అలరించిన అక్కినేని ‘ఆత్మబలం’
తెలుగు అక్షరమాలలో మొదటి అక్షరాలు ‘‘అ, ఆ’’లతో మొదలయ్యే సినిమాలు తీసింది జగపతి సంస్థ అధిపతి వి.బి.రాజేంద్రప్రసాద్‌. ఆ మొదటి అక్షరాల్లాగే ఆయన  తీసిన సినిమాలు కూడా మొదటి శ్రేణివే కావటం విశేషం. ఒకటా రెండా, ఏకంగా 34 సినిమాలు, అందులో 22 సినిమాలకు ఆయనే దర్శకుడు. వాటిలో ఒకటి ‘ఆత్మబలం’. విమధుసూదన్ రావు దర్శకుడు.  అక్కినేని, బి.సరోజ జంటగా నటించిన ఈ సినిమా  తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది.


విక్టరీల వి.బి. ప్రస్థానం...
కాకినాడ కళాశాలలో చదివే రోజుల్లో నాటకాలు వేస్తూ, సినిమాల్లో నటించాలని మద్రాసు చేరిన వి.బి. తన ప్రయత్నాలు ఫలించక నిర్మాత అవతారమెత్తి, ‘జగపతి పిక్చర్స్‌’ సంస్థను స్థాపించారు. మొదటి ప్రయత్నంగా మిత్రుడు రంగారావుతో కలిసి ‘అన్నపూర్ణ’ (1960)ను నిర్మించారు. అక్కినేని బిజీగా ఉండటంతో జగ్గయ్య హీరోగా నిర్మించిన ఆ చిత్రం విజయం సాధించింది. మలి ప్రయత్నంగా అక్కినేనితో ‘ఆరాధన’ తీశారు. అలా అక్కినేని జగపతి సంస్థలో వరుసగా 13 సినిమాల్లో నటించారు. వి మధుసూదన్ రావు దర్శకుడు.  జగపతివారి మూడో చిత్రం ‘ఆత్మ బలం’ 1964 జనవరి 9న విడుదలై 56 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ చిత్రవిశేషాలు పునశ్చరణ చేసుకుందాం.


కథేంటి?
ఆనంద్‌ (నాగేశ్వరరావు) ఒక మిల్లులో ఇంజినీరు. ఆ మిల్లు జగదీశ్వరి (కన్నాంబ)ది. దానికి మేనేజర్‌ కుటిల బుద్ధిగల మంగపతి (రమణారెడ్డి). జగపతి స్వభావాన్ని గ్రహించిన జగదీశ్వరి, తన వద్ద పెరుగుతున్న జయ (బి.సరోజాదేవి)కి మిల్లు బాధ్యతలు అప్పగిస్తుంది. ఆనంద్, జయలు పరస్పరం ప్రేమించుకుంటారు. జగదీశ్వరి కొడుకు కుమార్‌ (జగ్గయ్య)కి చిత్త చాపల్యం. అతడు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయాడని తెలిసి, అతడిని దారిలో పెట్టమని జగదీశ్వరి ఆనంద్‌ని అర్థిస్తుంది. ఆనంద్‌ అతడిని తీసుకొచ్చి తల్లికి అప్పగిస్తాడు. ఇంటికొచ్చిన కుమార్‌ జయను చూసి మోజుపడి ఆమెను పెళ్లాడతానంటాడు. జగదీశ్వరి తనకొడుకు పెళ్లి జయతో జరిపించే బాధ్యతను ఆనంద్‌కే అప్పగిస్తుంది. త్యాగమే ధర్మంగా భావించి ఆనంద్‌ జయను పెళ్లికి ఒప్పించి, ఉద్యోగం వదలి దూరంగా వెళ్లిపోతాడు. మిల్లు బాధ్యతల నుంచి తప్పించిన కోపంతో రగిలిపోతున్న మంగపతికి మంచి అవకాశం లభిస్తుంది. ఆనంద్‌-జయల ప్రేమ గురించి కుమార్‌కి చెప్పి, ఆనంద్‌ని హత్య చెయ్యమని వుసిగొల్పుతాడు. ఈలోగా జయ ఓ అర్థరాత్రి వేళ ఇంట్లోంచి తప్పించుకుని ఆనంద్‌ని ఆశ్రయిస్తుంది. కోరుకున్నది దక్కకపోతే ఎంతకైనా తెగించే మనస్తత్వం గల కుమార్, ఎలాగైనా ఆనంద్‌ని చంపాలని పథకం వేసి మారినట్లు నటించి అతడిని తన ఇంటికి రప్పిస్తాడు. ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడి, తనను ఆనంద్‌ చంపినట్టు నమ్మించేలా చాకచక్యంగా సాక్ష్యాలు సృష్టిస్తాడు. ఆనంద్‌కి ఉరి శిక్ష ఖాయమౌతుంది. తను చేయబోయే ప్రతి పనినీ ముందుగా డైరీలో రాసే అలవాటుగల కుమార్‌ డైరీ ఆధారంగా అతడికి వైద్యం చేసే డాక్టరు (గుమ్మడి) సాయంతో జయ, జడ్జి ఉత్తర్వులు పొంది ఆనంద్‌ని రక్షిస్తుంది. ఆనంద్‌ సీతకు తాళి కడతారు. ఆత్మబలంతో ఉరికంబం దాకా వెళ్లిన ఆనంద్‌ని జయ కాపాడుకోవటమే ఈ సినిమా కథ.


