ఆ పాటలు వింటే మేను పులకిస్తుంది!
అలనాటి తెలుగు సినిమాలు ఆణిముత్యాలు. నటీనటులు తమ అభినయంతో, గాయనీగాయకులు తమ శ్రావ్యమైన కంఠంతో, భావగర్భితమైన పాటలతో వెన్నెల జల్లు కురిపించారు. సినిమాలను రక్తి కట్టించారు. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అలనాటి పాటలు, ఈ నాటికి, ఏనాటికి, చెరగని ముద్రలాగా, ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. నేను నా 85 ఏళ్ల వయస్సులో కూడా, ఆ పాటలను గుర్తు చేసుకుంటూ, ఆ పాటలలోని మధురామృతాన్ని ఆస్వాదిస్తూ, ఆనందానుభూతిని పొందుతుంటాను.
కొన్ని పాత సినిమాలలోని, అంటే 1943 నుంచి 1953 వరకు విడుదలైన ఆణిముత్యాలాంటి ఆరు సినిమాలలోని, ఆరు పాటలను గుర్తు చేసుకుంటూ నా అనుభూతులను పంచుకుంటున్నాను.

* 1943లో విడుదలైన వాహిని పిక్చర్స్‌ వారి సాంఘిక చిత్రం ‘సుమంగళి’ సినిమలో, ‘కర్నాటక సంగీతాన సుధానిది’ చిత్తూరు వి.నాగయ్య పాడిన అత్యద్భుతమైన ఒక పాట, నేటికీ చిరస్మరణీయంగానే ఉండిపోతుంది.
‘‘ఆడబ్రతుకే మధురం...
వయసూ వలపూ సొగలసులొలికే ఆడ బ్రతుకే మధురం...
పసుపు, కుంకుమ, సతతమంగొలచే ఆడ బ్రతుకే మధురం...
పతికౌగిటిలో పరవశమయ్యే ఆడబ్రతుకే మధురం’’.
ఈ పాటంటే నాకు ఎంతో ఇష్టం. ఇందులోని సాహిత్యం, అందుకు తగినట్టుగా అమరిన సంగీతం చక్కగా ఉంటాయి.

*
1944లో విడుదలైన వాహిని పిక్చర్స్‌వారి పౌరాణిక చిత్రం ‘‘భక్తపోతన’’ చిత్రాన్ని మరువలేము. అందులో చిత్తూరు వి.నాగయ్య ఆలపించిన భక్తిరస ప్రధానమైన మధురాతి మధురమైన పాటలో ఒకటి నాకెప్పటికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది.


‘‘పావనగుణరామా హరే
పరమ దయానిలయా,హరే
పావనగుణరామా హరే
మాయామానస రూపా
మాయాదీత మంగళదాత
వేదంతా వధూ హృదయ విహారా
వేదమయా పరమానంద రూపా
పావన గుణరామా హరే రామాహరే’’
ఈ పాటను వింటుంటే మదిలో భక్తిభావం ముప్పిరి గొంటుంది.


*
1945లో విడుదలైన శోభనాచల స్టూడియోవారి ‘‘గొల్లభామ’’ జానపద చిత్రంలో కృష్ణవేణి, ‘‘ఈలపాట’’ రఘురామయ్య నటించారు. గొల్లభామ వేషంలో, కృష్ణవేణి చల్ల అమ్ముకుంటూ ముందుకు నడుస్తుంటే, వెనక నుంచి రాజు వేషంలో ఈలపాట రఘురామయ్య గుర్రము మీద స్వారీ చేస్తూ వస్తాడు. గుర్రము గిట్టల చప్పుడుకి గొల్లభామ భయపడి క్రింద పడగా తట్టలోని ముంతలోఉన్న చల్ల వొలికిపోయి, నేలపాలవుతుంది. అప్పుడు గొల్లభామగా కృష్ణవేణి పాడిన పద్యం:

‘‘భూపతి జంపితిన్, మగడు
భూరి భుజంగముచేత జచ్చె
నేనాపద చెందిచెంది, ఉదయార్కుని
పట్టణమేగి వేశ్యనై, పాపముగట్టుగొంటి
అట పట్టి విటుండై రాగ జూచి,
సంతాపము జెంది, అగ్గిపడి, దగ్ధముగాకిటు
గొల్లభామనై, ఈ పని కొప్పుకొంటి
నృపతీ, వగపేటికి చల్లచిందినన్‌’’
రఘురామయ్య, ఈలతో పాటలు పాడడటం వల్ల, ఆయనకు ‘ఈలపాట రఘురాయ్య’ అను పేరు వచ్చింది. మన దేశ మొదటి ప్రధానమంత్రి పండిట్‌
జవహార్‌లాల్‌ నెహ్రూ ఈ సంగతి తెలుసుకొని, రఘురామయ్యను ఢిల్లీకి పిలుపించుకొని, ఆయన చేత ఈలపాటలు పాడించుకున్నారు.

