మాటలు నేర్పిన మాంత్రికుడు

నేను మాటలు నేర్చుకుంటున్నప్పుడు.. ఆయన సినిమాలకు మాటలు రాయడం మొదలుపెట్టారు. నాకు మాట్లాడటం రాదేమో అని సందేహపడినపుడు తన సంభాషణలతో పరోక్షంగా ధైర్యం నింపేవారు. మాట్లాడటం అంటే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు పదాలను పొదుపుగా వాడటం అని నేర్పించారు. వీడికి మాట్లాడటం రాదు అనే స్థాయి నుంచి వీడితో మాట్లాడలేం అనేంతగా నన్ను మార్చారు. మాటలు రాసే పనినే ఎంచుకునేలా చేశారు. ఆయనెవరో కాదు మాటల మాంత్రికుడు అని అభిమానులు పిలుచుకునే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.


- ప్రతి మనిషి ప్రస్తుతం ఓ అంశం నచ్చితే దానికి సంబంధించి గతం అన్వేషిస్తాడు, భవిష్యత్తు ఆరా తీస్తాడు. నేనూ ‘అతడు’ చిత్రంలో త్రివిక్రమ్‌ రాసిన ఓ డైలాగు విన్నాక అదే చేశాను. అది నాయకుడు, పత్రినాయకుడు మధ్య సాగే భారీ సంభాషణ కూడా కాదు. హీరో మహేశ్‌ బాబు, హీరోయిన్‌ త్రిష మధ్య వినిపించే నాలుగు పదాలున్న రెండు లైన్ల మాట.

త్రిష: నేనూ వస్తాను

మహేశ్‌: నేనే వస్తాను


రెండు సంభాషణలు ఒకటే అనిపించినా, ఒకే విధంగా కనిపించినా, ఒక్క అక్షరం మాత్రమే మారినా.. అందులో భావం చాలా ఉంది. ఇందులోనే త్రివిక్రమ్‌ గొప్పతనం కనపడుతుంది. కథ మొత్తం తెలిస్తేనే ఇది అర్థమవుతుంది. అలా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన రెండో చిత్రాన్ని తొలిసారి చూసిన నేను ఆయన రాసిన సంభాషణలు నచ్చడంతో గతంలో ఆయన ఏం చేశాడు, ఇంకేం రాశాడు? అనే పనిలో పడ్డాను.
- ఈ క్రమంలో కొన్ని సినిమాలు అప్పటికే చూసినా.. కథ, మాటలు: త్రివిక్రమ్‌ టైటిల్‌ కార్డు చూడగానే ఏదో ఆనందం. మనకు తెలియని విషయం ఏదో దొరుకుతుందని, కొంత స్ఫూర్తినిస్తుందని మళ్లీ చూడటం. ‘స్వయంవరం’తో కథ, మాటల రచయితగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు త్రివిక్రమ్‌. ఆ తర్వాత ‘సముద్రం’, ‘నువ్వే కావాలి’, ‘చిరు నవ్వుతో’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘వాసు’, మన్మథుడు’.. త్రివిక్రమ్‌ కలంతో కలకాలం చిలిచే చిత్రాలుగా మారాయి. ‘నువ్వే నువ్వే’ సినిమాతో దర్శకుడిగానూ తన ప్రతిభ చూపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన శైలిలో అలరిస్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఇలానే మాటలతో మైమరపించాలని కోరుకునే...


- అనుకోకుండా ఆయన్ను కలిసిన ఓ అభిమాని.


(త్రివిక్రమ్‌ కథ, మాటలు అందించిన తొలి చిత్రం ‘స్వయంవరం’ 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా...)Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.