రంగా మలిచిన రంగుల శిల్పం ‘అమరశిల్పి జక్కన్న’
భారతీయ శిల్పకళ ప్రపంచానికే ఆదర్శం. శిలలపై శిల్పాలు చెక్కిమన శిల్పులు సృష్టికే అందాలు తెచ్చారని ఆచార్య ఆత్రేయ ఒక పాటలో అభివర్ణించారు. అయితే ఈ శిల్ప సంపద వెనుక దాగిన విషాదగాధలు కూడా కోకొల్లలే! వాటిలో అమరశిల్పి జక్కన్న ప్రేమ గాధ కూడా ఒకటి. సతీ వియోగంలో హృదయాంతరాళాల నుంచి వెలువడిన భావావేశంతో, అచేతనమైన గండశిలలను అత్యంత సుందర మూర్తులుగా తీర్చిదిద్ది, ఆ నల్లరాతి బొమ్మలకు ప్రాణంపోసి, నవరసాలు చిలికించి, తరతరాల శిల్పులకు ఒరవడిగా నిల్చిన జక్కనాచార్యుని హాళిబేడు శిల్పకళ, బేలూరు చెన్నకేశవ దేవాలయ నిర్మాణ కథల సమ్మేళనమే దర్శక నిర్మాత బి.ఎస్‌.రంగా నిర్మించిన రంగుల హరివిల్లు ‘అమరశిల్పి జక్కన’. ఈ సినిమా 1964 మార్చి 27న విడుదలైంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాంశాలను గుర్తుచేసుకుందాం.


* శిల్పకథ
మహాశిల్పి మల్లన్న (నాగయ్య) కుమారుడు జక్కన్న (అక్కినేని)కు వంశపారంపర్యంగా శిల్పకళ సంక్రమించింది. అద్వితీయ నాట్యకారిణి మంజరి (బి.సరోజాదేవి) జక్కన్నకు ప్రణయ దేవతగా అవతరించింది. ఆమె రూపాన్నే స్ఫూర్తిగా పొంది జక్కన్న అనేక అద్భుత శిల్పాలకు జీవం పోస్తాడు. మండల ప్రభువు గోపదేవుడు (ఉదయ్‌కుమార్‌) మంజరిపై కన్నేసి ఆమెను తనదాన్ని చేసుకోవాలనుకుంటాడు. మంజరి తన మేనమామ సుందరం (రేలంగి), అతని ప్రేయసి గంగమ్మ (గిరిజ)ల సాయంతో జక్కన్నను వివాహమాడతుంది. గోపదేవుడు కోపోద్రిక్తుడై జక్కన్న, మంజరిలను వేరుచెయ్యాలని పన్నాగం పన్ని, జక్కన్నను కొలువుకు రప్పించి వసంత మంటప శిల్ప నిర్మాణ పనులను అతనికి అప్పగిస్తాడు. మంజరి అందాలను, నాట్య భంగిమల్లో నిక్షిప్తంజేసి జక్కన్న వసంత మంటపాన్ని సజీవ శిల్ప వేదికగా తీర్చిదిద్దుతాడు. అక్కడే వున్న మంజరినీ స్వంతం చేసుకోవాలని భావించిన గోపదేవుడు జక్కన్న మలిచిన ఒక విగ్రహాన్ని విరగ్గొట్టించి, నూతన శిలాన్వేషణ కోసం అతడిని వూరు దాటించి, మంజరిని పుట్టింటికి పంపుతాడు. మంజరి తల్లిని లోబరుచుకొని మంజరిచేత బలవంతపు నాట్యం చేయిస్తుండగా చూసిన జక్కన్న, మంజరిని అపార్థం చేసుకొని, భగ్నహృదయంతో దేశాల పాలౌతాడు. విషయం తెలిసిన మంజరిని నదిలోదూకి ఆత్మార్పణకు పాల్పడగా, ఆమెను బెస్తవారు రక్షించి ఆశ్రమంలో చేరుస్తారు. అక్కడే మంజరి డంకన్న (హరనాథ్‌)కు జన్మనిస్తుంది. డంకన్నకు మల్లన్న వద్దకు చేర్చి, జక్కన్న జాడ కోసం మంజరి వెదుకుతూ ప్రమాదంలో చిక్కుకుని హోయసల మహారాణి శాంతలాదేవీ (పుష్పవల్లి) ఆశ్రమం పొందుంతుంది. మల్లన్నకు డంకన్న తన మనుమడే అని తెలియకున్నా, అతనికి శిల్పకళ, నేర్పుతాడు. డంకన్న మంచి శిల్పిగా, పేరు తెచ్చుకుంటాడు. జక్కన్న రామానుజచార్యులు (దూళిపాళ్ల) వారి ఆశ్రమం చేరతాడు. హోయసల సామ్రాట్టు విష్ణువర్థనుడు (జూ.