కృష్ణాసుయోధనీయం... శ్రీక్రిష్ణ పాండవీయం
నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ (ఎస్‌.ఏ.టి) అనగానే వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి నటరత్న ఎన్‌.టి.రామారావు. అరవై ఏళ్ళుగా ఈ సంస్థ చిత్రాలను నిర్మిస్తూ వస్తోంది. చిత్రరంగంలో నిలదొక్కుకున్న తొలి రోజులలోనే ప్రజారంజకమైన సినిమాలు నిర్మించాలనే సదుద్దేశంతో ఎన్టీఆర్‌ 1952లోనే నేషనల్‌ ఆర్ట్స్‌ సంస్థను నెలకొల్పారు. చిత్ర పరిశ్రమకు రాకముందు ఆ సంస్థ పేరు మీదే నాటకాలు వేసేవారు. తొలి ప్రయత్నంగా ‘పిచ్చి పుల్లయ్య’ సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. ‘‘సీతారామ కళ్యాణం’ సొంత చిత్రంలో రాముడి వేషం కాకుండా ప్రతినాయకుడైన రావణుని పాత్ర పోషించి మెప్పించారు. అదే స్ఫూర్తితో ‘శ్రీక్రిృష్ణ పాండవీయం’ సినిమాలో ఎన్టీఆర్‌ అటు కృష్ణుడుగా, ఇటు సుయోధనుడుగా రెండు విభిన్న పాత్రలలో నటించి, ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని లిఖించారు. చిత్రానువాదంతోపాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించి, ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్నారు. గతంలో ‘‘సీతారామ కళ్యాణం’, ‘గులేబకావళి కథ’ సినిమాలకు ఎన్టీఆరే దర్శకత్వం వహించినా తన పేరు మాత్రం క్రెడిట్స్‌లో వేసుకోలేదు. అయితే రామకృష్ణ: ఎస్‌.ఏ.టి. కంబైన్‌ పతాకంపై నిర్మించిన ఈ ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ సినిమాలోనే ఆయన పేరు దర్శకునిగా మొదటిసారి వెండితెరమీద దర్శనమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 13, 1966న విడుదలైన ఈ చిత్రం తొమ్మిది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.


‘‘సీతారామకల్యాణం’ సినిమాకు రావణబ్రాహ్మ పాత్రను విలక్షణంగా ఆవిష్కరించిన సముద్రాల రాఘవాచార్య ‘శ్రీక్రిృష్ణ పాండవీయం’ సినిమా కోసం భారత భాగవతాది గ్రంధాలలో వుండే ఉపాఖ్యానాలను నేపధ్యంగా తీసుకుని కథ అల్లి సంభాషణలు సమకూర్చారు. ఎన్టీఆర్‌ చిత్రానువాదాన్ని సొంతంగా రూపొందించుకున్నారు. సుయోధునుడి స్వాభిమాన ప్రవృత్తిని, రుక్మిణీదేవి - శ్రీకృష్ణుల ప్రణయ గాథను, భీమసేనుని సాహస కృత్యాలను ప్రముఖంగా చూపి ఈ సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్‌దే. శ్రీకృష్ణునిగా, సుయోధునునిగా ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్‌ ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. విజయవారి ‘‘మాయాబజార్‌’’ గొప్పతనానికి సరితూగిన సత్తా కలిగిన సినిమా ‘శ్రీక్రిష్ణ పాండవీయం’’.

