
నేను ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల జాబితాలో ముందుంటుంది ‘ఘరానా మొగుడు’. చిరంజీవి, నగ్మ, వాణి విశ్వనాథ్ నటన, కీరవాణి సంగీతం, రాఘవేంద్రరావు టేకింగే దానికి కారణం. సినిమా వచ్చి పాతికేళ్లపైనే అయినా ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ముఖ్యంగా చిరంజీవి మ్యానరిజం అప్పట్లో ఓ ట్రెండ్. ‘ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకోండి’’ అంటూ చిరు చెప్పే సంభాషణ భలే గమ్మత్తుగా ఉంటుంది. కార్మిక సంఘ నాయకుడు రాజు పాత్రలో చిరు ఒదిగిపోయారు. ఈ చిత్రానికే నగ్మనే ప్రధానంగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఉమ ఇండస్ట్రీ అధినేతగా ఉమ పాత్రలో నగ్మ నటన అత్యద్భుతం. ఆమె తప్ప మరెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరేమో అనిపిస్తుంటుంది. తనదే పైచేయి కావాలని చూసే అమ్మాయిగా జీవించింది. అటు కోపంగా ఉంటూనే ఇటు తన అందచందాలతో మైమరపించింది. ఉమ పి.ఎ. పాత్రలో వాణి విశ్వనాథ్ సైతం కనువిందు చేసింది. చిరు సరసన ఈ ఇద్దరు భామలు అదరగొట్టారు. కీరవాణి సంగీతం ఓ ఊపు ఊపింది. రావుగోపాలరావు, సత్యనారాయణ, రమప్రభ, బ్రహ్మానందం తదితరులు ఆయా పాత్రల్లో సందడి చేశారు. ఓ పక్క వినోదం పంచుతూనే మరోవైపు తల్లి, కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపిస్తూ మనసును దోచుకున్నాడీ ‘ఘరానా మొగుడు’.
ఈ చిత్రంలో బాగా నచ్చిన డైలాగ్:
ఆడదానికి అసూయ ఉండొచ్చు
అందంగా ఉండాలన్న ఆశ ఉండొచ్చు కానీ
అర్థంలేని ఆవేశం ఉండకూడదు
నచ్చిన పాటలు:
* బంగారు కోడిపెట్ట
* హే పిల్ల హల్లో పిల్ల
* కిటుకులు తెలిసిన
-కార్తికేయ, జంగారెడ్డిగూడెం.