25 ఏళ్ల‌ ఘటోత్కచుడు

‘యమలీల’ తర్వాత కిషోర్‌ రాఠీ సమర్పణలో మనీషా ఫిలిమ్స్‌ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఘటోత్కచుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1995 ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డి ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘‘ ఘటోత్కచుడు పాతికేళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఘటోత్కచుడు పాత్రలో కైకాల సత్యనారాయణ ఒదిగిపోయారు. ఆయన అద్భుత నటన ఈ చిత్రానికి ప్రాణం పోసింది. కథానాయకుడుగా అలీకి ‘యమలీల’ తర్వాత మంచి క్రేజ్‌ తెచ్చిన సినిమా ఇది. ప్రముఖ కథానాయిక రోజా అందరినీ అలరించింది. రోబో చేసిన విచిత్ర విన్యాసాలు చిన్న పిల్లలను బాగా ఆకట్టుకుంది. ‘ఘటోత్కచుడు’, చిన్నపాపకి మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాన్ని హత్తుకున్నాయి. ప్రముఖ హీరో నాగార్జున గారి ప్రత్యేక గీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కర్ణుడిగా రాజశేఖర్, కృష్ణుడిగా చక్రపాణి, అర్జునుడిగా శ్రీకాంత్‌ ప్రేక్షకుల్ని రంజింపజేశారు. కృష్ణారెడ్డి అందించిన సంగీతం ఓ ఊపు ఊపింది. ‘జ జ జ్జ రోజా’, ‘అందాల అపరంజి బొమ్మ’, ‘ప్రియమధురం’, ‘భమ్‌ భమ్‌ భమ్‌’, ‘భామరో నన్నే ప్యార్‌ కారో’, ‘డింగు డింగు’ పాటలన్నీ చిరస్థాయిగా నిలిచాయి. ఈ చిత్రనిర్మాణం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. బుల్లితెరపై ఈ సినిమా ప్రదర్శితమవుతున్నప్పుడు చాలామంది ఫోను చేసి అభినందనలు తెలుపుతుండటం చాలా సంతోషంగా ఉంటుంది. నాకు, దర్శకుడికి ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ‘ఘటోత్కచుడు’ కోసం పని చేసిన చిత్ర బృందానికి, ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు, డిస్టిబ్య్రూటర్స్, ఎగ్జిబిటర్స్‌కి, అందరికీ కృతజ్ఞతలు’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.