మాట విలువ పెంచిన రచయిత

త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న జ్ఞానం సరిపోదు. ఎందుకంటే నాకు ఆయన ‘స్వయంవరం’లో రాసిన ‘కన్న కూతుర్ని ఈ ఇంటికి కోడల్ని చేద్దామని వచ్చిన వాళ్లకి కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి కానీ కన్నీళ్లతో బయటి పంపించకూడదు’ ఈ మాట విన్న వెంటనే సినిమా సంభాషణల్లో ఇంత అర్థం ఉంటుందా? ప్రాస అంటే ఏంటి? పంచ్‌ అంటే ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాను. అంటే మాటను అర్థమయ్యేలా రాయనక్కర్లేదు. అర్థం చేసుకోవాలి అనే కోరికను పుట్టించే విధంగా కూడా రాయొచ్చు అని మాట స్థాయిని పెంచిన వ్యక్తి. ప్రేక్షకులు ఇవే చూస్తున్నారు. వాళ్లకు ఇవే అర్థమవుతాయి. కాబట్టి ఇవే రాయాలి కాకుండా వాళ్లకు అర్థం చేసుకోవాలనే తపన ఉంటుంది. ఏదో చింతలపూడిలాంటి ఓ ఊళ్లో ఇంజినీరింగ్‌ చదువుతున్న రోజుల్లో ఆయన సినిమాలన్నీ డౌన్‌లోడ్‌ చేసుకుని దాంట్లోంచి ఓ మంచి మాటను వెతుక్కుని ఇరవై ఏళ్ల కుర్రాడు ఆ రోజు ఆ ఆనందంతో పడుకుంటాడు. అలాంటి మాట ఇంకొకటి రాయాలని, అలాంటి సన్నివేశం ఒకటి తీయాలని, అలాంటి సినిమా ఒకటి చేయాలని ఒక తపనని రేకిత్తించగలిగిన స్థాయి రచయిత. ఎందుకంటే కామెడీ, సెంటిమెంట్, సూర్ఫి.. ఇలా అన్ని రకాలుగా రాయడానికి చాలా శక్తి కావాలి. అలాంటి మాటలు పుస్తకంలో రాయడానికే కష్టం అంటే అలాంటి మాటల్ని అలవోకగా సినిమా సంభాషణల్లోకి తీసుకొచ్చి ప్రేక్షకుడి స్థాయిని పెంచిన దర్శకుడు. మనం.. ఆయన మాటలు హీరోలు చెప్తుంటే విజిల్‌ వేస్తాం, చప్పట్లు కొడతాం. ‘మనం బావున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు’ అనే మాట రాయడానికి తివిక్రమ్‌ ఎంత ధైర్యం ఉండాలి? అది కథలో భాగమై ఉండేందుకు ఎంత కష్టపడాలి, హీరోతో చెప్పించడానికి, ప్రేక్షకుల్ని నిజమే అని ఒప్పించడానికి ఎంత గట్స్‌ కావాలో ఓ సినీ అభిమానికి నాకు తెలుసు. అందుకే నేను ఆయన్ను అంత ఇష్టపడతా. అలాగే పవన్‌ కల్యాణ్‌ లాంటి హీరో ‘జల్సా’ సినిమాలో ఆయన ఏం చెప్పినా వింటాం. అయినా కూడా ‘యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపటం కాదు ఓడించడం’ గెలవడం అంటే ఓడించడమే చంపటం కాదు. అక్కడ స్పేస్‌ లేదు క్రియేట్‌ చేసుకుని తీసుకున్నాడు. ఆయన వాడుకున్నాడు.


