పాఠశాలల్లో నేర్పాల్సిన పాట ఇది !!

నాకు నచ్చిన పాటల్లో ఆ పాత మధురాలు చాలా ఉన్నాయి. అందులో ఎన్టీఆర్‌ నటించిన ‘శభాష్‌ రాముడు’ (1959)లోని ‘‘జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా..’’ అంటూ సాగే పాట అంటే చాలా ఇష్టం. ఈ పాటను మహాకవి శ్రీశ్రీ రచించారు. ఈ పాటలోని సాహిత్యం, చిన్న, పెద్దలందరికీ ఇష్టమే. ముఖ్యంగా విద్యార్థులకు చక్కని నీతిని ప్రబోధిస్తుంది. ప్రతి పాఠశాలలో తమ విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పించాల్సిన పాట ఇది. తెలుగు సినీరంగంలో అత్యుత్తమ గాయకుడైన ఘంటసాల సంగీత దర్శకుడిగానూ, అద్భుతంగా రాణించి, ఎన్నో సినిమా పాటలకు శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు. ఆ ఘంటసాల మస్టారి సంగీతం మరియు గానామృతం ఈ పాటకు ప్రాణం. చమటోడ్చి, శ్రమకోర్చి, పోటీలో గెలవాలని రిక్షా తొక్కుతున్న ఎన్టీఆర్‌ హావభావాలు, అతనికి ప్రేరణనిస్తున్న జె.వి.రమణమూర్తి నటన, దేవిక నటన ఈ పాటకు బలం. జంకుబొంకు లేకుండా ముందుకు సాగితే జయము నిశ్చయమని ప్రేరణనిచ్చారు. ఏనాటికైనా స్వార్థం నశిస్తుందని, సత్యమే జయిస్తుందని జనాలకు కనువిప్పు కలిగించారు.విద్యార్థులందరూ విజ్ఞానం సాధించాలని, విశాల దృష్టిని అలవరించుకోవాలని, పెద్దలను గౌరవించి, పూజించాలని వారికి సందేశాన్నిస్తుంది ఈ పాట. కష్టాలకు ఓర్చుకుంటేనే సుఖాలు దక్కుతాయని, అందుకే ఈ లోకం ఎవరూ సోమరులుగా ఉండరాదని, పవిత్రమైన ఆశయాలను మరువకూడదని హితబోధ చేస్తుంది. గృహాన్ని స్వర్గసీమగా చేయమని, కుటుంబాన్ని ఒక్కతాటిపై నిలబడమని, వారికి బీదసాదలను ఆదరించే బుద్ధిని ఇవ్వమని దేవుని కోరడం గొప్పతనం. కథానాయకుడిని పోటీలో గెలిపించడానికి రమణమూర్తి ఇచ్చిన ప్రేరణ అందరికీ ప్రేరణే. గాఢాంధకారము అలముకుంటే భయపడవద్దని, సందేహపడకుండా వెలుగు చూపి ముందుకు సాగమనీ, జీవితాన్ని నిరాశతో కుంగదీయవద్దని, అలాగే పరాభవం కలుగుతుందని ముందే అనుకొని పారిపోవద్దని, జయము వరించేదాకా పోరాడి గెలిచి, స్వతంత్రయోధుడన్న పేరు నిలబెట్టుకోమని ప్రేరణ. ప్రతి ఒక్కరికి ప్రేరణే. అందరికి నైతిక విలువలను ప్రభోదించే ఈ పాటను ప్రతి ఒక్కరు నేర్చుకొని, తమ తరువాత తరానికి నేర్పాలి.- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.