మహేష్‌ని సరికొత్తగా చూపిన ‘దూకుడు’

హేష్‌ బాబు నా అభిమాన నటుడు. ఆయన డైలాగ్‌ చెప్పే విధానం నన్ను బాగా ఆకట్టుకుంటుంది. కానీ వ్యక్తిగతంగా, వెండితెరపైనా మహేష్‌ చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. దాంతోపాటు ఎక్కువగా ఆయన్ను సీరియస్‌ పాత్రలకే పరిమితం చేశారు దర్శకులు. మహేష్‌ ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ జోనర్‌లో వెండితెరపై అనర్గళంగా ఎప్పుడు చూడాలి అనుకునే తరుణంలో వచ్చింది ‘దూకుడు’ చిత్రం. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కంచిన ఈ చిత్రంలో మహేష్‌ సరికొత్తగా కనిపించి అలరించాడు. అజయ్‌ కుమార్‌ పాత్ర(పోలీస్‌ అధికారి)లో ఒదిగిపోయాడు. కేవలం వినోదం మాత్రమే కాదు ఓ తండ్రి కోరికను తీర్చే తనయుడి పాత్రను తీర్చిదిద్దారు దర్శకుడు. శంకర్‌ నారాయణగా ప్రకాష్‌ రాజ్, అతని సోదరుడిగా రాజీవ్‌ కనకాల, స్నేహితులుగా షియాజీ షిండే కనిపించిన తీరు ఆకట్టుకుంది. వీళ్లు రోడ్డు ప్రమాదానికి గురవడానికి కారణం ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మధ్యలో అజయ్‌కు ప్రశాంతి(కథానాయిక సమంత) కలవడం, ఇద్దరూ ప్రేమలో పడటం, ఆమె అజయ్‌ సీనియర్‌ అధికారి మూర్తి (నాజర్‌) కూమార్తె అని తెలవడం ఆద్యంతం అద్భుతంగా సాగుతుంది. 

                                

కోమాలో ఉన్న శంకర్‌ నారాయణకు అసలు విషయం తెలియకుండా ఉండేందుకు అజయ్‌ ఓ ఇంట్లో రాజకీయ వాతావరణం సృష్టిస్తాడు. రియాలిటీ షోలో నటించాలనుకునే పద్మశ్రీ(బ్రహ్మానందం)ను ఎంపిక చేసుకుంటాడు. నటన పిచ్చి ఉన్న మరో వ్యక్తి బొక్క(ఎం.ఎస్‌. నారాయణ)ని ట్రాప్‌ చేస్తాడు. వీళ్ల కలయికలో వచ్చే సన్నివేశాలు చూస్తుంటే పొట్ట చెక్కలవ్వాల్సిందే. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ.. అక్కినేని నాగార్జున ఆయన నటనకు భారీ రెమ్యునరేషన్‌ ఇస్తాడనే భ్రమలో ఉంటాడు. ఆ సన్నివేశంలో ఆయన హావభావాలు తలుచుకుంటే నవ్వు ఆగదు. చివరకు అనుకున్న విధంగా అజయ్‌ తన తండ్రిని మోసం చేసిన వారిని ఎందుకు చంపావని శంకర్‌ అడగ్గా.. నాకు జన్మనిచ్చిన నీకు ఏమైన అయితే తట్టుకోలేను. అందుకే ఇలా చేశాను అని చెప్పడం హృదయాన్ని హత్తుకుంటుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. తమన్‌ అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం ఇప్పటికీ వింటూనే ఉంటాను. ముఖ్యంగా ‘గురువారం మార్చి ఒకటి‘, ‘నీ దూకుడు సాటెవ్వడు’ పాటలు రిపీట్‌ మోడ్‌లో వింటాను. ‘కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాక్‌ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’.. నా అభిమాన నటుడు వెండి తెరపై ఈ డైలాగ్‌ చెప్పి అప్పుడే 8 ఏళ్లు గడిచాయా? అనిపిస్తుంది. 2011 సెప్టెంబరు 23న విడుదలైంది ‘దూకుడు’. ఇలాంటి చిత్రాలు ఆయన మరికొన్ని తీయాలని కోరుకుంటూ..-గద్దె వెంకటేశ్, ఖాజీపేట


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.