స్ఫూర్తినిచ్చిన త్రివిక్రమ్‌ ‘అర్జున్‌ పాల్వాయ్‌’
నేటి తరంలో మేటి రచయిత త్రివిక్రమ్‌. ఇప్పటి సినిమాలలో కూడా ఐటమ్‌ సాంగ్స్‌లలో చీర కట్టించడం, అన్నమయ్య లాంటి వాగ్గేయ కారుల కీర్తనలను వినిపించడం. ఖలేజా, అరవింద సమేతాలాంటి సినిమాలలో కవిత్వాన్ని సంభాషణలలో చొప్పించడం. ఇలాంటివన్ని ఒక్క త్రివిక్రమ్‌కే చెల్లు.. ఎంతో గుండె ధైర్యం ఉంటేకానీ...అంతకుమించి గుండె తడి ఉంటే కానీ ఇలా చేయడం కుదరదు... రెండున్నర గంటలలో మూడక్షరాల జీవితానికి సరిపడా పాఠాలను అందించే రచయిత అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక చదవుకున్న జ్ఞాని, ఒక పల్లెటూల్లో పెరిగిన పిల్లాడు.. విలువలు, సంప్రాదాయాల మీద గౌరవం ఉన్న వ్యక్తి...సాహిత్యం మీద ఎనలేని మక్కువ ఉన్న వాడు... ఒక రచయిత, ఒక దర్శకుడు అయితే... ఆ రూపం అచ్చూ మన గురూజీ త్రివిక్రమ్‌ లానే ఉంటుంది. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసి సృష్టించిన చాలా పాత్రల్లో నాకు స్ఫూర్తినిచ్చిన తీన్‌మార్‌ సినిమాలోని ‘‘అర్జున్‌ పాల్వాయ్‌’’ గురించి రాయాలనిపించింది. అందుకే అర్జున్‌ పాల్వాయ్‌కి-త్రివిక్రమ్‌కి కలగలిపి అభిమానిగా..నా ఇష్టాన్ని, గౌరవాన్ని..ఒక ప్రేమలేఖగా రాస్తున్నా..


అర్జున్‌ పాల్వాయ్‌ - రచ్చబండ మీద చర్చ కాదు వాడు..


* నిలువైతు మంచితనం
* కారణమున్న కోపం
* మరణంలేని ప్రేమ
* విలువలని వదలని బలహీనత
* అన్యాయానికి ఎదురెళ్ళే ధైర్యం.


అన్నీ కలిపి సాదాసీదా బట్టలేసుకున్న అయిదున్నర అడుగుల అసమాన వ్యక్తిత్వం వాడు.
‘‘పెళ్లికి ముందే ఇష్టమొచ్చినట్లు తిరిగేసి, మోజు తీరిపోయాక వదిలేసి, కొత్త వాళ్ళని వెతుక్కొనే రోజులు ముందు ముందు వస్తాయేమో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బ్రతికి ఉండటం కంటే చచ్చిపోడానికే ఇష్టపడతాను. వసుమతి నా భార్య ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేసి వెళ్లున్నా’’ అంటూ.. జీవితాంతం ఒక అమ్మాయినే మాత్రమే ప్రేమించే మనసున్న వాడు. నేటితరంలో దాదాపు కనుమరుగు అయిపోయిన కోహినూర్‌ డైమండ్‌ వాడు. కొట్టడానికి ఎత్తిన లాఠీనీ పట్టుకోవాలంటే చెయ్యి ఉంటే సరిపోదు, పిడికిలి కావాలి. ఆ పిడికిలికి బిగువే వాడు. గుండును నింపుకున్న తుపాకీకి అణిచివేసే బలం ఉంటుంది. వీడికి దానికి ఎదురెళ్లే గుండె ధైర్యం ఉంటుంది.

* మౌనంగా ఉన్న మహాసముద్రం
* కరుణతో కరిగే హిమాలయం
* హుందాగా నిలబడే ఒక పర్వతం
* స్థిరమైన వ్యక్తిత్వమున్న ఒక ఆకాశం
* సహనాన్ని నిండుగా నింపుకున్న నేల

అన్ని ఒక్కటయితే అర్జున్‌ పాల్వాయ్‌.
త్రివిక్రమ్‌ ఈ పాత్ర సృష్టికర్త. తన కలంతో ఈ పాత్రను చెక్కాడు. ఒక దర్శకుడిగా ఒక స్థాయిలో ఉన్నా, రచయితగా ఈ సినిమా (తీన్‌మార్‌)కి మాటలు రాశాడంటే ఈ అర్జున్‌ పాల్వాయ్‌ పాత్ర ఎంత ప్రేరేపించి ఉంటుందో కదా. వెనక్కి పరిగెడుతున్న కొన్ని వందల కాళ్ల మధ్య నుండి, రెండు కాళ్లు- కారుమబ్బు నుండి ఉదయించిన సూర్యడిలా ఎదురెళ్లడంతో తీన్మార్‌ సినిమాలో ఈ పాత్రను వెండితెరపై పరిచయం చేస్తూ త్రివిక్రమ్‌ ఒక మాట అంటాడు. ‘‘అర్జున్‌ పాల్వాయ్‌-యుద్ధంలో గెలిచిన సైనికుడు’’ అని... ఇంకా ‘‘ఒక సేనాధిపతి మరొక సేనాధిపతికి మాత్రమే చెప్పే సూత్రం ‘‘ది ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’’ ఒక స్వచ్ఛతతో కూడిన ధైర్యాన్ని ఇంతందంగా చెప్పొచ్చా అనిపించింది నాకు. అంతే అర్జున్‌ పాల్వాయ్‌ క్యారెక్టర్‌కి అభిమానినయిపోయా..


ఒక పుస్తకాన్ని చదివి జ్ఞానం పొందొచ్చు. ఒక పాట విని తన్మయత్వం చెందొచ్చు, ఒక కళని రెండు కన్నులుగా ప్రపంచాన్ని కొత్తగా చూడొచ్చు. ఒక కవిత్వాన్ని ప్రేమించి ప్రతీ కవితలో మరలా కొత్తగా పుట్టొచ్చు. ఆ విధంగానే నేను ఈ పాత్ర నుండి ఎంతో స్ఫూర్తి పొందాను. ఇలాంటి పాత్రలు, మరెన్నో అద్భుతమైన సంభాషణలు, సినిమాలు మీ నుండి మరెన్నో రావాలని మనసారా కోరుకుంటూ...మరో సారి పుట్టినరోజు శుభాకాంక్షలు...గురూజీ.
-Vరు, హైదరాబాద్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.