కదను తొక్కిన కథనం
పాండురాజు మరణానంతరం పాండవులు హస్తినాపురంలో తమతో కలిసి ఉండడం కౌరవులకు కంటికింపుగా వుంటుంది. సుయోధనుడు పాండవులను కాశీలోని లక్క ఇంటిలోకి పంపి ఆ ఇంటిని దహనం చేయాలని పథకం పన్నుతాడు. శ్రీకృష్ణుని సలహాను అనుసరించి భీముడు సొరంగమార్గం తవ్వి అందరినీ సురక్షిత ప్రదేశానికి చేరుస్తాడు. అక్కడ రాక్షస కన్య హిడింబ భీమసేనుని మోహించడం, భీముడు హిడింబాసురిడిని చంపడం జరుగుతాయి. మరోవైపు భాగవతంలోని రుక్మిణీకళ్యాణ కథను మనోజ్ఞంగా చిత్రీకరించారు. అలాగే ఏకచక్ర పురవాసులకు కంటకింపుగా మారిన బకాసూరుడనే రాక్షసున్ని భీముడు సంహరించడం, ద్రుపదరాజు చాటించిన స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని భార్యగా పొందడం తదితర ఘట్టాలు కూడా జనరంజకంగా రూపొందాయి. పాండవులు సజీవులని తెలిసి ధృతరాష్ట్రుడు వారిని పిలిపించి రాజ్యం పంచి ఇవ్వడం, ధర్మరాజు రాజసూయయాగానికి సుయోధనుడు విచ్చేసి మహాసభలో విడిది చేయడం, భీముడు జరాసంధుని వధించడం లాంటి సన్నివేశాలు అద్భుతంగా అమరాయి. రాజసూయం పూర్తయిన సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణునికి అగ్రపూజ జరుపబోగా శిశుపాలుడు వ్యతిరేకించడం, శ్రీకృష్ణుడు అతని శిరస్సును చక్రాయుధంతో ఖండించిన విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో సినిమా ముగుస్తుంది.


అన్నీ విశిష్టతలే!
దుర్యోధనుని వ్యక్తిత్వాన్ని ఈ సినిమాలో వినూత్న కోణంలో చూపించారు. దుర్యోధనునికి సమకూర్చిన సంభాషణలు విలక్షణంగా ఉంటాయి. రుక్మిణిగా నటించిన కె.ఆర్‌.విజయ ముగ్ధ మనోహరంగా ఉంటుంది. భీముడిగా కన్నడ ఉదయ్‌కుమార్‌ నటన అద్భుతంగా కుదిరింది.

సెట్‌ రహస్యం:
వాహిని స్టూడియోలో నిర్మించిన మయసభ సెట్టింగుని చూసేందుకు నిర్మాత త్రివిక్రమరావు ఎవ్వరినీ అనుమతించేవారు కాదట. చివరికి ఆ స్టూడియో నిర్మాత నాగిరెడ్డికి కూడా ఆ సెట్టింగు చూసేందుకు అనుమతి లభించకపోతే, విషయం తెలుసుకున్న నందమూరి సోదరులు నాగిరెడ్డిని సగౌరవంగా ఆహ్వానించి మయసభ సెట్‌ చూపించారట.

శకుని పాత్ర విలక్షణం...
శకుని వేషానికి ఈ సినిమాలో ఒక విశిష్టత వుంది. దుర్యోధనుని దురాలోచనకు ఆజ్యం పోసే శకుని కౌరవ వినాశానికి ఎందుకు కారకుడయ్యాడనే ప్రశ్నకు ఈ సినిమాలో సమాధానం దొరుకుతుంది. దుర్యోధనునికి దీటుగా శకుని సంభాషణలుంటాయి. ముఖ్యంగా దుర్యోధనుడితో శకుని చెప్పే డైలాగు ‘‘అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్తుడై రారాజు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రిలోకం. ఒక వేళ నీవు పోకపోయిననూ, యాగమా ఆగునది కాదు. పోయినచో స్వజనుల మీద సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్ని, బలగాన్ని కనిపెట్టే అదనూ చిక్కుతుంది. వేయేల... కురుసార్వభౌముడు మాననీయుడూ, మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో. ఆపైన కొంచెపు వంచన పనులన్నిటికీ ఆయనవాణ్ణి, అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా, ముల్లుని ముల్లుతోనే తియ్యాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి’’లాంటి డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాగే శకుని రెండు అరచేతుల మధ్య పాచికలను రాపాడిస్తూ ‘పితుహూ’’ అని అరుస్తూ కుడిచేత్తో వాటిని ఎగరేస్తూ ఎడమచేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ ప్రతాకారేచ్ఛతో నవ్వే నవ్వులో దూళిపాళ ప్రదిర్శంచిన నటన అపూర్వం! ఇతర ప్రధానపాత్రల్లో కాంతారావు నారదుడుగా, యస్‌.వరలక్ష్మి కుంతీదేవిగా, బాలయ్య ధర్మరాజుగా, శోభన్‌ బాబు అర్జునుడుగా, రాజనాల శిశుపాలుడుగా, సత్యనారాయణ రుక్మిగా, రత్న హిడింబగా ఒదిగిపోయి నటించారు.


