నాకు నచ్చిన శ్రీదేవి!
ద శ్రీదేవి వీ వోన్టెడ్‌ -

పైన రాసిన శీర్షికకు మేం అలవాటు పడ్డ శ్రీదేవి అని, ఇంకా మాకు పరిచితమైన శ్రీదేవి అని అర్థం వస్తుంది. ఆగస్టు 13, 1963. ఈ తేదీ ప్రత్యేకతను గురించి చాలా మందికి తెలుసు.


ఈ రోజే శ్రీదేవి పుట్టిన రోజు. ఆమె 2018వ సంవత్సరం ఫిబ్రవరి 24నాడు దుబయిలో చనిపోయారన్న సంగతి కూడా అదరికీ తెలిసిందే. అయితే.. ఆ వార్త నిజం కాకూడదు అని మది లోపల తలపోసిన వారు ఎంతో మంది ఉన్నారు! తాను చనిపోవడమేంటండీ? తాను చనిపోయిందెక్కడండీ!

ఆమె, తాను నటించిన సినిమాల ద్వారా జీవించే వున్నారు కదా? కల కాలం జీవిస్తూనే వుంటారు కదూ. 

ఆమెను అభిమానించే వాళ్ల గుండె గుడిలో తాను ఎప్పటికీ ‘దేవత’యే. కాదా? అవునన్నా కాదన్నా ‘అవును’యే ఫిక్స్‌. ఊ; లాక్‌ చేసేయాలి. అహ్హహ్హ.. (శ్రీదేవి తన ముక్కుతో ఆడే పేటెంట్‌ మేనరిజమ్‌తో కూడిన పలుకు) ఇదే రైట్‌ ఆన్సర్‌!

***

అన్నం ఉడికిందో ఉడకలేదో ఒక్క మెతుకును పట్టి ఇట్టే చెప్పేయవచ్చు అంటారుగా. అలాగే ‘శ్రీ’కి (ఫ్యాన్స్‌ ఆమెను ఇలాగే పిలుస్తారు) చెందిన ఓ మచ్చును చూస్తే చాలు- తన ప్రతిభను - ఒప్పేసుకోవచ్చును. అలాంటివే ఇదుగోఈ దిగువన వివరించిన మూడు సన్నివేశాలూను. ఆ సన్నివేశాలలో ఆమె వేసిన వేషాల తాలూకు తమాషా మసాలాలు నషాళానికి ఎక్కేటటువంటివి మరి...

* సీన్‌ 1: ‘సర్దార్‌ పాపారాయుడు’ (1980వ సంవత్సరం విడుదల అయింది) ఈ సినిమాలో ఓ సన్నివేశం -


(పెళ్లి కాకుండానే తన కాబోయే భర్త రాము ఇంటికి చేరుకొంటుంది విజయ. ఈ విషయమై వాళ్ల నాన్న ధర్మరాజు తన కూతురు కనపడ్డం లేదంటూ పోలీస్‌ కంప్లెయింట్‌ ఇస్తాడు. అయితే ఇన్స్‌పెక్టర్‌ రాము పర్సనల్‌గా ఆ కంప్లెయింట్‌ని డీల్‌ చేయాలి అని అందులో రాసి వుంటుంది.) పోలీసాఫీసర్‌ రాము ఆ కంప్లెయింట్‌ చూసుకొని ఇంటికి వెళ్తాడు. అమ్మా అని పిలుస్తూ, లాఠీతో తలుపును తట్టుతాడు. తన ఇంట్లో విజయ ఉన్నది చూస్తాడు. అప్పుడు వాళ్లు ఇద్దరి మధ్య సంభాషణ ఇలాగ జరుగుతుంది..

రాము: ఇక్కడున్నావేంటి?


విజయ: మరెక్కడికి వెళ్లమంటావు?


రాము: నువ్వుండే చోటికి.


విజయ: ఇదే నా చోటు.


