చదవాలనే తపన పెంచే ‘స్టూడెంట్‌ నం.1’

‘చదవాలనుంటే ఎలాగైనా చదువుకోవచ్చు, సత్య చూసినా అభ్యంతరం పెట్టకుండా, పైగా తను మెచ్చుకునేలా చదువుకుంటాను ఓకే’ అంటూ ఓ యువకుడు తన మిత్రులకు సమాధానం చెప్తాడు. ఈ ఒక్క మాట చాలు ఆ యువకుడికి చదవంటే ఎంత శ్రద్ధో. అంతేనా సినీ మ్యాగజైన్‌లో లా పుస్తకాలు పెట్టుకుని చదువుతున్నాడంటేనే అతని లక్ష్యం ఎంటో అర్థమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రతినాయక గ్యాంగ్‌ కథానాయకుడికి ఓ క్లిష్టమైన కండిషన్‌ పెడతారు. అది నెగ్గితేనే నువ్వు చదువుకోవాలంటూ ఆట మొదలెడతారు. అందులో ఓడిపోయిన కథానాయకుడు బాధపడకుండా.. తన చదువుకు ప్రతినాయకుడు అడ్డురాకుండా ఓ ఆలోచన చేస్తాడు. అలా తను అనుకుంది సాధిస్తాడు. ఆ కథానాయకుడే జూనియర్‌ ఎన్టీఆర్‌. ఆయన నటించిన ‘స్టూడెంట్‌ నం.1’ చిత్రం కథే ఇది. నాకు జూనియర్‌ ఎన్టీఆర్‌ నటన చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నింటిలో ఈ చిత్రం నన్ను బాగా ఆకట్టుకుంది. వెండితెరపైనే ఎన్నో సార్లు చూసిన ఈ సినిమా ఎప్పుడు టెలివిజన్‌లో వచ్చినా మిస్‌ అవ్వను.


ఆదిత్య(ఎన్టీఆర్‌)కు న్యాయశాస్త్రం చదవాలని కోరిక, కానీ తన తండ్రి ఇంజనీరింగ్‌ చేయించాలని అనుకుంటాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఇదిలా ఉండగా ఓ మానభంగానికి గురవతుందని ఓ మహిళను కాపాడబోయి గూండాను అనుకోకుండా హత్య చేస్తాడు ఆదిత్య. దీంతో తన తండ్రి ఇంట్లో నుంచి వెళ్లిపోమంటాడు. అలా చేయని తప్పుకు జైలుకు వెళ్లిన ఆదిత్య చదువు మీద ఆసక్తితో అనుకున్న లక్ష్యం సాధిస్తాడు.ఇదీ ఈ సినిమా సారాంశం. విద్యార్థి నేపథ్యంలో సాగే ఈ కథ చిరస్థాయిగా నిలుస్తుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా వాటిని ఎదుర్కొని బాగా చదివి అనుకున్న విజయం పొందాలనే స్ఫూర్తి కలిగిస్తుంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన మొదటి సినిమా ఇది. తొలి సినిమాతోనే అఖండ విజయం అందుకున్నారు రాజమౌళి. ఇందులోని ఆరు పాటలు ఇప్పటికీ ఏదో సందర్భంలో వింటూనే ఉంటాను. దానికి కారణం కీరవాణి సంగీతం. ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ పాట విద్యార్థులంతా తమ పాఠశాల, కళాశాల చివరి రోజున ఆలపిస్తూనే ఉంటారు. కథానాయిక గజాలా, హాస్య నటులు కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం... అందరి పాత్రలు ఇప్పటికీ మదిలో మెదులుతుంటాయి. ఆణిముత్యం లాంటి ఈ సినిమా వచ్చి 18 ఏళ్లు గడిచాయంటే ఆశ్చర్యంగా ఉంది. అవును.. ఈ సినిమా 2001 సెప్టెంబరు 17న మన ముందుకు వచ్చింది. మంచి సినిమాను అందించిన దర్శకుడు రాజమౌళికి అభినందనలు తెలియజేస్తూ.....

-నాని, సత్తుపల్లి


సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.