బూతో.. నీతో.. సినిమా ఆడాలి!!

‘‘సినిమా ఆగిపోయిన రోజు ప్రపంచం కూడా ఆగిపోతుంద’’న్నారు ఓ ప్రముఖ రచయిత. ‘‘బూతో.. నీతో.. సినిమా ఆడాల’’న్నారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. అవును!! సినిమా ఆడితేనే ప్రపంచం సాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదేమో. సినిమా అంటే రంగుల ప్రపంచం.. అదో మాయా లోకం.. ఇది నాణేనికి ఓ వైపు. అందుకే కొంతమంది సినిమాని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. సినిమా అంటే దైవం.. అదే ప్రాణం.. ఇది నాణేనికి మరోవైపు. అందుకే చాలామంది అన్నీ వదిలి సినిమానే నమ్ముతారు. సినిమాని నిలబెడతారు. ఈ జాబితాలోనే నిలుస్తారు హరీష్‌. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడుగా ఈయన తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేష్‌’లోని కొన్ని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సినిమా అంటే ఓ భావోద్వేగం. సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు జీవితం అనే సత్యాన్ని చెప్పారు. దర్శకులు కావాలనుకునే వారికి ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తినిస్తాయి. అంతా అయిపోయింది.. మనం చేయడానికి ఇంకేముందనుకునే వాళ్లలో ఆశ రేకిత్తిస్తాయి. అధర్వ, తనికెళ్ల భరణి మధ్య సాగే సంభాషణ వింటే సినిమా అంటే హరీష్‌కి ఎంత మక్కువో అర్థమవుతుంది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని మెగా ఫోన్‌ పట్టిన ఆయన్ను తనికెళ్ల భరణిలో చూస్తున్నట్లు ఉంటుంది.


తనికెళ్ల భరణి: ఆవేశం.. ఆలోచల్ని మాత్రమే కాదు అవకాశాల్ని కూడా చంపేస్తుంది.

అధర్వ: ఓహో! మీరు కూడా నీతులు చెప్తున్నారా. బూతు సినిమాలు నడిపే ఆపరేటరు కూడా నీతులు చెప్పేవాడే.

తనికెళ్ల భరణి: ఈ థియేటర్‌ కూడా గణేష్‌దే. కూలగొట్టి కల్యాణ మండపం కడతా అన్నాడు. నేనే బతిమాలి అదేదో నేను పోయాక కట్టుకో, అంతదాక దాన్ని ముట్టుకోకు అని కాళ్లు గడ్డం పట్టుకున్నాను. బూతో, నీతో సినిమా ఆడాలి.ఎందుకంటే ఆ ప్రొజెక్టరు ఆడందే.. ఈ గుండె ఆడదు. నాకు సినిమా అంటే అంత పిచ్చి. మా నాన్న ఈ థియేటర్‌లోనే ఆపరేటర్‌గా పనిచేశాడు. అందుకే చిన్నప్పటి నుంచి ఆ పిచ్చి మొదలైంది. ఆ పిచ్చే నన్ను మద్రాసుదాక తరిమింది.ఆ పిచ్చే నన్ను ఆరు నెలల్లో అసిస్టెంటు డైరెక్టర్ని చేసింది, ఆ పిచ్చే ఆరేళ్లలో డైరెక్టర్ని చేసింది.నాకు సినిమా వచ్చింది. ప్రాణం పెట్టి రాసిన కథ. ప్రాణం పోసుకుంటున్న కల. పదిరోజుల్లో షూటింగ్‌ అనగా ప్రొడ్యూసర్‌ వచ్చి మా బావమరిదే విలన్‌ అన్నాడు. నేను.. రావుగోపాలరావు గారిని అన్నాను. ఎంత బతిమిలాడిన తను వినలేదు. నేను ఆయన మాట వినదలచుకోలేదు. ఆఫీసు నుంచి ఆవేశంగా బయటకు వచ్చేశాను. ఆ.. ఈ సినిమా కాకపోతే ఇంకోటి. ఈ ప్రొడ్యూసర్‌ కాకపోతే ఇంతమంది అనుకున్నాను.

అసలు నాకు ఛాన్సే దొరక్కపోతుందా? అనుకున్నాను. కానీ, ఇప్పటిదాక నాకు అవకాశమే రాలేదు నాన్న!! నేను చచ్చిపోయేలోగ ఒక్కసారైనా మెగాఫోన్‌ పట్టుకుని ‘‘యాక్షన్‌’’ అనాలనేది నా ఆశ. కానీ నేను పోయే లోపలే నా ఆశ చచ్చిపోయింది. ప్రతి అవకాశంలోనూ కష్టముంటుంది. మనం కష్టం దూరం చేయాలనుకుంటాం.కానీ మనకు తెలీకుండానే అవకాశం దూరమైపోతుంది. అయినా కష్టపడని డైరెక్టర్‌ ఎవర్రా?? నీ సినిమా జనం చూడాలి, నవ్వాలి, ఏడవాలి, చప్పట్లు కొట్టాలి, విజిల్‌ వేయాలి.. అంటే నీ గుండె తడవాలి.

- ‘గద్దలకొండ గణేష్‌’ని జనం చూశారు, ఇందులోని కామెడీకి కడుపుబ్బా నవ్వారు, ‘‘రోల్‌.. కెమెరా.. యాక్షన్‌’’ అని తనికెళ్ల భరణి చెప్పిన తీరుకి కంటతడి పెట్టారు, వరుణ్‌ తేజ్‌ నటనకు చప్పట్లు కొట్టారు, విజిల్స్‌ వేశారు. విడుదలకు ముందు రోజు టైటిల్‌ వివాదంలో చిక్కుకున్నా.. చిత్ర బృందం నమ్మకమే వియజం అందించింది.( బూతో.. నీతో అంటే బూతు సినిమాలు ఆడాలని కాదు సినిమా ఎప్పుడూ ఆడుతూనే ఉండాలనేది ఉద్దేశం) ఇలాంటి ఉద్వేగభరిత సినిమాలు, సంభాషణలు తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని రావాలని కోరుకుంటూ...

-సారథి, సినిమా అభిమాని.


(ఈ చిత్రం 2019 సెప్టెంబరు 20న విడుదలైన సందర్భంగా..)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.