‘ప్రమాణాలు’ వద్దనుకుంటే... ‘దొంగరాముడు’ వచ్చాడు
ఉత్తమమైన ధోరణిలో ప్రజారంజకమైన సినిమాలు తియ్యాలనే ఊహ 1938-40 నుంచి ఉన్నా... 1950 నుంచి ఆ ఆలోచన ఊపు అందుకుంది. విజయ, భరణి, జెమిని, వాహిని, ఎన్‌.ఎ.టి ప్రతిభా వంటి సంస్థలు నిత్యమూ చిత్రాలు తియ్యాలన్న సంకల్పంతో ఉన్నాయి. ‘ప్రజలకి ఎలాంటి చిత్రాలు కావాలో మాకు అర్థమైపోయింది’ అన్న ఆలోచన కాకుండా, ‘మంచిది మనం ఇస్తే ప్రజ ఆదరిస్తుంది’ అన్న ఆలోచన ఉండేది. సినిమాల ద్వారా ప్రేక్షకులు ఆశించేది ముఖ్యంగా వినోదం. దాంతోపాటు కథ, కాస్త వినోదం, సంగీత సాహిత్యాలూ ఉంటే ఆదరణకి లోటులేదు. ఈ కాలంలో పురాణాలు, జానపదాలు, సాంఘీకాలు అన్నీ వచ్చాయి. చిత్రీకరణలో, సాంకేతిక బలం పుంజుకున్నది. టెక్నీషియన్స్‌ బాగా బలపడ్డారు.


ఆ సమయంలోనే నాయక పాత్రలతో సినిమాల్లో స్థిరపడిన అక్కినేని నాగేశ్వరరావుకి తాము కూడా చిత్ర నిర్మాణం చేపట్టి ఉత్తమ చిత్రాలు తియ్యవచ్చుగదా అనే ఆలోచన వచ్చింది. సినిమాల మీద, పరిశ్రమ మీదా అవగాహన ఏర్పరుచుకున్న దుక్కిపాటి మధుసూదనరావు ఉన్నారు. నాగేశ్వరరావును మొదటినుంచి ప్రోత్సాహించిన వ్యక్తి. ఆయన సారథ్యంలో నిర్మాణం మొదలు పెట్టవచ్చునన్న ఊహ వచ్చింది. అయితే, ఎలాంటికథ? దర్శకుడు ఎవరు? అని ఆలోచించగా సంస్థని మొదలుపెడుతున్నారు గనుక, కె.విరెడ్డి చేత తీయిస్తే బాగుంటుందనుకున్నారు. ఎందుకంటే, రెడ్డి విధానాలు, ప్రణాళిక, కథ, సంవిధానం ఇవన్నీ తెలుస్తాయి. చాలా విషయాలు గ్రహించవచ్చును - అని ఉద్దేశించి కె.వి.ని అడగాలని నిర్ణయించుకున్నారు. అంతకుముందు భరణి రామకృష్ణని, పి.పుల్లయ్యనీ, బి.ఎన్‌.రెడ్డినీ అనుకున్నా కె.వి. అయితే మార్గదర్శకుడు కూడా కాగలడనే నమ్మకంతో ఉన్నారు. అప్పటికే, అన్నపూర్ణా పిక్చర్స్‌ని ప్రైవేట్‌ లిమిటేడ్‌ కంపెనీగా రిజిష్టర్‌ చేశారు. అక్కినేని ఛైర్మన్‌, దుక్కిపాటి మధుసూదనరావు మేనేజింగ్‌ డైరక్టర్‌. కంపెనీ డైరక్టర్లలో నవయుగ డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు ఉన్నారు. 1951లో రిజిస్ట్రేషన్‌ జరిగింది.


అక్కినేని, దుక్కిపాటి ఇద్దరు కె.వి.ని కలిసి మాట్లాడారు. పోతన, వేమన, గుణ సుందరికథ, పాతాళభైరవి... మొదలైన చిత్రాలు కె.వి.ప్రతిభను చెప్పగలిగే చిత్రాలు. అప్పుడు ఆయన వాహిని వారికి ‘పెద్దమనుషులు’ నిర్మిస్తున్నారు. ‘‘నేను కచ్చితంగా మీకు చిత్రం చేస్తాను. అయితే నా నియమం ప్రకారం నేను ఒక్క చిత్రమే చేస్తాను. అది అయితేనే, తర్వాతి చిత్రం గురించి ఆలోచన. పెద్దమనుషులు ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. అంతవరకూ నిరీక్షించగలరా?’’ అని అడిగారు కె.వి. నిరీక్షించడానికి నిర్మాతలకేమీ అభ్యంతరం లేదు. ‘తప్పకుండా ఆగుతాం’ అన్నారు. పారితోషికం విషయం అడిగితే కె.వి. అన్నారుట...‘‘ ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి. డబ్బు నాకు ప్రధానం కాదు. మంచి సినిమా ప్రధానం’’.


