‘రాగలీల’.. రూటు మార్చిన జంధ్యాల
జంధ్యాల.. ఈ పేరు వినగానే వెంటనే కదలాడేవి కుటుంబ కథా చిత్రాలు, నవ్వులు పూయించే సన్నివేశాలు. ఓ సందర్భంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాల జాబితా చూస్తుండగా ‘రాగలీల’ కంటపడింది. జంధ్యాల రూటు మార్చి కొత్తగా ప్రయత్నించారా? అయినా ఆయన ఇలాంటి సినిమాలు తీస్తారా? అనే సందేహం కలిగింది. చూసిన తర్వాత ఇంగ్లిష్‌ సామెత (డోన్ట్‌ జడ్జ్‌ ఏ బుక్‌ బై ఇట్స్‌ కవర్‌ ) గుర్తొచ్చింది. ఎందుకంటే రొమాంటిక్‌ చిత్రం అయినప్పటికీ ఎక్కడా అభ్యంతర దృశ్యాలు కనిపించవు. తన మార్క్‌ సంభాషణలతో అలరిస్తూనే పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టించారు. 1987లో వచ్చినప్పటికీ ఈతరం ప్రేక్షకుల్ని హత్తుకునే వైవిధ్యమైన ఈ చిత్ర విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను...

ఇదీ కథ:

ఎం.ఎ. చదివిన కథానాయకుడు కృష్ణ (రఘు) రాజయ్య (రాళ్లపల్లి) దగ్గర ఉద్యోగంలో చేరతాడు. అందంగా ఉండటం, తక్కువగా మాట్లాడే స్వభావం కావడంతో అక్కడే పనిచేస్తున్న ఉష (తులసి) అతణ్ని ప్రేమిస్తుంది. తనపై ఇష్టం ఉంటే కృష్ణని ఓ దేవాలయానికి రావాలని చెప్తుంది ఉష. చెప్పినట్టుగానే కృష్ణ.. ఉషని కలుస్తాడు. అక్కడ నుంచి ఉష ఇంటికొస్తారు ఇద్దరు. ఉష తమ కుటుంబ ఫొటోల ఆల్బమ్‌ చూడమని కృష్ణకి ఇచ్చి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. ఆల్బమ్‌లో సావిత్రి(సుమలత) ఫొటో చూసి తక్షణమే భావోద్వేగంతో ఇంటి బయటకు వస్తాడు. ట్విస్ట్‌ ఏంటంటే ఉష సోదరే సావిత్రి. మా అక్క మీకు తెలుసా? మీరెందుకు ఇలా మారారు? అంటూ ఉష నిలదీయడంతో తన ప్రేమ గతాన్ని చెప్పుకొస్తాడు కృష్ణ.

కృష్ణకి అమ్మాయిలంటే వ్యామోహం. ఎవర్ని చూసినా శారీరకంగా సొంతం చేసుకోవాలనుకుంటాడు. 25మందితోపైగా పరిచయాలున్న కృష్ణకి ఓ రోజు సావిత్రి కంటపడుతుంది. సావిత్రి అందంగా ఉండటంతో తనెవరో తెలియకపోయినా ఆమె దగ్గరకు వెళ్లి మీ స్నేహితురాలు మా సోదరి, మీకు ఉద్యోగం ఇప్పిస్తా ఇంటికి రండి అని విజిటింగ్‌ కార్డు ఇస్తాడు. మరుసటి రోజు కృష్ణ ఇంటికి వస్తుంది సావిత్రి. ఆమెను తీసుకుని ఓ పాఠశాలకు తీసుకెళ్లగా అక్కడ ఉద్యోగం దొరకదు. చేసేదేంలేక తన స్నేహితుడి దుకాణంలో తనే జీతం ఇస్తా అని ఒప్పందం కుదుర్చుకుంటాడు. దాంతో మంచి వ్యక్తి అని అభిప్రాయపడిన సావిత్రి మనసిస్తుంది. కృష్ణ మాత్రం ఆమె ప్రేమ దృష్టిలో చూడడు. ప్రయత్నాలు చేసి చేసి ఓ రోజు సావిత్రిని లొంగదీసుకుంటాడు. ఫలితంగా గర్భవతి అవుతుంది. ఆ తర్వాత కృష్ణ నిజస్వరూపం తెలుకుంటుంది. ఆ బాధ భరించలేక ఆత్యహత్య చేసుకుంటుంది. మరోవైపు కృష్ణ సోదరి సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. ఈ సంఘటనతో కృష్ణలో మార్పొస్తుంది. అలా కొన్నాళ్లకు ఉద్యోగంలో చేరతాడు. కృష్ణ గతం తెలుసుకున్న ఉష ..రాజయ్య కుమారుడు రాజాని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతుంది. ఓ రోజు మద్యం సేవించి నిజాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తాడు కృష్ణ. కథ సుఖాంతం అవుతుంది. మళ్లీ ఉష, కృష్ణ ఒకటవుతారు.

ఆకట్టుకునే అంశాలు:

* టైటిల్స్‌ చూపించే విషయంలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు జంధ్యాల. టైటిల్స్‌ వస్తుండగా కథని పరిచయం చేస్తారు. అదెలాగంటే.. ముందుగా ఈ చిత్రానికి ‘రాసలీల’ పెట్టాం కానీ సెన్సార్‌ బోర్డు అభ్యంతరం మేరకు ‘రాగలీల’గా మార్చాం అని తెలియజేస్తారు. రాసలీల అనగానే శృంగారభరిత చిత్రం అనే ఊహించుకుంటాడు ప్రేక్షకుడు. అంతేకాదు మన్మథుడు పూల బాణం వేయగానే ఈడొచ్చిన వ్యక్తి నుంచి పాడెక్కిన వ్యక్తి వరకు అమ్మాయిని హత్తుకుంటారు. కథానాయకుడు అమ్మాయిని చూసినప్పుడల్లా మన్మథుడు దర్శనమిస్తుంటాడు.

* రాజన్‌-నాగేంద్ర అందించిన పాటలు, నేపథ్య సంగీతం అత్యద్భుతంగా నిలిచాయి.

* పొట్టి ప్రసాద్‌, రాళ్లపల్లితో చేయించిన ‘పాపేసం’ ట్రాక్‌, ఆసుపత్రికా అనే పాటలో శుభలేఖ సుధాకర్‌- వేలు కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.

* కృష్ణ అన్నగా నటించిన సాక్షి రంగారావు తన కూతురు చనిపోయినపుడు వచ్చే సన్నివేశం, కృష్ణని పెళ్లి చేసుకోమని తులసికి వేలు చెప్పే మాటలు మనసుని హత్తుకుంటాయి.

సాంకేతిక వర్గం:

కథ: యర్రంశెట్టి శాయి

పాటలు: వేటూరి

సంగీతం: రాజన్‌-నాగేంద్ర

ఛాయాగ్రహణం:ఎం.వి.రఘు

కూర్పు: గౌతంరాజు

అసోసియేట్‌ డైరెక్టర్లు: ఈవీవీ సత్యనారాయణ, రామకృష్ణ

నిర్మాత: జయకృష్ణ, జంధ్యాల

రచన-దర్శకత్వం: జంధ్యాల

- అరవింద్‌, నిడదవోలు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.