అందుకే ‘అత్తారింటికి దారేది’ దారి వేరు

సా
ధారణంగా కథ బావున్న సినిమాలు హిట్‌ అవుతుంటాయి. కానీ ఎంత మంచి సినిమా అయినా విడుదలకు ముందే  సగంపైగా నెట్టింట్లో ప్రత్యక్షమయితే? అది కూడా హెచ్‌డీ క్వాలిటీతో. అంతకన్నా కావాల్సింది ఏముంటుంది కదా. థియేటర్‌కి వెళ్లి చూడాలనే ఆసక్తి పోతుంది. కథానాయకుడు, దర్శకుడి అభిమానులు కొంతమంది చూస్తారు తప్ప ఇతరులు చూసే ప్రస్తావన ఉండదు. ఇదంతా అలా విడుదలకు ముందే నెట్‌లో వచ్చిన సినిమాల పరిస్థితి. ‘అత్తారింటికి దారేది’ సినిమా మాత్రం దీనికి పూర్తి భిన్నం. రిలీజ్‌కు ముందు సగం చిత్రం అంతర్జాలంలో విడుదలైననా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమాకు కథ బలంగా ఉండాలే కానీ ఇలాంటివి ఏం చేయలేవని నిరూపించింది. నిర్మాతలకు కాసులతో పాటు ధైర్యాన్నిచ్చిందీ సినిమా. మేజర్‌ క్రెడిట్‌ మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కే దక్కుతుంది. ఒక సున్నితమైన పాయింట్‌ని తీసుకుని దానికి భావోద్వేగాలను జతచేసి, మాయచేసే మాటలను రాసి, పవన్‌ లాంటి క్రేజ్‌ ఉన్న హీరోతో వెండితెరపై త్రివిక్రమ్‌ చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు. అప్పటి వరకు ఉన్న సినిమా రికార్డ్స్‌ అన్నిటినీ బద్దలు కొట్టిందంటేనే ఈ సినిమా రేంజ్‌ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.


కథ మన ఇంటి కథలా అందంగా ఉంటే.. హీరోని ఓ రేంజ్‌లో ప్రెజెంట్‌ చేస్తే.. అవసరం అనుకున్న చోటల్లా.. డైలాగ్స్‌ పేలుతుంటే.. సంగీత దర్శకుడు(దేవీశ్రీ) అత్యుత్తమ సంగీతాన్ని ఇస్తే..దానికి మించిన నేపథ్య సంగీతం సీన్స్‌ని మరో రేంజ్‌లో మనకు చూపుతుంటే.. అందరూ తమ తమ పాత్రల్లో అందంగా ఒదిగిపోతే...‘‘అత్తారింటికి దారేది’’ అందమైన సినిమా అవుతుంది.


అర్థం పర్థంలేని సినిమా టైటిల్స్, ఆంగ్లం నుండి అరువు తెచ్చుకున్న టైటిల్స్‌ తెలుగు సినిమాకి పెడుతున్న వేళ, మంచి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌ లాంటి హీరో సినిమాకి ‘అత్తారింటికి దారేది’ అని త్రివిక్రమ్‌ పెడితే. ఇండస్ట్రీ షాక్‌ అయింది. ఆడియన్స్‌ అయితే...తమ తమ బాల్యానికి గుర్తుతెచ్చుకుని మురిసిపోయారు. అచ్చతెలుగులో పెట్టిన పేరు ఒక మంచి చిత్రమై ఆబాలగోపాలాన్ని ఓలలాడించింది. బాక్స్‌ఆఫీస్‌కు కలెక్షన్ల దాహం తీర్చింది. అందుకే ఈ సినిమా వచ్చి 6వ వసంతాలు పూర్తయినా అందరి గుండెల్లో నిలిచిపోయింది. 2013 సెప్టెంబరు 27న విడుదలైంది.

-Vరు, హైదరాబాద్‌Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.