అప్పటికే అన్నపూర్ణవారు పెద్ద ఆఫీసు తీసుకున్నారు. కార్లు, డ్రైవర్లు. కె.వి. ఆఫీసు చూసి మనం మొదలు పెట్టడానికి ఇంకా చాలా వ్వవధి ఉంది. ఇంత పెద్ద బిల్డింగ్‌ అనవసరం. ఒక డ్రైవర్‌నీ, బాయ్‌ని పెట్టుకోండి చాలు. లేకపోతే అనవసరంగా ఖర్చులు పెరిగిపోతాయి అని సలహాఇచ్చారు. ‘అలా మొదటి పాఠం నేర్చుకున్నాం’ అన్నారు మధుసూదనరావు. ఆ బిల్డింగ్‌లోని, కింద భాగాన్ని యస్‌.వి.రంగారావుకి అద్దెకిచ్చి తాము మేడ మీద ఆఫీసు పెట్టుకున్నారు.

1951లో కంపెనీ స్థాపించినా, దర్శకుడి కోసం రెండు సంవత్సరాల కాలం నిరీక్షించారు అన్నపూర్ణవారు. దర్శకుడి కోసం ఇంతకాలం ఆగడం అన్నది చరిత్ర! ‘పెద్దమనుషులు’ 1954లో విడుదలైంది. అంతకుముందే నిర్మాణం పూర్తయిపోయింది గనుక, కె.వి. అన్నపూర్ణా వారికి కథా చర్చలు ఆరంభించారు. అసలు, అక్కినేని నాగేశ్వరరావుకి కె.వి. దర్శకత్వలో చెయ్యాలని ఆశ. నాగేశ్వరరావుతో సినిమాలు చెయ్యాలని కె.వి.కీ కోరిక ఉంది. ఆ రెండూ ఫలించబోతున్నాయి. కె.వి.రెడ్డి పద్ధతి ప్రకారం, చిత్ర రచయిత కూడా ముందు నుంచి తనతో ఉండాలి. ‘పెద్దమనుషులు’ తోటి రచయితగా వచ్చిన డి.వి. నరసరాజు, మధుసూదనరావుకీ తెలుసు. ఆయన కూడా కె.వి.లాగే ఒక్క సినిమాయే రాస్తారు. ఒక కథ అనుకున్నారు. ఒక ఆంగ్ల చిత్రం స్పూర్తి. నచ్చింది. చర్చలు ఆరంభించారు. కథాగమనం అవుతోంది. కొన్నాళ్లయ్యాక సందేహాలు ఆరంభమయ్యాయి. ముఖ్యంగా మధుసూదనరావుకి. ఆ కథలోని అంశం నాయకుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకొని పిల్లల్ని కని, ఇంకొక వనిత మోజులో పడతాడు! హీరో పాత్రధారి అలా చేస్తాడా! అది, అక్కినేనికి సరిపడేపాత్ర కాదని దుక్కిపాటివారు అభిప్రాయపడ్డారు. అయితే దర్శకుడితో చెప్పడానికి సంకోచించారు. కొన్నాళ్లయ్యాక తప్పలేదు. అనుమానం వ్యక్తపరిచారు. అప్పుడు కె.వి. అన్నారుట! ‘‘చూడండి మనం అయిదుగురం ఉన్నాం. అయిదుగురిలో ముగ్గురికి కథ నచ్చలేదు. అంటే ఎక్కువశాతం నచ్చని వాళ్లున్నారంటే రేపు ప్రేక్షకులూ అలాగే ఉంటారు. అంచేత, ఆ కథని పక్కన పెడదాం. వేరే ఆలోచిద్దాం’’ (ఈ కథే తర్వాత జయంతి వారికి ‘పెళ్లినాటి ప్రమాణాలు’గా వచ్చింది. అక్కినేని వారే హీరో. ఆయనకి ఆ పాత్రమీద మమకారం. అయితే ముందు నుంచి ఈ కథ మీద, రచన మీద చర్చలు చేస్తున్న నరసరాజు ‘పెళ్లినాటి ప్రమాణాలు’కు రచయిత కాదు. పింగళి నాగేంద్రరావు రాశారు.)


అప్పుడు అన్న, చెల్లెలు సెంటిమెంటు మీద కథ ఆలోచించి చర్చించారు. అది ‘దొంగరాముడు’ చిత్రం. మంచి సాహిత్యంతో పాటు, సంగీతం కూడా ఉంటే చిత్ర విజయానికి సహకరిస్తుందని దుక్కిపాటి వారి నమ్మకం. పూర్వ పరిచయం ఉన్న (నాటకాల ద్వారా) పెండ్యాల నాగేశ్వరరావుని తీసుకున్నారు. తొమ్మిది సందర్భాల్లో పాటలు వచ్చాయి. పాటలు సముద్రాల రాఘవాచార్యతో రాయించారు. షూటింగ్‌ ఆరంభానికి ముందే తొమ్మిది పాటలూ రికార్డింగ్‌ జరిపించారు. నాగేశ్వరరావు, జగ్గయ్య, రేలంగి, సావిత్రి, జమున, సూర్యకాంతం వంటినటుల్ని తీసుకున్నారు. ముఖ్యమైన విలన్‌ పాత్రకి ఆర్‌. నాగేశ్వరరావుని బుక్‌ చేసారు.


