అలాంటిలాంటి అమ్మాయి కాదురా!

నాకు రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం అంటే చాలా ఇష్టం. హుషారెత్తించే పాటైనా.. ప్రేమ రాగమైనా.. ప్రత్యేక గీతమైనా ఆయన శైలి ప్రత్యేకం. ఆయన నుంచి కొత్త పాటలు ఎప్పుడొస్తాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను. ఆయన రాసిన వాటిలో నేను మిస్‌ అయినవి ఏమైనా ఉన్నాయా? అని అన్వేషిస్తుంటాను. అలా వెతుకుతున్నప్పుడు వినపడింది ‘అలాంటిలాంటి అమ్మాయి కాదురా’. మనోజ్‌, ప్రగ్యా జైస్వాల్‌ జంటగా తెరకెక్కిన ‘గుంటూరోడు’ చిత్రంలోనిదీ గీతం. డీజే వసంత్‌ స్వరాలు సమకూర్చగా విజయ్‌ యేసుదాస్‌ చక్కగా ఆలపించారు. కథానాయకుడు తను ఇష్టపడే అమ్మాయి గురించి వివరించే పాట ఇది. నిడివి తక్కువైనా భావం లోతైంది. ఆ పాట వినగానే ‘సితార’ పాఠకులతో నా అభిప్రాయం పంచుకోవాలనిపించింది.

పెళ్లి చూపులకు వెళ్లిన కథానాయకుడికి అనుకున్న అమ్మాయి కాకుండా ఆమె స్నేహితులరాలు నచ్చుతుంది. ఈ విషయం తెలిసిన హీరో మిత్రులు అది ప్రేమ కాదు.. అందం వల్ల కలిగిన కోరిక అని వాదిస్తారు. అలాంటిదేం లేదు .. తను అలాంటిలాంటి అమ్మాయి కాదు.. అంటూ తను మనసిచ్చిన అమ్మాయి గురించి వ్యక్తపరిచే భావాల్ని రామజోగయ్య అద్భుతంగా రాశారు. అచ్చతెలుగు పదాలతోనే అభివర్ణించిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ప్రేమకు చిహ్నంగా నిలిచే తాజ్‌మహల్‌పై ఒట్టు పెట్టి ప్రేయసి రంగు తెలపడం.. కోహినూర్‌ వజ్రం మీద ప్రమాణం చేస్తూ మనసు ఎంత అందంగా ఉంటుందో చెప్పడం.. భలే అనిపిస్తుంది. రంగుల విల్లుతో పోల్చడం.. ఆ విల్లు గుండెను గిల్లడం.. అలలా వచ్చి తాకడం అని చమత్కరించడం చాలా బావుంది. ఆయనందించిన అద్భుతమైన సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. రామజోగయ్య శాస్త్రి గారు ఇలాంటి పాటలు మరిన్ని రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....

-కార్తికేయ, పశ్చిమ గోదావరి.

పల్లవి:

కదిలే రంగుల విల్లురా

ఎదురై గుండెను గిల్లెరా

అరెరె వెన్నెల కూతురా..ఆ..ఆ

అనిపించిందా అప్సర

చరణం:1

తాజ్‌మహల్‌ మీదొట్టు తన మేనిరంగు మెరుపు

కోహినూర్‌ మీదొట్టు తన మనసు అచ్చ తెలుపు

రేయిలాంటి మైమరపు నీలాల కురుల నలుపు

పరుగు తీసే ప్రతి తలపు ఆ రాకుమారి వైపు

అలాంటిలాంటి అమ్మాయి కాదురా

అలై వచ్చి నన్నే తాకెరా

అలా ఎలా పుట్టేసిందిరా

అమాంతంగా నచ్చేసిందిరా

చరణం: 2

బొమ్మగా తననే చేసి బ్రహ్మ తన పనిమానేసి

బుగ్గలే గిల్లాడేమో ..ఓ.. ఓ..

అందమే తననే చూసి ముద్దుగా దిష్టే తీసి హారతే పడుతుందేమో

ఆ సొగసులపై ఓ కవితే

రాయాలన్నా

ఏ భాషలో పదములు అయినా

సరిపోయేనా..ఆ ..ఆ..

అలాంటిలాంటి అమ్మాయి కాదురా

అలై వచ్చి నన్నే తాకెరా

అలా ఎలా పుట్టేసిందిరా

అమాంతంగా నచ్చేసిందిరాCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.