ఎదురంటూ లేనేలేని మొనగాడు ‘వీడే’లే

నాకు తెలుగు పాటలంటే మహా ఇష్టం. సంగీతం, సాహిత్యం ఆకట్టుకుంటే చాలు ఒకటికి పది సార్లు వింటుంటా. ఈ మధ్యకాలంలో అలా ఆస్వాదించిన గీతం ‘ఎదురంటే లేనేలేని మొనగాడు వీడేలే’. రవితేజ కథానాయకుడుగా వచ్చిన చిత్రమిది. ఓసారి అనుకోకుండా యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌ని సెలెక్ట్‌ చేశా. ఎప్పుడో బాల్యంలో విన్నట్టుగా ఉన్నాయనుకుని మొత్తం పాటలు ఓ సారి తీరిగ్గా విన్నాను. ‘ఎదురంటే’ పాట చిన్నతనానికి తీసుకెళ్లింది. ఎందుకంటే ఆ రోజుల్లో తెలిసీ తెలియక పాడుతూ ఉండేవాడ్ని ఈ హుషారు గీతాన్ని. ఇప్పుడు ఎవరు రాశారు? సంగీతం ఎవరు? అని చూడగా భాస్కరభట్ల, చక్రి గారి పేరు కనిపించింది. ఆ ఇద్దరి కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. గుర్రానికంటే వేగంగా పరుగెట్టిస్తారు పాటని. ఈ గీతాన్ని చక్రినే ఆలపించడం మరో విశేషం. మొత్తంగా సంగీతం, సాహిత్యం, గానం నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. అలాంటి ఈ సాంగ్‌ గురించి ‘సితార’ పాఠకులతో పంచుకోవాలనిపించింది. చాలావరకు హీరో పరిచయ గీతమంటే తన చుట్టూ ఉండేవాళ్లు నాయకుడ్ని పొగుడుతుంటారు. ఇందులో హీరోనే(పాత్ర) గురించి చెప్తూ కొంత స్ఫూర్తి నింపుతాడు. సాధారణ పదాలతో పవర్‌ఫుల్‌ సాహిత్యం అందించి వావ్‌ అనిపించారు భాస్కరభట్ల. పల్లవిలో హీరోకి ఎదురు లేదు, గెలుపు తనదే, కోపంగా చూస్తే ఎవరైనా వణకాల్సిందే, కొడితే అడ్రస్‌ ఉండదు అని చెప్పారు. మొదటి చరణంలో.. ఊరికే రెచ్చిపోయే రకం కాదు ఊరి కోసం కండలైనా కరిగిస్తా అంటూ హీరోలోని మంచితనాన్ని తెలియజేశారు. బంధువులా సమస్య ఎప్పుడూ చెప్పిరాదు.. వచ్చినపుడు బెదరక దానికి ఎదురు తిరగాలనే స్ఫూర్తినిచ్చారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నూటికో, ఊరికో ఒక్కడైనా నిప్పులాగా ఉండాలని, మనిషంటే మాను కాదు మనకేంటి లాభం? అనుకోకూడదని చక్కగా ఆవిష్కరించారు. అంతేకాదు టైటిల్‌ ‘వీడే’కి తగ్గట్టు పల్లవిలో ‘వీడే’లే అని రాయడం.. అరే! ఇలా ఎలా రాస్తారో అనిపించింది. ఇప్పటి వరకు వినని సంగీత ప్రియులు ఓ సారి వినే ప్రయత్నం చేయగలరని కోరుకుంటున్నాను....-అరవింద్‌, సీతానగరం.

ఎదురంటే లేనేలేని మొనగాడు వీడేలే

జుంజుమారే జుంజుమారే జుంజుమారే జుం

రంగంలో నిలిచాడంటే గెలిచేది వీడేలే

జుంజుమారే జుంజుమారే జుంజుమారే జుం

కోపంగా చూశాడా ఎవడైనా అవుటేలే

కోటింగే ఇచ్చాడా శాల్తీలు డౌటేలే

ప్రేమిస్తే ప్రాణమిస్తానంటడు పిల్లడు

మాటిస్తే దానిమీదే ఉంటడు గుంటడు

డమ్‌ డమ్‌ డమ్‌ డొక్కే చించి డోలు కట్టేస్తా

ఎదురంటే లేనేలేని మొనగాడు వీడేలే

రంగంలో నిలిచాడంటే గెలిచేది వీడేలే

ఊరికే మరి ఏడుకొండలు రెచ్చిపోడు చూడు

ఊరి కోసమే కండలైన కరిగించుతాడు వీడు

కష్టమొచ్చినా నష్టమొచ్చినా కుంగిపోడు చూడు

అక్షరాలను లక్షలిచ్చినా లొంగిపోడు వీడు

తేడాలే వస్తే మంచేది వీడే

మంచోళ్లకేమో మంచోడులే

సూర్యుడిలా వీడు చెలరేగిపోతాడు

సుడిగాలిగా వీడు అసలే ఆగడు

భయమంటూ లేనివాడు వీడురా చూడరా

పులిపాలు తాగినోడ్ని నేనురా సోదరా

డమ్‌ డమ్‌ డమ్‌ డొక్కే చించి డోలు కట్టేస్తా

ఉప్పెనెప్పుడు చెప్పిరాదురా ఇంటి చుట్టమల్లే

వచ్చినప్పుడు వెన్ను చూపక ఎదురుతిరుగు నువ్వే

ఊరికొక్కడో నూటికొక్కడో నిప్పులాగ ఉంటే

దారుణాలకు అక్రమాలకు దారిఉండదంతే

ఆవేశం ఉంటే సరిపోదు కదరా

ఆలోచనే తొలి గెలుపవునురా

రాజాలాగా నువ్వు తలవంచకుండ ఉండాలి

చచ్చేలోగా ఏదో సాధించేయాలి

మనిషంటే మాను కాదు చూడరా సోదరా

మనకేంటి లాభమంటే కాదురా సోదరా

డమ్‌ డమ్‌ డమ్‌ డొక్కే చించి డోలు కట్టేస్తా

ఎదురంటే లేనేలేని మొనగాడు వీడేలే

రంగంలో నిలిచాడంటే గెలిచేది వీడేలే

ఎదురంటే లేనేలేని మొనగాడు వీడేలే

రంగంలో నిలిచాడంటే గెలిచేది వీడేలే

కోపంగా చూశాడా ఎవడైనా అవుటేలే

కోటింగే ఇచ్చాడా శాల్తీలు డౌటేలే

ప్రేమిస్తే ప్రాణమిస్తానంటడు పిల్లడు

మాటిస్తే దానిమీదే ఉంటడు గుంటడు

డమ్‌ డమ్‌ డమ్‌ డొక్కే చించి డోలు కట్టేస్తా..Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.