సమ్మోహన గీతమది!
1975వ సంవత్సరంలో వచ్చిన మలయాళ చలనచిత్రం ‘స్వామి అయ్యప్పన్‌’ తమిళం, తెలుగు భాషలలోనూ విడుదల అయింది. తెలుగులో ‘స్వామి అయ్యప్ప’ పేరిట విడుదల అయిన ఈ అనువాద చిత్రానికి నిర్మాతలు ప్రకాశ్‌ ప్రొడక్షన్స్‌.చలనచిత్రం: స్వామి అయ్యప్ప (తెలుగు) స్వామి అయ్యప్పన్‌ (మలయాళం)


సంగీతం: దేవరాజన్‌;


నటనము: తంగప్పన్‌;


రచన: మాగాపు అమ్మిరాజు;


దర్శకత్వం: పి. సుబ్రమణ్యం.


....................

స్వర్ణ ప్రతిమ వలె నటియించనా

నేను జగతి సమ్మోహనమ్ము గావించనా ।।2।।

మోహిని యను పేర భాసింతునూ

నవ్య మోహం డెందాల యందు రగిలింతునూ ।।2।।

మనసులా ప్రేమ వీణ మ్రోగింతునూ

దివ్యమైనా విలాస డోలా తేలింతునూ

సౌందర్యములు విరియ చరియింతునూ

అమృతానంద రాగాలా వలపింతునూ

నరుల మనస్సులను మురిపింతునూ

నాదు అవతారం ప్రాణులకు నవ సౌఖ్యమూ

పున్నమి వెన్నెల కన్నుల యందున పులకింతూ

మధుర సుఖమ్ములు హృదయము లందున పుష్పింతూ

హావ భావములు పుష్ప బాణములు సారించూ

దేవ కాంత యే నవ్య నాట్యములు

దివ్య లోకములె భువి ని వెలయించు

నా గజ్జెల రవళియె భువనాల్‌ మార్మోగే

నేనాడే నాటక మనంతమే.. ।।2।।

వర్షించును రాగమ్ములు మధువులు

హర్షించును ఈ ఇలలో మనసులు

నవ్వులా వలపులే విరియగ

చూపులా స్వర్గమే వెలయగ

దానవ ముష్కరులు తల వంచగా

కోరి దివిని మహర్షులంత దీవించగా

జీవులంతా సుఖ శాంతుల తేలగా

ఈ దేవా దూత యే మహినే విలసిల్లా


‘స్వర్ణ ప్రతిమ వలె నటియించనా నేను జగతి సమ్మోహనమ్ము గావించనా..’ అనే పల్లవితో వెండితెర పై తళుకులీనిన ఈ పాట నాకు ఎంత నచ్చిందో. చిత్రం టైటిల్స్‌లో దేవరాజన్‌ అని కనిపించే సంగీత దర్శకుడి పూర్తి పేరు పరవూర్‌ గోవిందరాజన్‌ దేవరాజన్‌. ఈయన ‘దేవరాజన్‌ మాస్టర్‌’గా ప్రసిద్ధులు. ఈ గీతాన్ని మోహన రాగంలో స్వరపరచి, గాయని పి.మాధురితో పాడించారు. ఈ పాటలో మోహిని వలె నటి లక్ష్మి చేత సమ్మోహనంగా నటింపచేశారు డాన్స్‌ మాస్టారు తంగప్పన్‌. లక్ష్మి 1930ల నాటి నటి కుమారి రుక్మిణి మరియు ప్రముఖ నిర్మాత, దర్శకుడు యరగుడిపాటి వరదారావు (వై.వి.రావు)ల కుమార్తె. సినిమాలలో నాట్య సన్నివేశాలను ఎన్నింటినో చూసిన నాకు ఈ పాటలో కనిపించే లయలు, హొయల జోరే వేరు అని అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ‘‘మనసుల ప్రేమ వీణ మ్రోగింతును’’ ఇంకా, ‘‘నరుల మనస్సులను మురిపింతునూ’’ అన్న పంక్తులకు కూర్చిన పద విన్యాసాన్ని అయితే చూసి తరించవలసిందే.- దిలీప్, హైదరాబాద్‌ (మియాపూర్‌)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.