పరుగులు తీసిన పాటలు
పాటల పరుగులతోనే ‘ఆత్మబలం’ విజయవంతమైందని చెప్పుకోవటంలో తప్పులేదు. సినిమాలో పాటలన్నీ జనాదరణ పొందాయి. ఘంటసాల, సుశీల యుగళగీతం ‘‘చిటపట చినుకులు పడుతూవుంటే...చెలికాడే సరసన వుంటే’’ పాట సంచలనమే సృష్టించింది. సాంఘికాల్లో బహుశా ఇదే మొదటి వానపాట కావచ్చు. దర్శకుడు మధుసూదనరావు ఈ పాటను చిత్రీకరించిన విధానం ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ పాటకోసమే లెక్కలేనన్ని సార్లు సినిమా చూసిన వాళ్ళున్నారు. ‘‘మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే’’ చరణంలో సరోజాదేవి హావ భావాలు గిలిగింతలు పెడతాయి. ‘‘చలి చలిగా గిలి’ వేస్తుంటే...గిలిగింతలు పెడుతూ వుంటే’’లాంటి ఆత్రేయ పదప్రయోగాలు జనం నోళ్లలో నానాయి. మరో పాటను మొదట్లో ‘‘పరుగులు తీసే నీ వయసుకు ‘సిగ్గు’ వేసెను నా మనసు’’ అని ఆత్రేయ రాస్తే, మహదేవన్‌ సూచన మేరకు ‘సిగ్గు’ స్థానంలో ‘పగ్గం’ అనే పదాన్ని చేర్చారు. ‘‘హోయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు... ఓయని పలికే నీ వలపునకు తీయగా మారెను నా తలపు’’ ప్రయోగం, ‘‘తొణకని చెదరని నీ బిగువులతో దోబూచాడెను నా నగవు.. దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ మరులు’’ ప్రయోగం కూడా అలాంటిదే. అలాగే ‘‘గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి.. నీ కళ్లల్లో ఉన్నదీ బలే బాడాయీ’’ పాట సినిమాలో మొదటి పాటగా వస్తుంది. శంకరాభరణ రాగంలో కూర్చిన ఈ పాటలో ‘‘టీజింగ్‌’’ చాలా బాగుంటుంది. ఆత్రేయ రాసిన చరణం ‘‘వయసుతోటి దోరదోర సొగసులొస్తాయి. సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి.. ఆ చూపులతో లేనిపోని గీరలోస్తాయి.. ఆ గీరలన్నీ జారీపోవు రోజులొస్తాయి’’లో ‘‘దోర దోర’’, ‘‘ఓర ఓర’’ ‘‘లేనిపోనీ’’ వంటి పదాల ప్రయోగం వలన పాటకు మంచి ఊపు వస్తుంది. పై మూడు పాటలూ ప్రజాదరణ పొందిన పాటలైతే, ‘‘తెల్లవారనీకు ఈ రేయినీ... తీరిపోనీకు ఈ తీయని హాయిని’’ పాట అత్యుత్తమ రచన, అత్యద్భుత స్వరరచన, అంతకుమించి అసాధారణ చిత్రీకరణల కలబోత. ఈ పాటలో కొన్ని పదప్రయోగాలు అనిర్వచనీయమైనవి. ‘‘నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొనీ, ఆ కైపులో లోకాలే మరువనీ...మనసులో మనసునై మసలనీ...నీ మనిషినై మమతనై మురిసి పోనీ’’ అనే చరణంతో మొదలైన పదప్రయోగం ఎలా సాగుతుందంటే..‘నీ కురులే చీకటులై కప్పివేయనీ, ఆ చీకటిలో పగలు రేయి ఒకటైపోనీ, నీ వలపు వాన కురిసికురిసి తడిసిపోనీ, ఈ తడియారని హృదిలో నను మొలకలెత్తనీ’’... అంటూ హృద్యంగా సాగుతుంది. సరోజా దేవి తన మనసులోని ఆవేదనను పల్లవిలోనే తెలియజేసే మరో పాట ‘‘నాలుగు కళ్లు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి... ఉన్న మనసు నీకర్పణజేసి లేనిదాననైనాను’’ అనేది. మిగిలిన రెండు పాటలు ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’’, ‘‘రంజుబలే రామచిలకా’’ పాటలుకూడా సందర్భోచితాలు, జనరంజితాలే!’


