ఆ మాటతో ఎమ్మెస్‌ కంటతడి పెట్టించారు

మ్మెస్‌ నారాయణ.. ఈపేరు చెప్పగానే వెండితెరపై ఆయన కడుపుబ్బా నవ్వించిన తాగుబోతు పాత్రలు.. అమాయకమైన నటనతో అలరించిన అల్లరి పాత్రలే ఎవరికైనా ఎక్కువగా గుర్తొస్తాయి. అయితే ఎమ్మెస్‌ హాస్య పాత్రలతో ఎంతగా నవ్వులు పూయించగలడో.. మనసులను కదిలింపజేసే పాత్రల్లోనూ అంతే అద్భుతంగా ఒదిగిపోగలడు. దానికి ఉదాహరణే ‘పిల్లజమిందార్‌’లోని తెలుగు మాస్టారి పాత్ర. మాతృ భాష పరిరక్షణ కోసం పరితపించిపోయే ఉద్దండం అనే తెలుగు మాస్టారిగా ఆయన పలికిన సంభాషణలు, కనబర్చిన నటన మనసులను హత్తుకుంటాయి. ముఖ్యంగా సినిమాలో కథానాయకుడు నాని - ఎమ్మెస్‌ నారాయణల మధ్య వచ్చే ఓ సన్నివేశం నన్ను విపరీతంగా కదిలిచింది. ‘‘తెలుగు చచ్చిపోయే రోజు వస్తుందంట. అదే జరిగితే మీ తెలుగు పంతుళ్లు ఏమైపోతారో’’ అని ఎమ్మెస్‌ను ప్రశ్నించగా.. దానికి ఆయన ‘‘తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దాని కంటే ఒక్క రోజు ముందు నేనే చచ్చిపోతారా. పక్క రాష్ట్రాల వాళ్లు ‘భాష.. భాష.. భాష..’ అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలని అనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవడం కాదు రా. అది మన అమ్మతో బాధలు ఆనందాలు పంచుకునే వారధి. అయినా దెబ్బ తగిలితే ‘షిట్‌’ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పదనం ఏమి అర్థమవుతంది’’ అంటూ భావోద్వేగంతో చెప్పడం హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ వినాలనిపించే డైలాగ్‌ అది. ఈ చిత్రాన్ని దర్శకుడు జి.అశోక్‌ తెరకెక్కించగా.. నాని, హరిప్రియ, బిందు మాధవి నాయకానాయికలుగా నటించారు. అవసరాల శ్రీనివాస్, తాగుబోతు రమేష్, ధనరాజ్, రావు రమేష్‌ తదితరలంతా ముఖ్య పాత్రల్లో నటించారు.

- దొంతగాని సాయి ప్రసాద్, కోదాడ.మీరు చూసిన సినిమాల్లో ఎన్నో సన్నివేశాలు, పాటలు, డైలాగులు మీ మనసులో ముద్రవేసుకుని ఉంటాయి. వాటిని అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ‘సితార.నెట్‌’. మీకు నచ్చిన సినిమాల గురించి కానీ, వాటిలో మీకు నచ్చిన అంశాల గురించి కానీ ఎందుకు నచ్చిందో విశ్లేషణాత్మకంగా రాసి, మాకు పంపించండి. మీ ఫొటోతో వాటిని ప్రచురిస్తాం. మా చిరునామా: sitaradesk@sitara.net


సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.