ఎ.వి.సుబ్బారావు) బేలూరులో తలపెట్టిన చెన్నకేశవ దేవాలయ నిర్మాణ భారాన్ని రామానుజల వారు జక్కన్నకు అప్పగిస్తారు. మంజరి కూడా రామానుజులవారి చెంతచేరి వారి ఆజ్ఞ మేరకు జక్కన్నకు ఎదురు పడకుండా శిల్పకళలో అతనికి ప్రచ్ఛన్న సేవ చేస్తుంటుంది. మల్లన్నకు గురుదక్షిణగా జక్కన్నను తెచ్చి ఇస్తానని బయలుదేరిన డంకన్న కూడా బేలూరు చేరుకొని జక్కన్న చెక్కిన చెన్నకేశువుని విగ్రహంలో లోపం వుందని నిరూపించగా, జక్కన్న తన చేతిని నరికేసుకుంటాడు. విరిగిన చేత్తోనే మరో విగ్రహాన్ని మలిచి చెన్నకేశవ స్వామి కృపకు పాత్రుడై కోల్పోయిన చేతిని తిరిగి పొందుతాడు. మల్లన్న, జక్కన్న మంజరి, డంకన్నలు ఒకరినొకరు తెలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది.* సినిమా విశేషాంశాలు
మూడువేల సంవత్సరాల క్రితం పరిఢవిల్లిన హోయసల శిల్పకళ మన సంస్కృతి వికాసానికి సజీవసాక్ష్యం. యావత్‌ ప్రపంచాన్నే విస్మయ పరిచేలా శిల్ప సంపదనందించిన జక్కన్న ప్రణయగాధను తెరకెక్కించిన యోధుడు బి.ఎస్‌.రంగా. ‘అమరశిల్పి జక్కన్న’ చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతా పత్రం లభించింది. ‘లవకుశ’ (1963) సినిమా పంచరంగుల గేవాకలర్లో వచ్చిన మొదటి చిత్రం కాగా, ‘అమరశిల్పి జక్కన్న’ సినిమా కొడక్‌ ఈస్ట్‌మన్‌ కలర్లో వచ్చిన మొదటి చిత్రంగా సినిమా చరిత్ర పుటలకెక్కింది. ఆ రోజుల్లో ప్రాంతీయ భాషా చిత్రాలకు 10 ప్రింట్లకు మించి కలర్‌ ఫిలిం ఇవ్వరాదని జాయింట్‌ కంట్రోలర్‌ నిబంధన విధించడంతో కలర్లో సినిమా తీసేందుకు ఎక్కువమంది నిర్మాతలు ముందుకురాలేదు. కానీ స్వయంగా ఛాయాగ్రాహకుడు, దర్శకుడైన రంగాకు కలర్‌ ముడి ఫిలింని ఎంత పొదుపుగా వాడవచ్చో తెలియడం చేత ఈ సినిమాను కలర్లో తీసేందుకు సిద్దమయ్యాడు. అంతేకాకుండా కన్నడంలో తీసిన ‘అమరశిల్పి జక్కనాచార్య’ సినిమాని కూడా కలర్లోనే నిర్మించారు. కన్నడంలో కూడా కలర్లో తీసిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్ర రచనా సౌరభాన్ని గుబాళింపజేసింది సీనియర్‌ సముద్రాల. ఆరంభ సన్నివేశంలో అంధుడైన మల్లన్న, జక్కన్న చెక్కుతున్న శిల్పాన్ని స్పృశిస్తూ - ‘‘శిల్పం అవయవ పుష్టి, ఆకారం సొగసుగా ఉంది. కన్నులు లేని నరకమేమిటో నాకు తెలుసు’’ అన్నప్పుడు జక్కన్న ‘‘అలా అనకండి. ఎంత ప్రయత్నించినా మీ కళాసృష్టిలోని స్ఫూర్తి జీవం నాకు రావడంలేదు. నాకు ఎదుట వున్న గండశిల తమని ఇంకా సుందరంగా మలచుకోమని కోరుతున్నట్లుంది’’ అని జక్కన్న పలుకులకు తండ్రి ‘‘ఆ తియ్యటి అనుబంధం ఉండాల్సిందే, కానీ మనసు స్వాధీనంలో వుండాలి. కటిక రాళ్లతో సరసలాడి కళ్లుపోగొట్టుకున్నాను. ఆ తప్పు నువ్వు చెయ్యకు’’ అంటూ సలహా ఇస్తాడు. కళాకారులైన తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి కళానుబంధం ఉండాలో సముద్రాల మొదట్లోనే చెప్పారు. ఈ సన్నివేశానంతరమే ‘‘ఈ నల్లని రాలలో’’ పాట వస్తుంది. అదే సమయానికి రాజనర్తకి మంజరి మేనాలో వస్తూ జక్కన్న కంట పడుతుంది. అలా సినిమాని ప్రారంభించి సముద్రాల చివరకు క్లయిమాక్స్‌కు చేర్చుతారు. చిన్నతనంలో హాళిబేడు, బేలూరు దేవాలయాలను సందర్శించిన రంగాకు ఆ గాధల్ని సెల్యూలాయిడ్‌పై చిత్రించాలనే కోరిక వుండేది. ఆ బంగారుకల రంగుల చిత్రంగా రూపుదిద్దుకుంది.* చరిత్ర ఆనవాళ్లు!
చరిత్రను విశ్లేషిస్తే చెన్నకేశవస్వామి ఆలయంలో 42 మదనికల్ని వేర్వేరు భంగిమల్లో జక్కన్న మలిచాడు. వీటికి స్ఫూర్తి అపురూప లావణ్యవతి, నాట్యకారిణి అయిన మహారాణి శాంతలాదేవీ. ఆ ఆలయ మంటపంలో మహారాణి శాంతలాదేవీ నృత్యం కూడా చేశారని, చరిత్ర చెప్తుంది. అయితే ఈ చారిత్రక కథను కాస్త మార్చి శాంతలాదేవీ స్థానంలో సముద్రాల మంజరిని చేర్చారు. ‘‘మల్లీశ్వరి’’లో శిల్పి పాత్రలో రామారావు సినిమా అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేస్తే, ఈ చిత్రంలో అక్కినేని నటన మరుపురాని ముద్రనే వేసింది. తొలుత శాంతలాదేవీ పాత్రకు ఎస్‌.వరలక్ష్మిని ఎంపికచేసి, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినా, అనూహ్య పరిస్థితుల్లో పుష్పవల్లిని ఆ పాత్ర వరించింది. కన్నడ చిత్రంలో కూడా పుష్పవల్లే శాంతలాదేవిగా నటించింది. అక్కినేని అమెరికా యాత్రకు వెళ్లే సమయంలో ఈ చిత్రం విడుదలై మంచి టాక్‌తో ఆయనకు వీడ్కోలు చెప్పింది. ఈ సినిమా కోసం డి.ఎల్‌.నారాయణ రంగాకి ఎన్నో మంచి సలహాలు అందజేశారు. సినిమా చివరి సన్నివేశాన్ని బేలూరు చెన్నకేశవుని సన్నిధిలో చిత్రీకరించారు. సరోజాదేవితో పాటు నర్తించిన నాటి నటి కీ.శే.జయలలిత, రతన్‌ల నృత్యభంగిమలు ఉన్నత శ్రేణిలో దండాయుధపాణి ఇచ్చిన శిక్షణే కారణం. 18 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం 5 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుని విజయవంతమైన చిత్రంగా నిలిచింది.