ప్రశంసల వర్షం... కాసులవాడ...
ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్ర బహుమతిగా రజత నందిని బహుకరించింది. తమిళంలో ఇదే సినిమాను ‘‘రాజసూయం’’ పేరుతో నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణ వ్యయం సుమారు ఏడు లక్షలు. రెండేళ్ల తరువాత మరలా విడుదలచేసినప్పుడు, ఈ సినిమా యాభై రోజులకుపైగా ఆడింది. 1986లో ఈ సినిమా హక్కులను ఆంధ్రా, సీడెడ్‌ ప్రాంతాలకు యాభై రోజులకు పైగానే ఆడింది. రిపీట్‌ రన్‌లో హైదరాబాద్‌ నగరంలో ఈ సినిమా శతదినోత్సవం చేసుకోవడం కూడా ఒక రికార్డే.


అలరించిన ‘రాజ’స సంగీతం..
ఎన్‌.ఎ.టి. సంస్థకు టి.వి.రాజు ఆస్థాన సంగీత దర్శకుడు. టి.వి.రాజు మద్రాసు చేరిన తొలిరోజుల్లో ఎన్టీఆర్‌తో కలిసి ఒక గదిలో వుండేవారు. ఆ అనుబందం చివరి దాకా కొనసాగింది. ఈ సినిమాలో ఎనిమిది పాటలు, 21 పద్యాలు వున్నాయి. ముందుగా మహాసభ అంగనలు దుర్యోధనుని స్వాగతిస్తూ పాడే ‘‘స్వాగతం సుస్వాగతం’’ పాటను గురించి చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌కి ‘దుర్యోధన’ అనే పదం కన్నా ‘సుయోధన’ అనే పేరంటే ఇష్టం. అందుకే సినారె ఈ స్వాగత గీతంతో సుయోధన అనే పదాన్ని వాడారు. అంతేకాదు ప్రతి చరణం చివర ఒక సంస్కృత ప్రౌఢసమాజాన్ని ఉపయోగించారు. ‘‘శతసోదర సంసేవిత సదనా, అభిమానధనా సుయోధనా’’ అంటూ పల్లవితో మొదలై ‘‘ధరణిపాల శిరోమకుట మణి తరుణకిరణ పరిరంజిత చరణా’’ అనే మొదటి చరణంతోనూ ‘‘కదనరంగ బహుదండధృత గదా ప్రకట పటు శౌర్యాభరణా’’ అనే రెండో చరణంతోనూ పాట సాగుతుంది. అర్ధంకాని సమాసాలున్నా, ప్రేక్షకులకు అర్ధంకాకున్నా ఈ పాటను గొప్పగా ఆదరించారు. సుశీల, లీల బృందం ఆలపించిన ఈ పాటను టివి రాజు హంసధ్వని రాగంలో స్వరపరిచారు. అంతేకాకుండా స్వాగత గీతం కనుక పాశ్చాత్య వాద్యాలను కూడా వాడి గంభీర ‘‘కాహళ’’ ధ్వనులతో అలరించారు. సినారే రాసిన మరొక గీతం హిడింబ భీముని వరించి పాడే ‘‘ఛాంగురే బంగారు రాజా’’ అనే జిక్కిపాట. సినారే ఈ పాటను రాసేముందు ఎన్టీఆర్‌ కొన్ని నిబంధనలు విధించారు. హిడింబ రాక్షసాంగన. ఆమె మానవాంగనగా మారి భీముని వరించే పాట కనుక వాడుకలోలేని పదాలతో, ప్రౌఢసమాసాలతో, జానపద ధోరణిలో, ఉసిగొలిపేలా ఉండాలనేది ఆ నిబంధన. సినారె వాడుకలోలేని అచ్చతెలుగు పదాలతో ఆ పాటకు రూపమిచ్చారు. ‘‘మజ్జారే మగరేడా, మత్తైన వగకాడా - అయ్యారే నీకే మనసియ్యాలని వుందిరా’’ అంటూ పల్లవి సాగుతోంది. చరణాల్లో మొలకమీసం, సింగపు నడుము, అమ్మకచెల్ల, మచ్చెకంటి, కైదండ వంటి జాను తెలుగు పదాలతో సినారె పాటకు గుబాళింపు తెచ్చారు. టి.వి.రాజు అద్భుతమైన స్వరాలు అందించి ఈ పాటను హిట్‌ చేశారు. కృష్ణుడు-రుక్మిణిలకు సముద్రాల ‘‘ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవానిజేరి’’ అనే యుగళగీతాన్ని రాస్తే టి.వి.రాజు రాగేశ్వరి రాగంలో ఆ గీతానికి బానీ కట్టారు. త్యాగరాజుస్వామి ‘‘సాధించనే మనసా’’ అనే కృతిలో వాడిన ‘‘సమయానికి తగు మాటలు’’ అనే పదాన్ని సముద్రాల ఇందులో వాడడం విశేషం. కొసరాజు గీతం ‘మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా’’ అనేది సందేశాత్మక గీతం. శ్రీకృష్ణుడు మారువేషంలో వచ్చి లక్కయింటికి కాపలా కాస్తున్న భీమునికి జాగ్రత్తలు చెప్ప గీతమిది. ఇందులో ‘‘పవిత్రాయాణ సాధూనాం’’ అనే భగవద్గీత శ్లోకాన్ని ‘‘కర్తవ్యం నీవంతు, కాపాడుట నావంతు... చెప్పడమే నాధర్మం, వినకపోతే నీ ఖర్మం’’ అని ముందుగానే హెచ్చరించడం నచ్చే విషయం. పి.బి.శ్రీనివాస్‌ నారదునికి పాడిన సముద్రాల గీతం ‘‘నల్లనివాడేనా ఓ చెలీ చల్లని వాడేలే’’; కొసరాజు రాయగా మాధవపెద్ది భీముని కోసం పాడిన ‘‘భళాభళా నా బండీ, పరుగుతీసే బండీ’’ కూడా సందర్భోచితమైనవే. పద్యాలలో సింహభాగం పోతన భాగవతం నుంచి తీసుకున్నవి కాగా, మిగతా పద్యాలకు రూపమిచ్చింది సముద్రాల. సంగీతపరంగా టి.వి.రాజు ‘పాండురంగ మహత్మ్యం’ సినిమా తరువాత అత్యుత్తమశ్రేణి బాణీలు ఈ సినిమాకు సమకూర్చడం మరువరాని విషయం.

