ఎప్పటికీ ‘ఎంసీఏ’ను మర్చిపోలేను
అవి అమీర్‌పేటలో చదువుతున్న రోజులు. నానిపై ఉన్న అభిమానంతో ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చూద్దామని సత్యం థియేటర్‌కు సెకండ్‌ షోకు స్నేహితుడితో కలిసి వెళ్లాను. అప్పటికే హౌజ్‌ఫుల్‌ బోర్డు దర్శనమిచ్చింది. మనసు ఊరుకోవడం లేదు, వెంటనే సినిమా చూడాలంది. నానిపై ఉన్న ఇష్టాన్ని, ఆ సందర్భంలో నన్ను.. గ్రహించిన వాడు వెంటనే ఆన్‌లైన్‌లో మరో థియేటర్‌లో బుక్‌ చేశాడు. హుటాహుటిన టైటిల్స్‌ కూడా మిస్‌ అవ్వకూడదని బయలుదేరాం. నాని కటౌట్‌ కనిపించే సమయానికి చేరుకున్నాం. 2017 డిసెంబరు 21న జరిగింది ఇదంతా. ‘ఎంసీఏ’ విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రం తాలూకూ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ...


సినిమా మొదలైంది.. మధ్య తరగతి అబ్బాయిగా నాని నటన మెప్పించింది. నాని- సాయి పల్లవి జంట కనుల పండగలా అనిపించింది. అంతగా అలరించిందీ జోడి. నాని వదినగా ప్రముఖ నటి భూమిక ఒదిగిపోయింది. అన్నా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు, బావా మరదళ్లు.. ఇలా చాలా చిత్రాలు తెరకెక్కాయి కానీ వదినా మరిది బంధం నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. వాటిలో ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. నాని అన్నయ్యగా రాజీవ్‌ కనకాల నటించారు. అన్నదమ్ముల మధ్య వదిన రంగ ప్రవేశం చేస్తే మధ్య తరగతి కుటుంబంలో ఎలా ఉంటుందో? అనుకోని సంఘటనలు ఎదురైతే పరువు కోసం మిడిల్‌ క్లాస్‌ వాళ్లు ఏం చేస్తారో? వెండితెరపై చక్కగా చూపించారు దర్శకుడు వేణు శ్రీరామ్‌. నేనూ మధ్య తరగతి అబ్బాయినే కాబట్టి ఆ సన్నివేశాలు హత్తుకున్నాయి. వినోదం పంచాయి. ఇందులోని పాటలు ఎన్ని సార్లు విన్నా మరోసారి వినాలనిపిస్తుంటాయి. ముఖ్యంగా ‘ఏమైందో తెలియదు నాకు’, ‘కొత్తగా కొత్తగా’, ‘ఏవండోయ్‌ నాని గారు’ పాటలు. దేవీశ్రీ ప్రసాద్‌ తన మార్క్‌ చూపించాడు. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరుతూ...
- సుధీర్‌ రవి, చింతలపూడి, పశ్చిమగోదావరి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.