సినిమా విశిష్టత
‘ఆరాధన’ సినిమా తీశాక భాగస్తుడు రంగారావు మరణించడటంతో జగపతి సంస్థకు ‘సోలో’ నిర్మాతగా మారి రాజేంద్రప్రసాద్‌ రూపొందించిన చిత్రం ‘ఆత్మబలం’. బెంగాళీ నవల ‘అగ్ని సంస్కార్‌’ దీనికి మూలం. ఈ నవల బెంగాలీలో ‘అతుల్‌ జహీర్‌ ఆహ్వాన్‌’ పేరుతో సినిమాగా కూడా వచ్చింది. తొలి చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి, మలి చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకులు కాగా, ‘ఆత్మబలం’ సినిమా నుంచి జగపతి సంస్థకు శాశ్వత సంగీత దర్శకులుగా కె.వి.మహదేవన్‌ నిలిచారు. ఆచార్య ఆత్రేయ దశాబ్దంపాటు గీతరచయితగా కొనసాగారు.


* గాయంతో నటించిన బి.సరోజ
ఈ సినిమా సమయానికి అక్కినేని హైదరాబాదు మకాం మార్చారు. ఆయన అభీష్టం మేరకు చిత్రాన్ని హైదరాబాదులోనే తీశారు. ఇందులో ‘చిటపట చినుకులు..’’ పాట చిత్రీకరణలో ఒక సంఘటన జరిగింది. ఆ పాట సమయానికి హీరోయిన్‌ బి.సరోజాదేవి బొంబాయిలో ఒక హిందీ సినిమాలో నటిస్తుండగా తలకు గాయమైంది. తర్వాత ఆమె మద్రాసులో చికిత్స పొందుతూ ఇంటికే పరిమితమైంది. గాయం నుంచి కోలుకోవటానికి రెండు నెలలు పట్టింది. ఈలోగా తమిళ సినిమాల షెడ్యూళ్లు మొదలవటంతో సరోజాదేవి బాగా బీజీ అయ్యారు. రాజేంద్రప్రసాద్‌ సరోజాదేవిని కలిసి షెడ్యూలు విషయం చెప్పి హైదరాబాదు రమ్మంటే, గాయం ఇంకా పూర్తిగా మానలేదు కాబట్టి మద్రాసులో షూటింగ్‌ ఏర్పాట్లు చేసుకోమంది. ఆ సంగతిని వి.బి. వివరించగా, అక్కినేని తన నిబంధనను సడలించి మద్రాసులో పాట చిత్రీకరణకు ఒప్పుకున్నారు. వానపాటలో నటిస్తే తలగాయం తిరగబెడుతుందని వారించినా బి.సరోజాదేవి తలకు గుడ్డ చుట్టుకొని ఆ చిత్రీకరణలో నటించారు. అక్కినేని మద్రాసులో 15 రోజులు మకాం వేసి సరోజాదేవితో వున్న షెడ్యూళ్లను పూర్తిచేశారు.

* మూడ్‌ రాని ఆత్రేయ
ఈ పాటకు సంబంధించిన మరో విషయాన్ని కూడా గుర్తుచేసుకోవాల్సిన అవసరముంది. చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చింది ఆత్రేయ. మొత్తం ఆరు పాటలు పెట్టాలని నిర్ణయించారు. అయితే రోజులు గడుస్తున్నా ఆత్రేయకి మూడ్‌ రావటం లేదు. చివరకి విసుగొచ్చిన వి.బి. మద్రాసు తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. ‘‘ఈ యువ నిర్మాత ముందు నేను అవమానం భరించటమా’’ అని ఆత్రేయ ఆ రాత్రి నిద్రపోలేదు. మూడ్‌ కూడా రాలేదు. అలాగే జాగారం చేశారు. తెల్లవారుతుండగా కబ్బన్‌ పార్కులోకి వెళ్లి సిమెంటు బెంచిమీద కూర్చున్నారు. ఉదయం నడక కోసం మెల్లగా జనం రావటం మొదలైంది. చిరుజల్లులు పడసాగాయి. కొత్తగా పెళ్లైన జంట కాబోలు నడక కోసం వచ్చి చినుకులకు వెరసి చెట్టునీడ కోసం ఒకరి నడుం మీద మరొకరు చేతులు వేసుకొని, పైటచెంగును ఇద్దరూ కప్పుకుంటూ పరుగెత్తటం ఆత్రేయ గమనించారు. ఇంకేం సబ్జక్టు దొరికింది. హోటల్‌ చేరుకొని ‘‘చిట పట చినుకులు పడుతూ వుంటే’’ పాట రాసి, దాంతో బాటు మరో రెండు పాటల పల్లవులు కూడా రాసి పాడుకున్నారు. మద్రాసు ప్రయాణానికి తలుపుతట్టిన వి.బి. చేతిలో పాటల కాగితాలు పెట్టారు. మహదేవన్‌ బాణీలు కట్టారు. అలా సాంఘిక చిత్రాల్లో మొదటి ‘రైన్‌ డ్యూయట్‌’ పురుషుడు పోసుకుంది. మొత్తం మీద రాజేంద్రప్రసాద్‌ తెలుగులతో 26, తమిళం, హిందీ భాషల్లో నాలుగు చొప్పున చిత్రాలు నిర్మించారు. అలా జగపతి సంస్థ ప్రస్థానం కొనసాగింది. 2003 సంవత్సరంలో రాజేంద్రప్రసాద్‌కి ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారాన్నిచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.