ఆ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు..

నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎన్నో భక్తి గీతాలను వింటూ వస్తున్నాను. అయితే, ‘నర్తనశాల’ తెలుగు చలనచిత్రం లోని ‘‘జననీ శివ కామిని..’’అనే పాటను వింటూ వుంటే అమ్మవారి మీద భక్తి భావం పొంగిపొరలుతుంది. పార్వతి దేవిని చిన్న చిన్న పదాలతోనే గీత రచయిత కీర్తి శేషులు సముద్రాల రాఘవాచార్య అర్చించిన విధానం ఆకట్టుకుంటుంది. నేటికీ తెలుగు వారి ఇళ్లలో మారుమోగుతున్న ఇటువంటి పాట.. నా ఒక్కరికే కాదు, మరెందరికో ఆరాధ్య గీతం అని నేను నమ్ముతున్నాను. వెండి తెరమీద ఈ గీతం చిత్రీకరణలో పాలుపంచుకొన్న సినీ నటి సావిత్రిది ఎంతటి భాగ్యమో కదా. ఈ పాట ను ప్రేక్షకుల మనోనేత్రాల ముందు నిలపడానికి ఫిలిమ్ కెమెరాకు ముందు వెనుకల పాటుపడిన.. సుసర్ల దక్షిణామూర్తి (సంగీత దర్శకత్వం), పి. సుశీల (నేపథ్య గానం), వెంపటి పెద సత్యం (నృత్య‌దర్శకత్వం), ప్రతిభా శర్మ, టి.వి.ఎస్. శర్మ (కళా దర్శకత్వం), ఎస్.పి.ఎస్. వీరప్ప (కూర్పు), ఎస్. రామారావు (శబ్దం), ఎమ్.ఎ. రహమాన్ (ఛాయాగ్రహణం).. వీరి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలపకుండా ఉండలేకపోతున్నాను. సి.లక్ష్మీరాజ్యం, కె.శ్రీధరరావులు రాజ్యం పిక్చర్స్ పతాకం పై కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం 1963 లో విడుదల అయింది. అప్పటికి నేను ఇంకా ఈ భూమి మీదకు రానేలేదు! మా ఇంట్లో పూజ జరిగిన ప్రతి సారీ ఈ పాటను మా అమ్మ గారు భక్తి ప్రపత్తులతో ఆలాపించే వారు. ఆమె ఇప్పుడు లేరు.

 - కేతవరపు దిలీప్, మియాపూర్
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.