రెండు దశాబ్దాల ‘ఒక్క రోజు సీఎం’


తనో సాధారణ పౌరుడు. మీడియా రంగంలో యాంకర్‌గా పని చేస్తుంటాడు. అతనికి అనుకోకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటర్య్వూ చేసే అవకాశం వస్తుంది. ఈ ఇంటర్య్వూ చేసే క్రమంలో సీఎంగా పని చేయటం మామూలు విషయం కాదని కావాలంటే ఒక్క రోజు సీఎంగా పని చేసి చూడమని ఆ ఉద్యోగికి సవాలు విసురుతాడు ముఖ్యమంత్రి. ఆ ఉద్యోగి ఆ సవాలును స్వీకరిస్తాడు. ముఖ్యమంత్రి పదవిలో ఒక్క రోజు ఉండి అతను ఏం చేశాడో ‘ఒక్కే ఒక్కడు’ చిత్రం చూసిన మన అందరికి తెలుసు. అప్పటి వరకు రాజయకీయ అంశాలతో కూడిన కథలు వెండితెరపై చాలానే మెరిశాయి. కానీ అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ థ్రిల్లర్‌ చిత్రాలలో మొదటి వరుసలో నిలిచే చిత్రం ‘ఒకే ఒక్కడు’. నేటికి ఈ చిత్రం విడుదలై సరిగ్గా రెండు దశాబ్దాలు (ఇరవై సంవత్సరాలు). ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు.

ఈ చిత్రానికి దర్శకుడు శంకర్‌ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ప్రపంచంలో శంకర్‌ పేరు తెలియని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. సంగీతం అందించింది ఏ.ఆర్‌. రెహమాన్‌. అర్జున్, మనీషా కోయిరాల, రఘవరన్‌ ప్రధాన తారాంగణం. శంకర్, రెహమాన్‌ల కాంబినేషన్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే గీతాలు ఎన్నో వచ్చాయి. అందులో కొన్ని ఆణిముత్యాలు ‘ఒకే ఒక్కడు’ చిత్రంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా ‘‘నెల్లూరి నెరజానా ...’’ అనే గీతం నేటికి యువతని కూడా ఆకట్టుకుంటుంది. శంకర్‌ చిత్రాలలో పాటలకి ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్కో గీతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ చిత్రంలోని గీతాలని గమనిస్తే శంకర్‌ని భారీ చిత్రాల దర్శకుడు అని ఎందుకు అంటారో, భారతీయ తెరపై హాలీవుడ్‌ స్థాయి సాంకేతికతను ఎలా తీసుకోచ్చాడా అనిపిస్తుంటుంది. ఈ చిత్రంలోని గీతాలన్నీ వేటికవే ప్రత్యేకం. మొదటి గీతం ‘శకలక బేబి’ ఒక పాటని ఎలా చిత్రీకరిస్తారో చూపిస్తారు. ఇద్దరి ప్రేమికుల మధ్య ఉండే విరహ వేదనను ‘నెల్లూరి నెరజాన’ గీతంలో విశాలమైన జలపాతంలో చిత్రీకరించాôడు శంకర్‌. రెండు దశాబ్దాల క్రితమే ‘మగధీర...ధీర’ అనే చిత్రంలో మొత్తం గీతాన్ని అంతా సాంకేతిక మాయాజాలంతో నింపేసి ప్రేక్షకున్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు శంకర్‌. ఈ చిత్రంలోని గీతాలు, కథ, కథనం, ప్రత్యేకంగా చివరి సన్నివేశాలలో వచ్చే అనూహ్య పరిణామాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.