*
1948లో విడుదలైన వాహిని పిక్చర్స్‌వారి ‘‘యోగివేమన’’ చిత్రంలో, భోగలాలసుడుగా చిత్తూరు వి.నాగయ్య పాడుతున్నప్పుడు, ‘‘దేవదాసి’’గా యం.వి.రాజమ్మ నాట్యం చేస్తుంటే, ఆ సన్నివేశం ప్రజల హృదయాలను దోచుకుంది. అదే ఈ పాట:
‘‘వదలజాలరా, వదలజాలరా
నిన్ను వదల జాలరా
మనసారా మరులు దీర, ఈ సారి నిలిచిపోరా
వదలజాలరా, నిన్ను వదల జాలరా
చిరునగవొలికే నీ మోము
మరల మరల కననీరా
కళలనెరగు దొరవౌరా
నిను కలియ కలియ మనసారా వదల జాలరా’’.
ఇందులో నాగయ్య అభినయం, పారవశ్యం బాగుంటాయి. దేవదాసిగా రాజమ్మ నటన కూడా అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

*
1950లో సాధనా పిక్చర్స్‌ వారి ‘సంసారం’ చిత్రంలో యన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీరాజ్యం (‘నర్తనశాల’ చిత్ర నిర్మాత) నటించారు. తొలిసారిగా చలనచిత్ర రంగంలో తెలుగు తెరకు పరిచయమైన ‘మహానటి’ సావిత్రి, ఈ చిత్రలో ఒక ‘కాలేజీ గర్ల్‌’గా నటించింది. సంసార సాగరంలో భార్యాభర్తలు తమ చిన్నారులతో, బంధువులతో, ఆత్మీయులతో... ప్రేమ, అభిమానం, అనురాగం, ఆదరణ, ఆప్యాయతలను ఆస్వాదిస్తూ సాఫీగా సాగిపోవాలని చెప్పే ఈ పాట, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వర రావు గళం నుంచి జాలు వారి అమృతతుల్యమైంది. ఈ పాటను ఎప్పుడు విన్నా మనసులో ఆనందం కలుగుతుంది. ఆ పాట:


‘‘సంసారం, సంసారం, ప్రేమ సుధా పూరం
నవజీవన సారం... ।।సంసారం।।
తనవారెవరైనా దరిజేర ప్రేమమీర,
ఆదరించునాడే అనురాగపు సంసారం ।।సంసారం।।
ఇల్లాలొనర్చుసేవ, యాజమాని ఇల్లు బ్రోవ
కళకళలాడే పసివారితో సంసారం ।।సంసారం।।

*
1953లో విడుదలైన ‘బ్రతకుదెరువు’ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గళం నుంచి జాలువారిన మరో మంచి పాట ఉంది. సంగీత, సాహిత్య సౌరభాలతో ఆనంద డోలికలలో తేలించే ఈ మధురాతి మధురమైన పాటను, ఆ రోజుల్లో ఆబాలగోపాలము పాడుకున్నారు. అదే ఈ పాట:
‘‘అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం ।।అందమె।।
పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలిమోహన రాగం
జీవితమే, మధురానురాగం ।।అందమె।।
పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడసిన సారంగం
సుడిగాలిలో ఎగిరే పతంగం,
జీవితమే, ఒక నాటకరంగం ।।అందమె।।
                                                                   

ఆ రోజుల్లో ఈ పాట విన్నప్పుడల్లా నా ఒళ్లు పులకరించేది. ఈ అపురూపమైన పాటను సాధన చేసి, రాగయుక్తంగా పాడుకుంటూ నేనెంతో ఆనందానుభూతిని పొందేవాడిని. ఈ పాటను ఈ నాటికీ మరువలేక పోతున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమ బ్రతికున్నంత వరకు ఘంటసాల వెంకటేశ్వరరావు పాటలు, తెలుగువారి హృదయాల్లో జీవించి ఉంటాయి. ఆయన చిరస్మణీయుడు. కారణజన్ముడు.

- కె.వి.జి.కృష్ణమూర్తి (వేణు),
ఫోన్‌: 4024544139


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.