కమర్షియల్‌ సినిమా అంటే దిగజారుడు సంభాషణలు, లేదంటే అర్థం పర్థం లేని ప్రాసలు అని కాకుండా వాటి మధ్యలో ఇరుకు సందుల్లో కూడా అంటే చార్మినార్‌ పక్కనున్న సందుల్లో బెంజ్‌ కారు నడపమంటే ఎట్లా నడపగలం? ఆటో నడవడమే కష్టం. అలాంటి కోటి రూపాయల కారు నడపగలమా? ఆయన మాటలు కూడా అలాంటివే అంత ఇరుకు ప్రదేశంలోనూ హీరో తాలుకూ ఇమేజ్, దర్శకుల తాలుకూ అర్థంలేని తనం, నిర్మాతల తాలుకూ వ్యాపార విలువలు, ప్రేక్షకుల తాలుకూ అర్థం చేసుకోలేని తనం.. వీటన్నింటి మధ్యలో కూడా ఒక గొప్ప మాట ఇవ్వడానికి రాత్రిళ్లు ఆయన టేబుల్‌ మీద ఖర్చు పెట్టిన క్షణాలు, ఆయన రాసుకున్న సంభాషణలు, ఆయన కల్పించిన పాత్రలు.. పుస్తకాలతో ఇదంతా సాధ్యమంటాడు. ఆయన నాకు తెలిసి ప్రపంచానికి తెలిసిందే రాస్తాడు. ప్రపంచం తెలుసుకోవాలని రాస్తాడు. అందుకే మాటల మాంత్రికుడు ఆయన. ఆయన అక్షరాలు అనే కిరణాలు తీసుకుని డైలాగ్స్‌ అనే తూటాలు తీసుకుని తెలుగు సినిమా తెరపైకి వేటాడటానికి బయలుదేరతాడు. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలు మనపై సంధిస్తాడు. మన ఇంట్లోకొస్తాడు. మన హాల్లో కూర్చుంటాడు. మన బెడ్‌రూంలో మన పక్కనే నిలబడతాడు. మనల్ని క్వశ్చన్‌ చేస్తాడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి అంటాడు మనతోటి.


నేను ‘జులాయి’ సినిమాకు వెళ్లాను నాకు ఇప్పటికీ గుర్తుంది ఎర్రగడ్డ గోకుల్‌ థియేటర్‌ హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో.. తినడానికే డబ్బులు లేని సమయం, సినిమాకు టికెట్‌ కొనుక్కోవటం బాగా కష్టమైన రోజుల్లో వెళ్తే.. సినిమా మొత్తం అయిపోయింది. ఏదో అసంతృప్తి ఉంది. చివర్లో ‘క్లాస్‌లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్‌ చెప్తాడు. ఎగ్జామ్‌లో రాసేవాడే టాపర్‌ అవుతాడు’ ఆ ఒక్క మాటతో లేచి వెళ్లిపోయాను. ఎక్కడి వెళ్తున్నానో కూడా తెలియలేదు. ఒక మనిషిని ఇంతగా కదిలించగల శక్తి మాటకు మాత్రమే ఉంటుంది. అక్షరానికి మాత్రమే ఉంటుంది. ఆయన సినిమా రచయిత, దర్శకుడు అవటం మూలంగా, ముఖ్యంగా తెలుగు సినిమా దర్శకుడు అవడం మూలంగా ఇక్కడ ఉండిపోయారేమో అనే బాధ ఉంది. ఆయన సినిమా మాటలు రాసినందుకు నిజంగా నేను చింతిస్తున్నాను. ఎందుకంటే సినిమా మాటలకు విలువ లేదు అని అందరికీ ఓ నమ్మకం వచ్చేసింది. అందుకే మనం సినీ మహానుభావుల్ని గౌరవించుకోలేకపోయాం. వాళ్ల గురించి ఎవ్వరికీ తెలీదు. వాళ్లంతా మంచి మంచి మాటలు రాశారు. కేవలం తెలుగు సినిమాకు రాయడం వల్లే అలా మిగిలిపోయారు. అన్ని తెలిసినా ఏం తెలియని వాడిలా ఉండిపోయారు. అందుకే ఆయన తెలుగు సినిమాకు మాటలు రాయడం ఆయన దురదృష్టం. మన అదృష్టం.


(ఓ కార్యక్రమంలో పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ్‌ ఇచ్చిన ఉపన్యాసం ఆధారంగా... నేడు (నవంబరు 7) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ జన్మదినం నేపథ్యంలో ఆయన గురించి తన మాటలు తనకే కానుకగా ఇస్తున్న అభిమాని)


-రవి సారథి

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.