రాము: సరి సరి. దొంగ వస్తువులు కొని ఇంట్లో పెట్టుకోవడం ఎంత నేరమో, పారిపోయి వచ్చిన ఆడపిల్లను ఇంట్లో ఉంచుకోవడం కూడా అంతే నేరం. పద.


విజయ: ఎక్కడికి?


రాము: మీ ఇంటికి. మీ నాన్న కంప్లెయింట్‌ ఇచ్చాడు. పట్టి తీసుకొచ్చిన వాళ్లకి పది వేలు బహుమానం కూడా ఇస్తా అన్నాడు.


విజయ: పది వేల కోసం నన్ను తీసుకెళ్లిపోతావా?


రాము: ఏం? పది వేలంటే మాటలా? పది నెలలు ఉద్యోగం లేకుండా హాయిగా రెస్ట్‌ తీసుకోవచ్చు.


విజయ: పోనీ, ఒక లక్ష ఇస్తాను, వదిలేయ్‌.


రాము: గుడ్, వెరీ గుడ్‌. పద పోలీస్‌స్టేషన్‌కి.


విజయ: పోలీస్‌ స్టేషన్‌కా, ఎందుకు?


రాము: ఎందుకా? ఒక పోలీసాఫీసర్‌కి లక్ష రూపాయలు లంచం ఇస్తానని ఆశ పెట్టినందుకు.


విజయ: అహహ.. చూడండత్తయ్యా..


రాము: ఊ... ఒక రోజు ఇంట్లో ఉంటేనే వరస కలిపావ్‌. ఇంకో రోజు ఉంటే... (సరిగ్గా ఇక్కడే శ్రీదేవి లెండి గారంగా నవ్వుతుంది.


విలాసం కేర్‌ ఆఫ్‌ అమ్మాయి గారు - హేట్స్‌ ఆఫ్‌ శ్రీదేవికి.) ఇంకేం కలుపుతావో. నువ్వు ఉత్త డేంజర్‌ మనిషిలాగా కనిపిస్తున్నావ్‌. పద.


విజయ: నన్ను నువ్వు తీసుకెళ్లి దిగబెడతావా?


రాము: ఏం... నువ్వు వెళ్లలేవా?


విజయ: నువ్వు తీసుకెళ్తేనే వస్తాను.


రాము: ఊ.. సరే, పద.


విజయ: ఈ డ్రెస్‌ తోనా!

రాము: ఈ డ్రెస్‌తో వెళ్తే కంప్లెయింట్‌ నిజమనుకుంటారు. డ్రెస్‌ చేంజ్‌ చేసుకొని రా. (ఈ సన్నివేశంలో ఆది నుండి అంతం వరకు శ్రీదేవి సంభాషణలు పలికేస్వర చోద్యానికి జోహారు చేయకుండా ఉండగలమా?ఉహూ, ఉండలేం. ఉండబట్టలేం కూడాను)

***


* సీన్‌ 2: ‘బొబ్బిలిపులి’ (1982వ సంవత్సరం విడుదల అయింది) ఈ సినిమాలో ఓ సన్నివేశం -విజయ వాళ్ల ఇంట్లో ఆమెతో వాళ్ల నాన్న మాట్లాడుతూ.. ‘‘ఏమ్మా. ఏమంటున్నాడు మేజర్‌’’
విజయ: మిగతా విషయాల్లో ఏమో గాని ఆ విషయంలో మాత్రం ఆయన మేజరే.
విజయ వాళ్ల నాన్న: మేజర్, మేజర్‌ అంటూ కూర్చుంటే ఎట్లాగమ్మా. పెళ్లి ప్రయత్నాలు చేయొద్దా. సరే, నేను నా వైపు నుంచి వెళ్లనా; లేక, నువ్వు నీ వైపు నుంచి వెళ్తావా.
విజయ: అమ్మా ఆఆఆ... నా వైపు నుండే వెళ్తాను. (ఇక్కడ ‘అమ్మా ఆఆఆ’ అంటూ శ్రీదేవి పలికించిన భావాలు.. ఓహ్‌! బొబ్బిలిపులి డీవీడీని మళ్లీ ఒకసారి ప్లే చేసి మరీ తన విలాసాన్ని కళ్లార్పకుండా చూసి, తరించవలసిందే)