ముక్తాయింపు:
ఈ చిత్రంలో రారాజు ప్రవేశమే అత్యద్భుతం. సంస్కృత పదభూయిష్టమైన దీర్ఘసమాసాలతో కూడిన ముందు మాటలను ఎన్టీఆర్‌ పలికిన తీరు నభూతో న భవిష్యతి. ‘‘దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై, నవఖండ భూమండల పరివ్యాప్తమై, దశౌక్షౌహిణీ సేనావాహినీ పరిరక్షితమై, శాత్రవ భయంకరమైన, ఈ కురుమహా సామ్రాజ్యమును శాసించు రారాజును నేను’’ అంటూ స్వోత్కర్షతో సాగే మాటలు రారాజు అతిశయాన్ని, దర్పాన్ని, అహంకారాన్ని, వెరిసి పాండవుల మీది అసూయను ప్రతిబింబిస్తాయి. పాత్రప్రవేశంలోనే ఈ లక్షణాలను చూపించడం ఎన్టీఆర్‌ స్క్రీన్‌ప్లే రచనా సమర్ధతక, దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ‘‘అణోరణీయాన్‌ మహతో మహియాన్‌’’ అనే ఉపనిషత్‌ సూక్తికి నిదర్శనం ఎన్టీఆర్‌.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.