ఇస్మార్ట్‌ పూరి
పూరి జగన్నాథ్‌ పెన్‌.. తూటాల్లాంటి డైలాగ్స్‌ నింపుకున్న ఓ వెపన్‌. తక్కువ సమయంలో ఓ సినిమాకు కథ, మాటలు అందించగల ప్రతిభ ఆయన సొంతం. ఇంత వేగంగా ఒకప్పుడు పోసాని కృష్ణ మురళీ రాసేవారు. ఇప్పుడు పూరి తప్ప మరొకరు రాయలేరంటే అతిశయోక్తి కాదు. సమాజాన్ని వెండితెరకు అన్వయిస్తూ ఆయన రాసే విధానం చూస్తుంటే... దానికి కారణం ఆయన చదివిన పుస్తకాలు, పెరిగిన పరిస్థితులు, కలిసిన మనుషులు ప్రేరణణేమో అనిపిస్తుంది. ఆయన మాటలతో నిరాశను తొలగిస్తాడు. డైలాగ్స్‌ రాయడంలో అంతర్లీనంగా స్పీకర్‌లా తొంగి చూస్తాడు. దేన్ననయినా. ముక్కసూటిగా చెప్తాడు.


ఎండ మన మీద పడితే నీడ గుర్తుకొచ్చినట్టు... ఈయన డైలాగ్స్‌తో కొడితే మనలో జ్ఞానం పుట్టుకొస్తుంది. మొదటి నుంచి సినిమాల కోసం చాలా కష్టపడ్డాడు. కాలినడకనే తిరిగాడు. తను డైరెక్ట్‌ చేసిన సన్నివేశాలకు వేరెవరో పేరు వేసుకుంటే ఆయన బాధపడలేదు.పైగా దర్శకత్వం చేసే అవకాశం అయినా దొరికింది కదా అని సంతోషపడ్డాడు. మొదటి సినిమానే పవర్‌స్టార్‌తో తెరకెక్కించాడు. పవన్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించి తొలి సినిమాతోనే హిట్‌ అందుకున్నాడు. రవితేజకు స్టార్‌ స్టేటస్‌ ఇచ్చాడు. మహేష్‌ని పూర్తి స్థాయి మాస్‌ హీరోలా మార్చేశాడు. టాలీవుడ్‌ రికార్డలన్నిటినీ తిరగరాశాడు. ప్రభాస్‌ని డార్లింగ్‌గా మార్చినా, గోపిచంద్‌తో ‘గోలిమార్‌’ ఆడించినా, బన్నీని ‘దేశముదురు’లా, ఛార్మిని జ్యోతిలక్ష్మిగా చూపించినా అందులో పూరి మార్క్‌ కనపడుతుంది. అన్ని రోజులు మనవికావు...హిట్‌ సినిమాలతో పాటు ఫ్లాఫులు పలకరించాయి దాంతో పాటు నా అనుకున్న కొంతమంది ఆర్థికంగా మోసం చేశారు. అయినా కుంగిపోలేదు. పడిలేచే కెరటమయ్యాడు. ఆ కసంత బిజినెస్‌మేన్‌ సినిమాలో కనిపించింది. మరోమారు హిట్‌టాక్‌ వినిపించింది.


ఇదంతా ఒక కోణం. మరో కోణం ఏంటంటే?.తన పంథా మార్చకపోవడం. మూస కథలను వదలకపోవడం. మాటల్లో ఉన్న పవర్‌ కథలో లేకపోవడం. ఇటీవలే విడుదలైన ఇస్మార్ట్‌ శంకర్‌ బానే ఉన్నా.. ఏదో అసంతృప్తి. 80 కోట్ల మార్క్‌ దాటినా ఇంకా ఏదో ఉండాలన్న ఆశ. చాలకాలంగా ఆయన నుంచి మాస్‌ సినిమా రాకపోవడం, రామ్‌ నటన, డైలాగ్‌ డెలివరీలో కొత్తదనం , మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం, నభా నటేష్‌ గ్లామర్, పూరి పంచ్‌లు ఇవన్నీ కలగలపి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్‌ అయ్యింది. ఒకసారి హిట్‌ అయ్యింది కదా అని.మళ్ళీ ఇలానే తీస్తే ఇప్పుడొచ్చిన ఫలితం మరోసారి రాకపోవచ్చు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త దర్శకులదే హవా. ఒక్క అవకాశం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ సముద్రంలాంటిది. ఎంత కొత్త నీరొచ్చినా.. కలపుకుంటూనే ఉంటుంది. కాకపోతే పూరిలాంటి సీనియర్‌ దర్శకులు పాతనీరులా అలాగే ఉండాలంటే కథ, కథనం, మాటలు.. ప్రతీ దాంట్లో కొత్తదనం చూపించక తప్పదు. ఈ తరుణంలో ప్రతీ సినీ ప్రేమికుడి కోరిక ఒక్కటే.. మళ్లీ పూరీ మార్క్‌ బ్లాక్‌బస్టర్స్‌ చూడాలని, పూరి పూర్వ వైభావాన్ని సొంతచేసుకోవాలని.

 - వీరు, హైదరాబాద్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.