జగదేక వీరుడు అంటే చిరంజీవి.. అతిలోక సుందరి అంటే శ్రీదేవి....!


నవరస భరితమైన చిత్రాలంటే ఏమిటి? అనే ప్రశ్నకి సమాధానం...

సినిమాని జనరంజకంగా నిర్మించడం అంటే ఎలా?అనే ప్రశ్నకి సమాధానం...

సినిమా హిట్‌ కావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.... ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా చూడాల్సిందే.ముఖ్యంగా సోషియో ఫాంటసీలకి రాఘవేంద్రరావు మార్కు సినిమా ఇది. చిత్రం ప్రారంభంలోనే ముద్దులొలికే బేబీ షామిలిని చిరంజీవి భుజాలపైకి ఎత్తుకొన్నప్పుడే ఈ సినిమా పిల్లలకు నచ్చే విధంగా రూపొందించినట్లు అర్థమైపోతుంది. కామెడీ ట్రాక్‌ని కథలో భాగంగా చేయడం, చిన్న విలన్ల గుంపుని ఒకేసారి కాకుండా నెమ్మదిగా ఒక్కొక్కరినీ కలుపుతూ అమ్రిష్‌ పురి లాంటి మాంత్రికుడు, మెయిన్‌ విలన్‌కి కలపడం, సీన్‌కి సీన్‌కీ లింక్‌ వేయడంలో....స్కీన్ర్‌ ప్లేకి ఒక మంచి అవగాహన వర్ధమాన దర్శకులకి కలిగించే పాఠం ఈ సినిమా. ఇక జగదేకవీరుడు అంటే చిరంజీవి చేసే సాహసాలు, ఆయన అల్లు రామలింగయ్యతో చేసే చమత్కారాలు ఇందులో చూడాల్సిందే. ఇక శ్రీదేవి నిజంగా దేవలోకం నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది. ఆమె అచ్చమైన సంస్కృత భాషలో ‘మానవ..ఓ మానవా..’’అంటూ పిలిచే మాటలు చాలా చక్కగా ఉంటాయి. చక్కటి పాటలు, జంధ్యాల మార్కు మాటలు, ఇళయరాజా నేపధ్య సంగీతం, ఇలా అన్నీ ఏంటో అలా కుదిరిపోతాయంతే మరి! ఇప్పటి తరం పిల్లలకు వేసవి సెలవుల్లో లేదా మరో ఆదివారం ఈ సినిమా చూపండి.


పవని భాను చంద్ర మూర్తి,

చీరాల, ప్రకాశం జిల్లా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.