ఇందుకే ‘పిల్ల జమీందార్‌’ అంతగా నచ్చింది
కొన్ని సినిమాలకు అంచనాలు పెట్టుకుని వెళ్తాం. మరికొన్ని చిత్రాలకు ఆసక్తితో వెళ్తుంటాం. ఇంకొన్ని సందర్భర్లాల్లో అవి రెండూ లేకుండా ఏదో చూడాలి అన్నట్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తుంటాం. ఇలా నేను చూసిన సినిమా నాని నటించిన ‘పిల్ల జమీందార్‌’. 8 సంవత్సరాల క్రితం ఇదే రోజు(అక్టోబరు 14న) ‘పిల్ల జమీందార్‌’ చిత్రానికి వెళ్లాను. ఈ సినిమా చూడకముందు.. చూసిన తర్వాత అనేంతగా నేను మారిపోయాను. దానికి కారణం నాని నటనే. కామెడీ, ఎమోషన్‌.. ఒక్కటేమిటి? అన్నింటిలో తనకు తానే సాటి అని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. ఈ చిత్రంతో నా అభిమాన నటుడయ్యాడు. నాని చిత్రాల్లో ఎన్నిసార్లు చూసిన బోర్‌కొట్టని సినిమా ఇది. ప్రవీణ్‌ జయరామరాజు అలియాస్‌ పీజేగా నాని ఆ పాత్రలో జీవించాడు. నవ్విస్తూనే.. అక్కడక్కడా కంటతడి పెట్టిస్తాడు. ఆస్తి కారణంగా పక్కనున్న వారిని తక్కువగా చూసే పీజే స్నేహితుల వల్ల మంచిగా మారిన సమయంలో వచ్చే సన్నివేశాలు నానిలోని నటనకు ప్రతిబింబాలు. ఈ చిత్రంలోని ఒక్కో సన్నివేశం ఒక్కో ఆణిముత్యం అనడంలో సందేహం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా క్లైమాక్స్‌లో నాని చెప్పే డైలాగ్‌ హృదయాన్ని హత్తుకుంటుంది. ఆస్తి కోసం తాపత్రయపడే పీజే ఓ స్నేహితుడు కోసం త్యాగం చేశాడని తెలియగానే ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుంది.  ఈ చిత్రం 8 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆ సన్నివేశం గుర్తు చేసుకుంటూ..


డబ్బుల్లేకుండా ఎలా బతుకుతావ్‌ పీజే? అని కథానాయిక హరిప్రియ అడగ్గా.. ‘ఎలా బతుకుతానని అడుగుతుంది సింధు! నేనిక్కడికి భయపడుతూ వచ్చా. డిగ్రీ కోసం కాదు. నా ఆస్తి దక్కుతుందో లేదో అనే డౌట్‌తో. అంతా అయిపోయిందిరా అనుకున్నా. కానీ ఇక్కడకొచ్చిన తర్వాతే జీవితాన్ని గెలుచుకున్న. డబ్బులేకుండా ఎలా బతుకుతానా అని మీరందరూ అనుకుంటున్నారు. ఈ రెండేళ్లలో ఆ ధైర్యాన్నిచ్చింది మీరే. ఇక్కడ నాకు పాఠాలు నేర్పింది మీరు మాత్రమే కాదు సర్‌. ఇంకో ఇద్దరున్నారు. జీవితం, కాలం. ఇక్కడ గడిచిన జీవితం మొత్తం నా కాలం విలువేంటో చూపిస్తే, ఇక్కడ గడిపిన రెండేళ్ల కాలం మాత్రం జీవితమంటే చూపించింది. వచ్చినప్పుడు ఇలాంటి వాళ్లతో రెండేళ్లు గడిపానంటే గొప్పే అనుకున్నా. కానీ నాలాంటి వాళ్లే రెండేళ్లు భరించారని తెలిశాక వాళ్ల స్నేహం గొప్పతనం అర్థమైంది. ఆనందం అనేది పబ్బుల్లో, క్లబ్బుల్లో, లగ్సరీల్లో లేదని తెలుసుకున్నాను. ఒక రూపాయి ఎలా ఖర్చుపెట్టాలో, మనిషిలో మనిషిని మాత్రమే ఎలా చూడాలో, ఎలా కలిసిపోవాలో, ఎలా నవ్వాలో, ఆఖరి ఎల ఏడవాలో కూడా ఇక్కడే నేర్చుకున్నా’ అని నాని నాన్‌స్టాప్‌గా చెప్పే ఈ డైలాగ్‌ కంటతడి పెట్టిస్తుంది. నేపథ్య సంగీతం సన్నివేశాన్ని మరో మెట్టు పైకి ఎక్కించింది. ఎం.ఎస్‌.నారాయణ, రావు రమేష్, అవసరాల శ్రీనివాస్, ధన్‌రాజ్, తదితరులు తమతమ పాత్రలో అద్భుతంగా నటించారు. ఫలానా సీన్‌ బావుంది, ఫలానా సాంగ్‌ బావుంది అని చెప్పలేకుండా, 360 డిగ్రీల్లో బావుందని చెప్పే చిత్రం ‘పిల్ల జమీందార్‌’. టైటిల్‌ కార్డు పడిన దగ్గర్నుంచి శుభం కార్డు పడే వరకు ఎక్కడా శృతి మించని మాటలు, సన్నివేశాలున్న ఇలాంటి అపురూప చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటూ..-కార్తికేయ, జంగారెడ్డిగూడెం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.