* ‘రాజే(గే)శ్వర తుణీరాలు’
ఈ సినిమాకి సంగీతం ఆయవుపట్టు. రసాలూరు రాజేశ్వరరావు సమకూర్చిన సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తం 11 పాటల్లో సముద్రాల నాలుగు, నారాయణరెడ్డి, దాశరథి చెరిమూడు, కొసరాజు ఒక పాటరాశారు. చిత్రం తొలి సన్నివేశంలో పర్వతాల మధ్య జక్కన్న నిలబడి వాటిని చూసి తదాత్మ్యం చెంది ఆలపించే ‘‘ఈ నల్లని రాలలో - ఏకన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో’’ పాట సినారె ఆకాశవాణి కోసం రాసిన ‘‘నాగార్జున సాగరం’’ అనే సంగీత రూపకం నుంచి యథాతథంగా తీసుకున్నది. రాజేశ్వరరావు ఈ పాటను మోహన రాగంలో మొదలెట్టి ఆ రాగంలో లేని మధ్యమ విషాద స్వరాలను మేళవించి స్వరసంధానం చేశారు. ఘంటసాల గాత్రంలో గంభీరమాధుర్యాలను పండించిన ఈ పాట, అనేక కచేరిలలో గణనీయ స్థానాన్ని సంపాదించుకుంది. ‘‘కదలలేవు, మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు - ఉలియలికిడి విన్నంతనే, జలజల మని పొంగిపొరలు’’ అనే చరణంలో రాతిని మలిచితే శిల్పాలుగా రూపాంతరం చెందుతాయి అనే భావనను కవితా ధోరణిలో సినారె అద్భుతంగా రాస్తే, అంతే అద్భుతంగా రాజేశ్వరరావు తన వాయిద్యపు ఉలులను లయబద్ధంగా నడిపించాడు. ‘‘ఏదో గిలిగింత, ఏమిటీ వింత - ఏమనియందును ఏనాడెరుగను ఇంత పులకింత - కంపించే తనువంతా’’ పాట ‘రాముడు-భీముడు’ సినిమాలో ‘‘అదే నాకు అంతు తెలియక్నుది -ఎదో లాగు మనసు లాగుతున్నది’’ పాట ధోరణిలో సాగే సినారె మార్కు యుగళ గీతం. ‘‘యుగయుగాలు నీ నీలికనుల సోయగము చూడనీవే’’ లాంటి పద ప్రయోగం కాలాతీతంగా నిలిచే ప్రేమకు మార్గం చూపడమేనన్న సినారె మధుర భావన. ఆయనే రాసిన మరో పాట ‘‘నగుమోము చూపించవా గోపాలా- మగువల మనసుల నుడికింతు వేలా’’ అనే సుశీల పాడిన జావళి ‘‘ఎదుట వెన్నెల పంట - యెదలో తీయని మంట’’ అనడం విరహ తీవ్రతను గుర్తుచేసే ప్రయోగమైతే ‘‘కలువ పువ్వుల శయ్య పిలిచెను రావయ్య! నెలవంకలిడి నన్ను అలరించవేమయ్యా’’ అనడంలో సుకుమారపు శృంగార ప్రయోగముంది. రాజేశ్వరరావు భాగేశ్రీ రాగంలో ఈ జావళిని స్వరపరిచి ‘‘ఆహా’’ అనిపించుకున్నారు. ‘‘నిలువుమా నిలువుమా నీలవేణి - నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ’’ పాట సముద్రాల