ఈ సినిమా నచ్చడం న్యాచురల్‌

థానాయకుడు అంటే ఏదైనా చేసేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడనే భావన తెలుగు ప్రేక్షకులది. అలాంటిది హీరోకే మానసిక సమస్య ఉంటే? ఎవరైనా చూస్తారా? పైగా మారుతి దర్శకుడు. ఆయనదంతా వేరే వ్యవహారమంటూ అప్పట్లో చర్చసాగేది. అలాంటి అపోహల్ని పటాపంచలు చేస్తూ హీరోగా నానికి, దర్శకుడిగా మారుతికి అప్పటి వరకు లేని గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్‌’. ఈ చిత్రంతోనే నాని ‘న్యాచురల్‌ స్టార్‌’గా మారారు. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మతిమరుపు ఉన్న వ్యక్తిగా నాని నటించడం కాదు జీవించాడు. ఈ సినిమాలో కామెడీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. లావణ్య త్రిపాఠిని చేసుకునేది నానినా? వెన్నెల కిశోరా? అని తెలియక తికమక పడే శ్రీనివాస రెడ్డి హావభావాలు చూస్తే నవ్వులు పూయాల్సిందే. కొన్ని సందర్భాల్లో తను ఎందుకు పుట్టానని నాని బాధపడే సన్నివేశాలు హృదయాన్ని కలిచివేస్తాయి. నానికి ఉన్న సమస్య తెలిసిన మురళీ శర్మ ఇలా ఎలా బతుకుతున్నావనగానే ‘‘చేయడానికి ఓ పని, బతికడానికి ఓ ఆశ, ప్రేమించడానికి ఓ మనిషి’’ ఉంటే చాలు అని నాని చెప్పే డైలాగు తన నమ్మకాన్ని తెలియజేస్తుంది. నాని తండ్రిగా నరేశ్‌ ఒదిగిపోయాడు. ప్రతి నాయకుడిగా అజయ్‌ మెప్పించాడు. గోపీ సుందర సంగీతం అత్యద్భుతం. ముఖ్యంగా కీర్తనలకు సంబంధించిన ‘స్వామి రారా’ పాట, పేరుకేమో వీడు నాని రెచ్చిపోతే ధోనీ లాంటి ఫాస్ట్‌ బీట్‌ను ఇప్పటికీ హమ్మింగ్‌ చేస్తూనే ఉంటాను.


- ఇట్ట అభిసాయి, మద్దునూరు

మీరు చూసిన సినిమాల్లో ఎన్నో సన్నివేశాలు, పాటలు, డైలాగులు మీ మనసులో ముద్రవేసుకుని ఉంటాయి. వాటిని అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ‘సితార.నెట్‌’. మీకు నచ్చిన సినిమాల గురించి కానీ, వాటిలో మీకు నచ్చిన అంశాల గురించి కానీ ఎందుకు నచ్చిందో విశ్లేషణాత్మకంగా రాసి, మాకు పంపించండి. మీ ఫొటోతో వాటిని ప్రచురిస్తాం. మా చిరునామా: sitaradesk@sitara.net


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.