామ్‌, విఎస్‌ఆర్‌ స్వామి, కబీర్‌లాల్‌ల ఛాయాగ్రహణం వంటివి ఈ చిత్ర బలాలు. దీన్ని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శ్రీమతి అనితా కృష్ణ నిర్మించారు. విజయనగర రాజ్యం కాలంలో కృష్ణమోహన్‌ అనే (తరువాతి కాలం నుంచి వచ్చిన) యువకునిగానూ, కృష్ణదేవరాయలుగానూ రెండు పాత్రల్లో బాలకృష్ణ ఆహార్యంలో తన తండ్రి ఎన్టీఆర్‌ను తలపించారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు అంతగా అలవాటు లేని ఈ విధమైన క్లిష్టతతో కూడుకున్న కథను తెరకెక్కించి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో సింగీతం శ్రీనివాసరావు ప్రతిభ కనిపిస్తుంది. అమ్రీష్‌ పురి విలనిజం, రాజనర్తకిగా సిల్క్‌ స్మిత హొయలు, సైన్‌టిస్ట్‌గా టీను ఆనంద్‌.. నటనా పరంగా ప్రధాన బలాలు. అందుకే జనరంజకమైన ఈ చిత్రమంటే నేటికీ అందరితో పాటు నాకు విపరీతమైన ఇష్టం.

- దార్ల శ్రీనివాసులు ఆచారి, నందలూరు (మం), నాగిరెడ్డిపల్లె (గ్రామం), కడప (జిల్లా).
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.