***

* సీన్‌ 3: ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ (1986లో విడుదల అయింది)

కోయవాడొకడు జోస్యం చెప్తానంటూ రాధ బంగళాకు వచ్చి అక్కడ రాధ బామ్మను, రాధను కలుసుకుంటాడు. కోయవాడు చేయిని చూపించమంటూ ఒకరి అరచేతిని పట్టుకుని, ‘‘ఈవిడకు పెళ్లి అయిపోయింది’’ అని కంగారుగా ఆ చేయిని వదలి పెట్టేస్తాడు. ‘‘ఇది నా చెయ్యయ్యా’’ అంటూ బామ్మ అతడి చేతిలో నుండి తన చేతిని లాగేసుకుంటుంది. (కిసుక్కు) కొద్దిసేపయ్యాక కోయవాడికి రాధ ముద్దు పెడుతుంది. వెంటనే అతడి తల్లో బల్బు వెలుగుతుంది. (చమక్కు) ఇలాంటి కిసుక్కుల, చమక్కుల కిక్కుల మధ్య కోయవాడు జోస్యం చెప్పడమూ, అతడు వెళ్లిపోవడమూ జరుగుతాయి. అంతా అయ్యాక ‘‘ఇదేం చోద్యమే. ఆ కోయవాడికి నువ్వు ముద్దు పెట్టావు’’ అంటుంది బామ్మ. ‘‘కోయ దొరా కాదు, కోతి దొరా కాదు బామ్మా.. ఆయనే మా ఇంటాయన’’ అని చిరునవ్వు చిందిస్తూ రాధ ఇంటి లోపలికి చేరుకొంటుంది. (ఈ మాటలు అంటూ రాధ చేసే దరహాసాన్ని చూసిన చూపరులు ఆమె కులుకుకు మరులుగొని మూర్ఛలు పోక మానరు. అవును. శ్రీకి ఇంత సీను ఉంది)

***

* పోస్ట్‌ స్క్రిప్ట్‌ 1: ‘ఆఖ్‌ రీ రాస్తా’ (1986)- దీనిలో ‘‘గోరీ కా సాజన్‌సాజన్‌ కీ గోరీఫిర్‌ సే శురూ హో గయి లవ్‌ స్టోరీవో జా రహీ హైహీరో కి


హీరోయిన్‌ హీరో కా దిల్‌కర్‌ కే చోరీ..’’ పల్లవితో ఓ యుగళ గీతం ఉంది. ఈ యుగళగీతంలో శ్రీదేవి చాలా చక్కగా నర్తించి, మురిసిపోతూ తన మేనిలోని నయమును, నయగారములను మరియు అభినయమును నయాగరా జలపాతం వలె ఉరకలెత్తించి మురిపించి, మైమరపించారు.


* పోస్ట్‌ స్క్రిప్ట్‌ 2: ఇదే విధంగా శ్రీ నటించిన సినిమాలలో - తెలుగులో గజదొంగ (1980), వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982), పచ్చని కాపురం (1984), హిందీ సినిమాలో ‘హిమ్మత్‌ వాలా’ (1983), జానీదోస్త్‌ (1983), ధరమ్‌ అధికారి (1986)లు నాకు అత్యంత ప్రియమైన సినిమాలు.


ఇలాంటి అనుభూతులు శ్రీదేవి అభిమానులకు ఎన్నో, ఎన్నెన్నో ఉంటాయి. ఎందుకంటే... ఆమె నటించిన ప్రతి సినిమా అద్భుత అభినయ రసాత్మక విన్యాసమే కదా!


- దిలీప్, మియాపూర్, హైదరాబాద్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.