కె.వి.రెడ్డి దర్శకత్వం అంటే ఒక్క దర్శకత్వమే కాదు. నిర్మాణ సౌకర్యాలూ ఉంటాయి. క్రమశిక్షణాయుతమైన కళాశాలలా ఉంటుంది - కె.వి.పద్ధతి. సమయం, వేళ ప్రణాళికలు పాటిస్తూ నిర్మాణం సాగించారు. ‘‘కె.వి.రెడ్డి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. తర్వాత తర్వాత మా సంస్థ అలాంటి విధానలతోనే కొనసాగింది’’ అని మధుసూదనరావు చెప్పేవారు. 1955వ సంవత్సరం అక్టోబర్‌ 2వ తేదీన ‘దొంగరాముడు’ విడుదలై ప్రేక్షక హృదయాల్ని దోచుకుంది. ‘చిగురాకులలో చిలకమ్మా’, ‘భలేతాత మన బాపూజీ’, ‘అనురాగము విరిసేనా ఓ రేరాజా’, ‘రావోయి మాయింటికి’ మొదలైన పాటలన్నీ పెద్ద హిట్‌ అయినాయి. ‘అనురాగము విరిసేనా’ పాటలో పి.సుశీలకు పెద్దపీటవేశారు. ఈ సినిమాకి ‘మల్లేశ్వరి’కి పనిచేసిన ఆది ఎమ్‌. ఇరానీని ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. హాస్యానికి హాస్యం, సెంటుమెంటు, నటన అలా నవరసాలతో దొంగరాముడు ప్రజల్ని ఆకర్షించింది. తొలి చిత్రంతోనే అన్నపూర్ణా సంస్థ తను నమ్మిన సిద్ధాంతాన్ని నిరూపించుకోగలిగింది. అన్నపూర్ణావారు మంచి సినిమాలు అందిస్తారని ప్రేక్షకులు సంబరపడ్డారు.


చాలాచోట్ల ‘దొంగరాముడు’…కి శతదిన ఉత్సవాలు జరిగాయి. ఈ సినిమా విడుదలై 12, 13, ఏళ్ల తర్వాత నేను అన్నపూర్ణా ఆఫీసులో మధుసూదనరావుని కలిశాను. ‘దొంగరాముడు’ స్క్రిప్టు షాట్స్‌తో సహా బైండ్‌ చెయ్యబడి ఉంది. ‘అది ఇస్తే విజయచిత్ర పత్రికలో సీరియల్‌గా వేద్దామని కోరిక’ అన్నాను. ఆయన ఎందుకోమరి, ఇవ్వడానికి ఇష్టపడలేదు. అసలు, సినిమా స్క్రిప్టు అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? కె.వి.రెడ్డి స్క్రిప్టు అయితే, ఎంత కచ్చితంగా ఉంటుంది? అనేది తెలుస్తుందనీ, కొత్తగా వస్తున్న దర్శక నిర్మాతలకి మార్గదర్శకంగా ఉంటుందనీ నా ఆలోచన. ‘కానీ మీరు చూస్తానంటే ఇస్తాను. ఇక్కడ కూచుని చూడండి’ అన్నారు మధుసూదనరావు. ఇచ్చారు. అది చదివితే, దాన్ని అనుసరిస్తూపోతే, సినిమా గురించి ఏ అవగాహన లేనివాడయినా హాయిగా తియ్యగలడనిపించింది. షాట్స్‌ కోణాలు, నిడివి అన్నీ సుస్పష్టంగా టైపు చేయించి ఉన్నాయి. ఎడమ చేతి వేపు కె.వి దస్తూరిలో దృశ్యంలో కావలసిన వస్తువులు జాబితా ఉంది. ఒక దగ్గర ‘బిందె, బిందె నిండా నీరు. బిందెలో మునిగే చెంబు’ అని రాశారు. ఇంకో దగ్గర ‘బతికున్న తేలు’ అని రాశారు. నిర్మాణ శాఖ సహాయకులకి ఏ అనుమానమూ రాకుండా ఉండాలని ఆయన అంత అనుమాన రహితంగా రాసి ఉంటారన్న మాట. ‘మేము కె.వి చెప్పిన, చూపించిన దారిలోనే వెళ్లాలని ప్రయత్నించాము. తొలిరోజుల్లో సాధ్యమయింది. కానీ, రానురాను సాధ్యపడలేదు’ అని చెప్పారు మధుసూదనరావు.

‘దొంగరాముడు’ తర్వాత ఎలాంటి కథ తియ్యాలి? ఎవరు దర్శకుడు? ఆ ఆలోచనల్లో కె.విని అడిగితే ‘నేను వాహిని వారికి సినిమా చెయ్యాలి మన్నించండి’ అన్నారు.
                                                                                                                                                         
 - రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.