చెప్పినట్టుగానే ట్రెండ్‌ సెట్‌ చేశాడుచెప్పినట్టుగానే

ట్రెండ్‌ సెట్‌ చేశాడు..

తన తిక్క చూపించి లెక్కలు తేల్చాడు..

ఆయనకు ఆయనే పోటీ..

ఆయనతో ఆయనకే పోటీ అని నిరూపించాడు..

అభిమానుల కోరిక తీర్చాడు..

చెప్పిన దాని మీద నిలబడి చూపించాడు..

టైం నమ్మలేదు.. తన టైమింగ్‌ని నమ్మాడు..

చివరగా

ఆ హెడ్‌కి వెయిట్‌ ఎక్కువ అనిపించుకున్నాడు...

ఆయనే పవన్‌ కల్యాణ్‌.. అని ప్రతి ఒక్కరు సగర్వంగా చెప్పుకునేలా చేశాడు.

దానికి కారణం ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రం.

- తెలుగు తెరపై సరికొత్త పోలీసుని పరిచయం చేసిన సినిమా ఇది. దర్శకుడు కాకుండా ఓ అభిమానే పవన్‌ని డైరెక్ట్‌ చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించిన సినిమా ఇది. అయితే ఈ ఫలితం వెనక ఎన్నో సమస్యలున్నాయి.

వరస పరాజయాలున్న హీరో..
ఒక్క హిట్‌ లేని హీరోయిన్‌..
కేవలం రెండు చిత్రాలే రూపొందించిన నిర్మాత..
మూడో చిత్రమే రీమేక్‌ ఎంచుకున్న దర్శకుడు..


- ఓ సినిమాకు ప్రధానంగా నిలిచే ఈ నలుగురూ ఫెల్యూర్‌లో ఉన్నవాళ్లే. మరి ఇలాంటి కాంబినేషన్‌ని ఎవరు మాత్రం స్వాగతిస్తారు? ‘‘మేము ఆకాశం లాంటి వాళ్లం.. ఉరుమొచ్చినా మెరుపొచ్చినా, పిడుగొచ్చినా.. ఎప్పుడూ ఒకేలా ఉంటాం’’ అని తమని తాము నమ్మి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ వసూళ్లు, రికార్డులు, అవార్డులు గురించి చెప్పేదేముంది. మే 11 2012 దానికి నాంది పలికింది. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా పవర్‌ తగ్గలేదు. పోలీసు కథాంశంతో ఇలాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇకపై రాబోదు.

- ప్రతి వేసవికి ఎండొస్తుంది కానీ ‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి చిత్రం మాత్రం రాదు. పవనంటే ఓ దర్శకుడికి ఉన్న భావోద్వేగం ఈ సినిమా. పవన్‌కి జీవితాంతం చెప్పే ఓ నిర్మాత కృతజ్ఞత ఈ సినిమా. రీమేక్‌ రూపొందించాలంటే కథ ఉంటే సరిపోదు. ఇక్కడి పరిస్థితులకి తగ్గట్టు మార్పులు చేసి సత్తా చాటుకోవాలి. చాటారు కూడా. దానికి నిదర్శనమే ‘మాటలు- మార్పులు- దర్శకత్వం: హరీశ్‌ శంకర్‌’ అనే టైటిల్‌ కార్డు.

- శ్రుతిహాసన్, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, అజయ్, సుహాసిని, నాగినీడు, రావు రమేశ్, బ్రహ్మానందం, అలీ, జయ ప్రకాశ్‌ రెడ్డి, తనికెళ్ల భరణి, ప్రభాస్‌ శ్రీను, ఆకాశ్‌ పూరి, ప్రవీణ్, ధనరాజ్, సత్యం రాజేష్, అంతక్ష్యారి బృందం... ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయినా నాకు మాత్రం ఇది పవన్‌ షో... వన్‌ మేన్‌ షోనే అనిపిస్తుంది. తెర వెనక ఉన్న మరో మేన్‌.. దేవీశ్రీ ప్రసాద్‌. ఈ చిత్రానికి చిరస్థాయి సంగీతం అందించాడు. ఒకటా రెండా? ఆరు పాటలూ.. అప్పటికి.. ఇప్పటికి.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా మోతమోగించాడు.

- హరీశ్‌ శంకర్‌- పవన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ‘పవన్‌ 28’ చిత్రం ఇంతకు మించి వినోదం పంచాలని.. దానికి కూడా దేవీనే సంగీతం ఇవ్వాలని కోరుకుంటూ....

‘గబ్బర్‌ సింగ్‌’ చిత్ర ప్రేమికుడు,

-రవి, ఏలూరు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.