లలిత శృంగార గీతం. జక్కన, మంజరి పాడుకొనే తొలిరేయి గీతం ఈ పాట. సొంపులు - మురిపింపులు, వంపులు - కవ్వింపులు ప్రాస పదాలు సముద్రాల ట్రేడ్‌ మార్కులు, తిలంగ్‌ రాగంలో అమరిన ఈ యుగళ గీతాన్ని ఘంటసాల, సుశీల పాడిన విధానం, పాట సౌందర్యాన్ని ఇనుమడింపజేసింది. మరో సముద్రాల గీతం ‘‘మల్లెపూల చెండులాంటి చిన్నదానా-మనసంతా నీ మీద పిల్లదానా’’ పాట జానపద ధోరణిలో సాగే బెస్తవారు పాడుకునే పల్లె సీమ పాట. ఇందులో ప్రసిద్ధ నటి జయలలిత, రతన్‌ అభినయించారు. ‘‘మురిసేవు విరిసేవు ముకురమ్ము (అద్దము) జూచి - మరచేవు తిలకమ్ము ధరియించ నుదుట’’ అనే సముద్రాల గీతంలో జక్కన్న, రామాజనులవారికి తను చెక్కిన శిల్ప విశేషణాలను మంజరిని ఊహిస్తూ, ఒక్కొక్కటిగా వర్ణిస్తూ, వివరించే రాగమాలిక. ఈ పాటకు రాజేశ్వరరావు సింధుభైరవి, తిలంగ్, ఆరభి, కల్యాణి, కాపీ రాగాలను ఎంచుకొని స్వరరచన చేశారు. ఇక సముద్రాల చివరి పాట ‘‘తరమా వరదా కొనియాడు నీ లీలా’’, ‘‘శ్రీ వేణుగోపాల, చిన్మయానంద లీలా’’ సినిమాలో క్లయిమాక్స్‌లో వచ్చే చెన్నకేశవస్వామికి సమర్పించే అర్చన, ఆరాధన గీతం, ఆర్తిని ఆవిష్కరించే ఈ పాటను హరికాంభోజి రాగంలో రాజేశ్వరరావు స్వరపరిచారు. ‘‘అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరేయి నీదోయి స్వామీ’’ అంటూ మంజరి నాట్యం చేస్తూ ఆలపించే దాశరథి పాట ఒక మనోజ్ఞ సంగీత డోలిక. ప్రయోగాలు భావగర్భితాలే! ‘‘మధురమైన జీవితాల కథ యింతేనా - ప్రేమికులకు విధి యోసగిన వరమింతేనా’’ అనే దాశరథి నేపథ్య గీతం జక్కన్నపై చిత్రీకరించారు. హిందుస్థానీ జాన్‌పురి రాగ ఛాయల్లో సాగు ఈ పాట కూడా రసోస్ఫారకమే’’ ‘‘మనసే వికసించెరా ఈవేళ’’ అనే దాశరథి యుగళగీతం హిందోళ రాగంలో సాగుతుంది. కొసరాజు రాసిన ‘‘జంతర్‌ మంతర్‌ ఆటరా, ఇది అంతర్మథ్యం ఆటరా’’ పాట రేలంగి, గిరిజలపై చిత్రీకరించిన సాధారణ జానపద గీతం. కన్నడ చిత్రానికి కూడా సాలూరు వారే స్వరకర్తగా వ్యవహరించారు. ఘంటసాల స్వరాన్ని కన్నడలోని పి.బి.శ్రీనివాస్‌ స్వీరించారు (తరమా వరదా పాటను మినహాయిస్తే) కట్‌ చేస్తే ఈ సినిమా ఒక అందాల, సుస్వరాల హరివిల్లు.


- ఆచారం షణ్ముఖాచారి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.